joshimath
-
జోషీమఠ్‌లో మరో విపత్తు.. స్థానికుల్లో ఆందోళన
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కుంగుబాటు ఘటనను పూర్తిగా మరువకముందే మరో విపత్తు చోటుచేసుకుంది. తాజాగా జోషిమఠ్, బద్రీనాథ్ హైవే మధ్యలో అత్యంత లోతైన గొయ్యి ఏర్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ గొయ్యి మూడు అడుగుల వెడల్పు కలిగివుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి ఈ గుంతను పూడ్చారు. అయితే చాలాచోట్ల వాటంతట అవే ఇలాంటి గుంతలు ఏర్పడటం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సంవత్సరం జోషిమఠ్‌లో పలు చోట్ల భూమి కుంగిపోయింది.ఈ నేపధ్యంలో తక్షణం కొన్ని వందల కుటుంబాలవారిని ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణం ఇక్కడికి సమీపంలోని ప్రాజెక్టులేనని నిపుణులు తెలిపారు. తరుచూ ఇక్కడి భూమి కుంగిపోతున్నందున జోషిమఠ్‌ను మునిగిపోతున్న ప్రాంతంగా ప్రకటించారు. -
జోషీమఠ్‌లో కానరాని ప్రచారం.. కారణమిదేనా?
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పేరు వినగానే గతంలో అక్కడ చోటుచేసుకున్న భూమి కుంగుబాటు ఉదంతం గుర్తుకు వస్తుంది. ఇంతకుమునుపు ఈ ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు ఈసారి ఈ సమీప ఛాయలకు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రచారం సాగిస్తున్నాయి. నేతలు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, చమోలి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కనిపించడం లేదు. రాజకీయ నేతలు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో జోషీమఠ్, దసౌలి డెవలప్మెంట్ బ్లాకులో భూమి కుంగిన దరిమిలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు తమను ప్రశ్నిస్తారనే భయంతో ప్రచారానికి నేతలు వెళ్లడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోషీమఠ్‌కు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకపోవడం విశేషం. కాగా లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో అంటే ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్, గర్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధమ్ సింగ్, హరిద్వార్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. -
మంచుకొండల్లో మహాముప్పు.. తక్షణం అడ్డుకట్ట వేయకుంటే విధ్వంసమే
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్‌లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్‌పోస్టులు, హెలిప్యాడ్లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఎల్ఏసీ వెంట అధిక ముప్పు.. భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్‌హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్‌కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్‌లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్‌లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నిర్మాణాలు టిబెట్ పీఠభూమిలో ► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం ► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం ► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు ► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్‌లు ► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు ► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి. ► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం నేపాల్ వైపు ► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ► ఉద్యాన వనాలు ► హైడ్రోపవర్ ప్రాజెక్టులు ► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు ► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన భారత్ నిర్మాణాలు ► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ► అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిమ్‌లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు ► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్లను కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు ► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్పీడీ)హైవే ► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం ► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి. ► సింధు నదికి సమీపంలో చిలాస్‌లో డ్యామ్‌లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది. ► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ► అవలాంచ్‌లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి ► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్‌లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. ► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు. ► భారత్‌లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు. ► భారత్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. ► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైన్సును తొక్కిపెట్టడం ప్రజాహితమా?
