హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకాశ్మీ ర్–లద్దాఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ టెండర్లలో కంపెనీ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ బిడ్లను శుక్రవారం తెరిచింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లు.
మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది. మొదట 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేయాలి. 2 కిలోమీటర్లు, 0.5 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) నిర్మించాలి. అలాగే జోజిల్లా టన్నెల్‌ను 14.15 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో రోడ్డును 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతన రీతిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్.సుబ్బయ్య తెలిపారు.
ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6 నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు రహదారి టన్నెల్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. మొత్తం మూడు సంస్థలు పోటీపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment