Industrial Development Corporation
-
మేఘా చేతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకాశ్మీ ర్–లద్దాఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ టెండర్లలో కంపెనీ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ బిడ్లను శుక్రవారం తెరిచింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లు. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది. మొదట 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేయాలి. 2 కిలోమీటర్లు, 0.5 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) నిర్మించాలి. అలాగే జోజిల్లా టన్నెల్‌ను 14.15 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో రోడ్డును 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతన రీతిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్.సుబ్బయ్య తెలిపారు. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6 నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు రహదారి టన్నెల్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. మొత్తం మూడు సంస్థలు పోటీపడ్డాయి. -
పారిశ్రామికాభివృద్ధికి కృషి: బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. టీఎస్ఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి గురువారానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. గత విధానానికి భిన్నంగా జిల్లా స్థాయికి టీఎస్ఐఐసీ కార్యకలాపాలను విస్తరించేలా కార్యాచరణ రూపొందించాం" అని అన్నారు. అంతేకుండా " హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా, తెలంగాణ అంతటా పరిశ్రమలను నెలకొల్పాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఈమేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో అనేక కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులను తీసుకొస్తున్నాం. ఏడాది కాలంలోనే కీలకమైన ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, మెడికల్ డివైజెస్ పార్కు, బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కు, ఏరోస్పేస్ పార్కు, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు, సైన్స్ పార్కు, టీ–హబ్ వంటి ప్రాజెక్టులకు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉంది’’ అని బాలమల్లు పేర్కొన్నారు. -
చౌక ఇళ్లకు సిడ్కో సై
సాక్షి, ముంబై: నవీముంబైలో పేదలకు గిట్టుబాటయ్యే ధరకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నిర్ణయం తీసుకుంది. దీంతో నవీముంబై ప్రాంత ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ముంబైకర్ల కోసం మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) అక్కడక్కడా చౌక ధరలకు ఇళ్లు నిర్మించి అర్హులైన వారికి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో సిడ్కో కూడా అర్హులకు లాటరీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం సుమారు రూ.16 లక్షలకు వన్ రూం కిచెన్, రూ. 24 లక్షలకు వన్ బెడ్రూం, హాలు, కిచెన్ (1-బీహెచ్‌కే) ఫ్లాట్లు అందజేయనున్నట్లు సిడ్కో అధ్యక్షుడు ప్రమోద్ హిందూరావ్ చెప్పారు. సిడ్కో నిర్మించనున్న మొత్తం 3,292 ఇళ్లకు లాటరీ వేయనున్నట్లు ఆయన వివరించారు. దరఖాస్తులు ఈ నెల 22 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు విక్రయిస్తారు. ప్రారంభంలో కేవలం 10 వేల దరఖాస్తులు మాత్రమే విక్రయించనున్నారు. ఖార్ ఘర్, సెక్టార్-36లో ఈ ఇళ్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో 7, 11 అంతస్తుల భవనాలుంటాయి. 2016 మార్చి వరకు ఈ ఇళ్లను యజమానులకు అందజేయాలని సంకల్పించినట్లు ఇందురావ్ చెప్పారు. ఈ ప్రాజెక్టు వివరాలు.. జూలై 22 నుంచి దరఖాస్తుల విక్రయం. 3,292 ఇళ్లకు లాటరీ. వన్ రూం కిచెన్ (307 చ.అ.) రూ.16 లక్షలు. బెడ్రూం, హాలు, కిచెన్ (370 చ.అ.) రూ.24 లక్షలు. డిపాజిట్ డబ్బులు వర్గాన్ని బట్టి రూ.25 వేలు, రూ.50 వేలు. అత్యల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16 వేల వరకు ఆదాయం ఉండాలి. అల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16-40 వేల వరకు ఆదాయం ఉండాలి. దరఖాస్తు ధర రూ.50.