జోషీమఠ్ కొంతకాలంగా కుంగిపోతూ ఉందని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన కీలకమైన నివేదికను గుర్తించడానికి బదులుగా... దేశీయ శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ నిషేధాజ్ఞను జారీ చేసింది. శాస్త్రీయ సమాచారాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించడంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తన అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో సైన్స్ పాత్రకు సంబంధించింది. జీఎం ఆహార పదార్థాలు, నాసిరకం మందులు, డేటా గోప్యత, సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో నిపుణుల అభిప్రాయాలు ఆరోగ్యకరమైన చర్చకు వీలుకల్పిస్తాయి. జోషీమఠ్ సంక్షోభం మరొక తత్సమానమైన తీవ్ర సవాలును దేశం ముందు ఉంచింది. అదేమిటంటే భారతీయ శాస్త్ర పరిశోధనా మండలులను, విద్యావిషయిక సంస్థలను నెమ్మదిగా క్షీణింపజేస్తూ రావడమే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ అనుబంధ విభాగమైన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సి) అందించిన రిమోట్ సెన్సింగ్ డేటాపై ఆధారపడి, జోషీమఠ్ కుంగుబాటుపై కీలకమైన ప్రాథమిక అంచనా జనవరి 11న వెలువడింది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య జోషీమఠ్ 9 సెంటీమీటర్లు కుంగిందనీ, డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 8 మధ్యలో మరింత వేగంగా కుంగిందనీ ఈ నివేదిక తెలిపింది. జోషీమఠ్‌లో పరిస్థితి తీవ్రతను ఎత్తిచూపిన మొట్టమొదటి శాస్త్రీయ నివేదిక ఇదే. ఈ నివేదిక తీవ్రతను గుర్తించి, సకాలంలో వ్యవహరించడంలో తాను విఫలమయ్యాయని ఒప్పుకోవడానికి బదులుగా శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ (ఎన్డిఎమ్ఏ) నిషేధాజ్ఞను జారీ చేసింది. సాంప్రదాయిక లేదా సామాజిక మాధ్యమాల ద్వారా జోషీమఠ్‌పై ఎలాంటి సమాచారాన్ని లేక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకోవద్దని ఆదేశించింది. ఎన్ఆర్ఎస్సి, ఇస్రోలను మాత్రమే కాదు; శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి; శాస్త్ర, సాంకేతిక విభాగం; జలవనరుల మంత్రిత్వ శాఖ; ఐఐటీ–రూర్కీతోపాటు సర్వే ఆఫ్ ఇండియా, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి పలు శాస్త్రీయ సంస్థలకు చెందిన పరిశోధనా ల్యాబ్‌ల నోరు మూయించారు. ఈ సందర్భంగా ఎన్డీఎమ్ఏ ఆదేశం కనీవినీ ఎరుగనిదీ. ఎన్డీఎమ్ఏ కానీ, హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ శాస్త్రీయ పరిశోధనా సంస్థల మాతృసంస్థలు కావు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఎన్డీఎమ్ఏ ఆదేశం సూచించినందున, ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే. ఇస్రో, íసీఎస్ఐఆర్ వంటి సంస్థలు కాగితం మీద అయినా సరే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఇవి హోంశాఖ పర్యవేక్షణలో లేనేలేవు. కొద్దినెలల క్రితమే, అన్ని శాస్త్ర విభాగాల కార్యదర్శులతో సమావేశానికి పిలుపునిచ్చిన హోంశాఖ కార్యదర్శి తన అధికారాల పరిధిని అతిక్రమించడమే కాకుండా ఇంతవరకు శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఇచ్చిన అవార్డులన్నింటినీ ఒక్క కలంపోటుతో రద్దు చేసిపడేశారు. జన్యుపరంగా పరివర్తింపజేసిన ఆహార ధాన్యాలపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలూ చేయవద్దంటూ... పనిచేస్తున్న, రిటైరైన శాస్త్రవేత్తలను ఐసీఏఆర్ ఇటీవలే తీవ్రంగా హెచ్చరించింది. శాస్త్ర పరిశీలనలపై ఆధారపడిన చర్చలు, వాటి సమాచారాన్ని ప్రజలకు పంచిపెట్టడాన్ని ప్రోత్సహించాలి. అనేక రంగాలలో శాస్త్రవేత్తలు నిత్యం డేటాను పంచుకుంటారు. అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిష్ట్రేషన్ (నాసా)కు రిమోట్ సెన్సింగ్ డేటాను నిత్యం షేర్ చేసే పోర్టల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు చోటుచేసుకున్నా దానికి సంబంధించిన డేటాను యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెబ్సైట్లో రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంచుతుంటారు. ఇక జెనెటిక్ సీక్వెన్స్ డేటాబేస్లు ప్రపంచమంతటా శాస్త్రపరిశోధకులకు అందుబాటులో ఉంటున్నాయి. ఎన్ఆర్ఎస్సి రూపొందించిన అంచనాల్లో ఒక భాగం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహం సెంటినెల్–1 నుంచి తీసిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఈ ఉపగ్రహం సింథెటిక్ అపెర్చుర్ రాడార్‌ని కలిగివుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రింబవళ్లు డేటాను సేకరించడంలో ఇది తోడ్పడుతుంది. ఎన్ఆర్ఎస్సి మదింపులో రెండో భాగం భారతీయ ఉపగ్రహమైన కార్టోసాట్–2ఎస్ నుంచి పంపిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఇది 0.65 మీటర్ల రిజల్యూషన్ తో అన్ని రంగులను గుర్తించగలిగే ఛాయచిత్రాలను అందిస్తుంది. ఈ నేప థ్యంలో ఇఎస్ఏ, ఇస్రో నుండి పొందిన రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించుకునే విశ్లేషణతో ముందుకొచ్చే ఎన్ఆర్ఎస్సి డేటాను ఎవరైనా అభినందించాలి తప్ప ఆంక్షలు విధించరాదు. ఈ విశ్లేషణ... ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారిలోనే కాకుండా, దేశ పౌరుల్లో కూడా గందరగోళాన్ని రేకెత్తిస్తున్నట్లు ఎన్డీఎమ్ఏ కనిపెట్టింది మరి. రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించడంపై చర్చ ఉత్తరాఖండ్ ఉదంతం నేపథ్యంలో చోటు చేసుకుంటోంది. ఎందుకంటే భారత్‌లో రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలకు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ జన్మస్థలం. ఇక్కడే భారతీయ ఫొటో ఇంటర్‌ప్రెటేషన్ ఇనిస్టిట్యూట్ (ఐపీఐ)ని 1966లో స్థాపించారు. ఇది 1957లో జవహర్లాల్ నెహ్రూ నెదర్లాండ్స్ సందర్శన సందర్భంగా కుదిరిన ఒప్పంద ఫలితం. ఐపీఐ... భారతీయ సర్వే సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. దీన్ని 1969లో ఏర్పడిన ఇస్రోకు బదలాయించారు. ఇప్పుడు ఇది ఇస్రో నేతృత్వంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ పేరిట వ్యవహరిస్తోంది. మొట్టమొదటి భారతీయ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ 1988లో ఐఆర్ఎస్–1ఏ పేరిట ఆపరేషన్లను ప్రారంభించింది. ఈరోజు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు నాలుగు అత్యధునాతనమైన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలున్నాయి. అవి రిసోర్స్‌శాట్, కార్టోశాట్, ఓషనోశాట్, రైశాట్. భారతీయ ఫారెస్ట్ మ్యాప్ రూపకల్పన కోసం రిమోట్ సెన్సింగ్ డేటాను 1980లలో ఉపయోగించి, ఇస్రో చారిత్రాత్మకమైన తోడ్పాటును అందించింది. ఇది దేశంలో భారీ ఎత్తున అడవుల నరికివేత జరిగిందని చూపించింది. అంతవరకు భారతీయ ఫారెస్ట్ సర్వే సంస్థ (ఎఫ్ఎస్ఐ) రూపొందించిన ఫారెస్టు మ్యాప్‌లతో ఇస్రో మ్యాప్‌లు విభేదించాయి. ఈ కొత్త డేటా వెల్లడించినందుకు నోరు మూసుకోమని ఎవరూ ఆదేశించలేదు. దానికి బదులుగా, భారతీయ ఫారెస్ట్ సర్వే సంస్థ తన మ్యాపింగ్ ప్రక్రియలో రిమోట్ సెన్సింగ్ ఆధారిత టెక్నిక్‌ను పొందుపర్చుకోవడానికి అనుమతించారు. దీనివల్ల అడవుల విస్తీర్ణంపై కచ్చితమైన అంచనాకు రావడం సాధ్యమైంది. నిపుణుల జ్ఞానాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించే విషయంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి, డేటాను షేర్ చేసే హక్కుకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వ విధాన నిర్ణయంలో, ప్రజాభిప్రాయాన్ని మలచడంలో సైన్స్ పాత్రకు సంబంధించిన విషయం. డేటాను పంచుకోవడం, నిపుణుల అభిప్రాయాలు లేక పరిశోధనా పత్రాలు అనేవి... జీఎం– ఆహార పదార్థాలు, హిమాలయ పర్యావరణం, నాసిరకం మందులు, డేటా గోప్యత లేదా సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో ఆరోగ్యకరమైన చర్చలకు వీలుకల్పిస్తాయి. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వివిధ అంశాలపై నిపుణులతో కూడిన విద్యా కేంద్రాలకు సంబంధించి విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉన్న భారత్ వంటి దేశంలో, భిన్నాభిప్రాయాలు నిత్యం రంగంమీదికి వస్తుంటాయి. ఇలాంటి విభేదాలను సైంటిస్టులు, విద్యావేత్తలు, పౌర సమాజం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన ప్రజా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. 