సాక్షి, ముంబై: నవీముంబైలో పేదలకు గిట్టుబాటయ్యే ధరకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిటీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నిర్ణయం తీసుకుంది. దీంతో నవీముంబై ప్రాంత ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ముంబైకర్ల కోసం మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) అక్కడక్కడా చౌక ధరలకు ఇళ్లు నిర్మించి అర్హులైన వారికి అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఇదే తరహాలో సిడ్కో కూడా అర్హులకు లాటరీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం సుమారు రూ.16 లక్షలకు వన్ రూం కిచెన్, రూ. 24 లక్షలకు వన్ బెడ్‌రూం, హాలు, కిచెన్ (1-బీహెచ్‌కే) ఫ్లాట్లు అందజేయనున్నట్లు సిడ్కో అధ్యక్షుడు ప్రమోద్ హిందూరావ్ చెప్పారు. సిడ్కో నిర్మించనున్న మొత్తం 3,292 ఇళ్లకు లాటరీ వేయనున్నట్లు ఆయన వివరించారు.
దరఖాస్తులు ఈ నెల 22 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు విక్రయిస్తారు. ప్రారంభంలో కేవలం 10 వేల దరఖాస్తులు మాత్రమే విక్రయించనున్నారు. ఖార్ ఘర్, సెక్టార్-36లో ఈ ఇళ్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో 7, 11 అంతస్తుల భవనాలుంటాయి. 2016 మార్చి వరకు ఈ ఇళ్లను యజమానులకు అందజేయాలని సంకల్పించినట్లు ఇందురావ్ చెప్పారు.
ఈ ప్రాజెక్టు వివరాలు..
జూలై 22 నుంచి దరఖాస్తుల విక్రయం.
3,292 ఇళ్లకు లాటరీ.
వన్ రూం కిచెన్ (307 చ.అ.) రూ.16 లక్షలు.
బెడ్‌రూం, హాలు, కిచెన్ (370 చ.అ.) రూ.24 లక్షలు.
డిపాజిట్ డబ్బులు వర్గాన్ని బట్టి రూ.25 వేలు, రూ.50 వేలు.
అత్యల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16 వేల వరకు ఆదాయం ఉండాలి.
అల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16-40 వేల వరకు ఆదాయం ఉండాలి.
దరఖాస్తు ధర రూ.50.
చౌక ఇళ్లకు సిడ్కో సై
Published Wed, Jul 9 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement
Advertisement