Company Expansion
-
హైదరాబాద్‌లో తోషిబా 185 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తోషిబా కార్పొరేషన్ రూ. 185 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ యూని ట్ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా(టీటీడీఐ) సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని, ఇందుకోసం రూ. 185 కోట్లు (30 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ ఎలక్ట్రికల్స్‌ను గతేడాది రూ. 1,230 కోట్లకు తోషిబా కార్పొరేషన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో రూ.615 కోట్ల ఇన్వెస్ట్మెంట్... దేశీయ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో 2016లోగా రూ.615 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయంలో భాగంగా ఈ పెట్టుబడులను చేస్తున్నట్లు టీటీడీఐ కత్సుతోషి తొదా ఆ ప్రకటనలో తెలిపారు. దేశీయ విద్యుత్ రంగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించామని, ఈ పెట్టుబడులతో పెద్ద ట్రాన్స్ఫార్మర్స్తోపాటు కొత్త తరహా స్విచ్గేర్స్ను తయారు చేయనున్నట్లు తెలిపారు. 500 ఎంవీఏ సామర్థ్యం గల ఈ ట్రాన్స్ఫార్మర్స్ 765కేవీ విద్యుత్ ఉత్పత్తిని తట్టుకుంటాయన్నారు. కొత్తగా తయారు చేసే స్విచ్గేర్స్ హైవోల్టేజ్ ప్రోడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తాయన్నారు. దేశీయ విద్యుత్ సరఫరా, పంపిణీ మార్కెట్లో 2016 నాటికి 20 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుత్సతోషి తెలిపారు. 2017 నాటికి ప్రస్తుత విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఐదు రెట్లు పెంచే విధంగా 765కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భారీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్గేర్స్కు డిమాండ్ బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూరప్, ఏషియన్, ఆఫ్రికా దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు చేసే విధంగా బారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్లు కుత్సతోషి తెలిపారు. -
చౌక ఇళ్లకు సిడ్కో సై
సాక్షి, ముంబై: నవీముంబైలో పేదలకు గిట్టుబాటయ్యే ధరకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నిర్ణయం తీసుకుంది. దీంతో నవీముంబై ప్రాంత ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ముంబైకర్ల కోసం మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) అక్కడక్కడా చౌక ధరలకు ఇళ్లు నిర్మించి అర్హులైన వారికి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో సిడ్కో కూడా అర్హులకు లాటరీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం సుమారు రూ.16 లక్షలకు వన్ రూం కిచెన్, రూ. 24 లక్షలకు వన్ బెడ్రూం, హాలు, కిచెన్ (1-బీహెచ్‌కే) ఫ్లాట్లు అందజేయనున్నట్లు సిడ్కో అధ్యక్షుడు ప్రమోద్ హిందూరావ్ చెప్పారు. సిడ్కో నిర్మించనున్న మొత్తం 3,292 ఇళ్లకు లాటరీ వేయనున్నట్లు ఆయన వివరించారు. దరఖాస్తులు ఈ నెల 22 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు విక్రయిస్తారు. ప్రారంభంలో కేవలం 10 వేల దరఖాస్తులు మాత్రమే విక్రయించనున్నారు. ఖార్ ఘర్, సెక్టార్-36లో ఈ ఇళ్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో 7, 11 అంతస్తుల భవనాలుంటాయి. 2016 మార్చి వరకు ఈ ఇళ్లను యజమానులకు అందజేయాలని సంకల్పించినట్లు ఇందురావ్ చెప్పారు. ఈ ప్రాజెక్టు వివరాలు.. జూలై 22 నుంచి దరఖాస్తుల విక్రయం. 3,292 ఇళ్లకు లాటరీ. వన్ రూం కిచెన్ (307 చ.అ.) రూ.16 లక్షలు. బెడ్రూం, హాలు, కిచెన్ (370 చ.అ.) రూ.24 లక్షలు. డిపాజిట్ డబ్బులు వర్గాన్ని బట్టి రూ.25 వేలు, రూ.50 వేలు. అత్యల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16 వేల వరకు ఆదాయం ఉండాలి. అల్ప ఆదాయ వర్గాల వారికి నెలకు రూ.16-40 వేల వరకు ఆదాయం ఉండాలి. దరఖాస్తు ధర రూ.50. -
మెడికల్ రిఫ్రిజిరేషన్‌లోకి గోద్రెజ్
న్యూఢిల్లీ: గోద్రేజ్ అప్లయెన్సెస్ సంస్థ మెడికల్ రిఫ్రిజిరేషన్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇంగ్లాండ్‌కు చెందిన ష్యూర్ చిల్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ రంగంలోకి అడుగిడుతున్నామని గోద్రేజ్ అప్లయెన్సెస్ సీఓఓ జార్జి మెనెజెస్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ కల్లా వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం రెండు మోడళ్లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఒకటి వంద లీటర్ల కెసాపిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 3,000 నుంచి 3,500 వరకూ వ్యాక్సిన్లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.1.35 లక్షల నుంచి రూ.1.5 లక్షల రేంజ్లో ఉంటుందని వివరించారు. మరొకటి 50 లీటర్ల కెపాసిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 1,500 నుంచి 1,750 వరకూ వ్యాక్సిన్లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.65,000 నుంచి రూ.75,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రిఫ్రిజిరేటర్లలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్లను 8 నుంచి 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ ఏజెన్సీలకు విక్రయించడం, ప్రైవేట్ రంగ ఆసుపత్రులు, ఫార్మసీ చెయిన్లు, బ్లడ్ బ్యాంకులు లక్ష్యాలుగా వీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో ముంబైలోని విక్రోలి ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పుణేలో రూ. 30 కోట్ల పెట్టుబడులతో కొత్తగా నిర్మించే ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని జార్జి వివరించారు.