1980లలో, కైగా అణు విద్యుత్ సంస్థపై తీవ్రవివాదం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్... దేశంలోని అణు శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తల మధ్య ఒక చర్చను నిర్వహించింది. ఈరోజుల్లో అలాంటి చర్చలనుంచి పరిశోధనా మండలులు, విద్యా సంస్థలు దూరం జరుగుతున్నారు. వీటి మౌనంతో శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిని మరింతగా క్షీణింప జేసేందుకు ప్రభుత్వానికి ప్రోత్సాహం లభిస్తోంది. దినేశ్ సి. శర్మ , వ్యాసకర్త శాస్త్ర వ్యవహారాల వ్యాఖ్యాత, (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జమ్మూ కశ్మీర్లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జోషిమఠ్ వంటి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ధాత్రి పట్టణంలోని నాయి బస్తీలో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా బస్తీలోని 20కి పైగా ఇళ్లతోపాటు ఓ మసీదుకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు మరోవైపు భూమి కుంగిపోవడంపై స్పందించిన జిల్లా అధికారులు బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తునట్లు వెల్లడించారు. భవంతులకు పగుళ్లు ఏర్పడటంపై గల కారణాలను విశ్లేషించేందుకు నిపుణుల బృందాన్ని సదరు గ్రామాలకు పంపినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ తెలిపారు. కాగా ధాత్రి మున్సిపల్ పరిధిలోని నాయి బస్తీ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉన్నాయి. అయితే భూమి కుంగిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ధాత్రి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ తెలిపారు. దోడా జిల్లాలో డిసెంబర్లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చాయని.. ఇప్పటి వరకు 20 భవనాలకు బీటల వారగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. దీని కారణంగా బస్తీ ప్రాంతం క్రమంగా కుంగిపోతుందని పేర్కొన్నారు. అయితే స్థానికంగా రోడ్ల నిర్మాణం, చుట్టుపక్కలా ప్రాంతాల్లో నది నీరు ప్రవహించడం వంటి అనేక కారణాలు కొండ పక్కనే ఉన్న గ్రామంలో భూమి కుంగిపోవడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా భూమి కుంగిపోవడంతో ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది జవవరి 8 మధ్య 12 రోజుల్లో సుమారు 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగింది. ఇస్రో శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో జోషిమఠ్‌లో నివసిస్తున్న169 కుటుంబాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. అలాగే ఎక్కువగా పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, భవనాలను కూల్చివేస్తున్నారు. చదవండి: విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ -
జోషీమఠ్‌లో మళ్లీ కూల్చీవేతలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో మంచు, వర్షం కారణంగా నిలిచిపోయిన భవనాల కూల్చీవేత పనులు శనివారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. 269 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. వీరికి హీటర్లు, ఉలెన్ దుస్తులు, వేడి నీరు, ఆహారపదార్థాల కిట్లు అందజేశామన్నారు. కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచు కురవడం, తుంపర్ల వర్షం కారణంగా చలి తీవ్రత పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. జోషీమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. భూమి కుంగిపోవడంతో జోషీమఠ్‌లో 849 ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. అంతేగాక జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. -
పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు?
