హిమాలయాలు... వింధ్య పర్వతాలు... వీటిని చూడాలని ఎవరికి ఉండదు? రాబోయే వేసవి సెలవుల్లో పర్వత సౌందర్యం చూడాలని చాలామంది అనుకుంటారు. కాని ఆరోగ్య, వయసు సమస్యలు, దివ్యాంగ పరిమితులు కొందరిని భయపెట్టవచ్చు. అయితే ఎవరికైనా సరే పర్వతాలను దగ్గరుండి చూపిస్తాం అంటున్నారు ముగ్గురు మహిళా ట్రెక్ గైడ్లు – శశి, గునిత్, అనుష.
పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ వీరు అపరేట్ చేస్తున్న ట్రెక్ టూర్లు అద్భుత పర్వత దర్శనం చేయిస్తున్నాయి.
‘కలగను.. కనుగొను’ అనే ట్యాగ్‌లైన్ ఉంటుంది అనుష, శశి, గునీత్ నడిపే ‘బొహెమియన్ అడ్వంచర్స్’ అనే ట్రెకింగ్ ఏజెన్సీకి. లోకాన్ని చూసి రావాలన్న కలను నెరవేర్చుకోవడానికి దారిని కనుగొనమని, ఆ దారి కనుగొనడంలో తాము సాయం చేస్తామని అంటారు వీరు ముగ్గురు.
మన దేశంలో పూర్తిగా స్త్రీలు మాత్రమే నడుపుతున్న ట్రెకింగ్ ఏజెన్సీలలో వీరిది ఒకటి. అయితే వీరి ప్రత్యేకత అంతా పర్వతాలే. ‘డెహరాడూన్‌లో మా ఆఫీస్ ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో, లద్దఖ్‌లో, హిమాలయాల బేస్ క్యాంప్ వరకు, వింధ్య పర్వతాల్లో మేము పర్వతారోహణకు తీసుకెళతాం.
ప్రతి ముగ్గురు టూరిస్టులకు ఒక గైడ్ అనే పద్ధతిని మేము పాటిస్తాం.అందుకే వృద్ధులు, పిల్లలు, ఒంటరి స్త్రీలు... ఎవరైనా సరే క్షేమంగా మాతో పాటు ట్రెకింగ్ చేయవచ్చు. మా గైడ్లు కూడా స్ట్రీలే. అందుకే మేము నిర్వహించే పర్వత యాత్రలకు విశేషంగా టూరిస్టులు వస్తారు’ అంటుంది శశి బహుగుణ.
2013లో మొదలు
బ్యాంకింగ్ రంగంలో పని చేసే శశి బహుగుణది డెహ్రాడూన్. పబ్లిషింగ్ రంగంలో పని చేసిన గునిత్ పురిది రుద్రపూర్ (ఉత్తరాఖండ్). గతంలో బిజినెస్ జర్నలిస్ట్‌గా పని చేసిన అనుష సుబ్రమణియన్‌ది ముంబై. వీరు ముగ్గురికీ పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. తరచూ చేసే ట్రెక్కింగ్‌లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. అయితే 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదలు వీరు ముగ్గురిని కదిలించాయి.
వెంటనే పనులన్నీ ఆపి వరద ప్రాంతాలకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటకులను కాపాడారు. ఆ సమయంలోనే వారికి అనిపించింది పర్యాటకులను సురక్షితంగా ఉంచే పర్వతారోహణ యాత్రలను నడిపే సంస్థను ప్రారంభించాలని. ‘అబ్రహం లింకన్‌ను గుర్తు చేసుకున్నాం. పర్వతాల వలన పర్వతాల చేత పర్వతాల కొరకు ఇకపై బతకాలని నిర్ణయించుకున్నాం’ అంది శశి బహుగుణ.
ట్రెకింగ్‌ను ఎక్కువగా శశి ప్లాన్ చేస్తుంది. గునిత్ వాహనాలు నడపడంలో ఎక్స్‌పర్ట్. వంటలో కూడా. అనుష మంచి గైడ్. ‘అందువల్ల మేము కారులో హిమాలయాల్లోని ప్రతి మూల తిరిగాము. మాకు తెలియని పర్వత దారులు లేవు’ అంటారు వారు.
ప్రతి ఒక్కరికి హక్కుంది
‘పర్వతారోహణ అంటే వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్లనే అందరూ అనుమతిస్తారు. కాని మేము ఆ నియమం పెట్టుకోలేదు. ఇన్‌క్లూజివ్ ట్రెకింగ్స్‌ను నిర్వహించాలనుకున్నాం. అనారోగ్యం ఉన్నవారిని, దివ్యాంగులను కూడా ఆరోహణకు తీసుకెళ్లాలనుకున్నాం. ఎందుకంటే పర్వతాలు అందరివి. అందరికీ వాటిని చూసే హక్కుంది.
అందుకే పర్వతాలు చూడాలనుకుని వచ్చేవారి హెల్త్ హిస్టరీ అంతా చెక్ చేస్తాం. వారికి ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తాం. అంధులను కూడా చేయి పట్టి 50 కిలోమీటర్ల దూరం మేరకు ట్రెకింగ్‌కు తీసుకెళ్లిన అనుభవం మాకు ఉంది.
పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నవాళ్లను కూడా తీసుకెళ్లాం. డయాబెటిక్ పేషెంట్లు కూడా వచ్చారు. అయితే ప్రతి దశలో ఆరోగ్యం చెక్ చేయిస్తూ తీసుకెళతాం. మరీ జటిలంగా మారితే వెంటనే హెలికాప్టర్ తెప్పించి వెనక్కు పంపించేస్తాం’ అంటారు వారు.
పహాడీ గైడ్లు
అనుష, శశి, గునిత్‌లు తాము నడుపుతున్న ట్రెకింగ్‌ల కోసం స్థానిక యువతులను గైడ్లుగా తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ‘అందరూ కొండప్రాంతం వారే. లోకల్ గిరిజన యువతులు. వారికి పర్వతాలు కొట్టిన పిండి. అందుకని వారికి తగిన శిక్షణ ఇచ్చి మా టీమ్‌లో కలుపుకున్నాం.
మా దృష్టి ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలపై ఉంటుంది. వీరు పిల్లలు ఎదిగొచ్చాక పర్యటనలకు వెళదామనుకుంటారు. అటువంటి వారికి సురక్షితమైన ఏజెన్సీలు ఉన్నాయని తెలియాలి. వారు ఊపిరి పీల్చుకుంటే కుటుంబ కార్యక్రమాల్లో మళ్లీ ఫ్రెష్‌గా పడతారు.
మా విన్నపం ఏమంటే ఒంటరిగా తిరగాలనుకున్నా మంచి ఏజెన్సీలను చూసి వెళ్లండి వెళ్లనివ్వండి అని చెప్పడమే’ అంటారు.
పర్వతాలను చూపడానికి చుక్కానులుగా మారిన ఈ ముగ్గురు అభినంద నీయులు.
Comments
Please login to add a commentAdd a comment