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో కాళ్లకింది నేల ఉన్నపళంగా కుంగిపోతున్న తీరు పర్యావరణపరంగా మానవాళి ముందున్న పెను ముప్పును కళ్లకు కట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. జోషి మఠ్ సమస్యకు కారణమైన అడవుల విచ్చలవిడి నరికివేత, పెచ్చరిల్లిన వాతావరణ కాలుష్యం వంటివి ప్రపంచమంతటినీ వేధిస్తున్న సమస్యలే. వాటి పర్యవసానాలను గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వరదలు, తీవ్ర కరువుల రూపంలో అన్ని దేశాలూ చవిచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రాకృతిక విపత్తుల తీవ్రత కొన్నేళ్లుగా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ మనిషి అత్యాశకు ప్రకృతి ప్రతిస్పందన తాలూకు సంకేతాలే. వాటిని ఇప్పటికైనా అర్థం చేసుకుని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘లేదంటే అతి త్వరలో పరిస్థితి పూర్తిగా చేయి దాటడం ఖాయం. ఇప్పుడు జోషి మఠ్‌లో జరుగుతున్నది రేపు అన్నిచోట్లా జరుగుతుంది. ప్రకృతితో ఇష్టారాజ్యపు చెలగాటం అంతిమంగా వినాశనానికే దారి తీస్తుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ తదితరాల వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొన్నేళ్లుగా వేగవంతమవుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు క్రమంగా నీట మునుగుతాయి. మానవాళిపై పెను ప్రభావం చూపగల పరిణామమిది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో పదో వంతుకు పైగా సముద్ర తీర ప్రాంతాల్లోనే వ్యాపించి ఉంది. మహా నగరాల్లో కూడా అధిక శాతం అక్కడే ఉన్నాయి. అవన్నీ మునగడమో, పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోవడమో జరుగుతుంది. ఫలితంగా కోట్లాది మంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడతారు. వారందరికీ పునరావాసం, ఉపాధి తదితరాలన్నీ అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. మానవాళి చరిత్రలో ఇది పెను విపత్తుగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేగాక మితిమీరిన కాలుష్యం ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తోంది. సురక్షితమైన తాగునీటికి చాలా దేశాల్లో ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడింది. మున్ముందు ఇది మరింత తీవ్రతరం కానుంది. ప్రజలు సరైన తిండికి, తాగునీటికే కాదు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని పరిస్థితి తలెత్తనుంది! మాటలకే పరిమితం పర్యావరణ నష్టాలకు అడ్డుకట్టే వేసేందుకు చారిత్రక పారిస్ ఒప్పందం మొదలుకుని పలు కాప్ శిఖరాగ్రాల దాకా పేరుకు ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో కూడిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు తదితరాలకు సంబంధించి గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకోవడం, తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా సాగుతోంది. ఎవరికి వారు పొరుగు దేశమే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎటు చూసినా విపత్తులే... ► మంచు ఖండమైన అంటార్కిటికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా కరుగుతున్నాయి. దీని దుష్ప్రభావం పర్యావరణంపై చాలా రకాలుగా ఉండబోతోంది. ► ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ముందుగా ఇంగ్లండ్ తదితర యూరప్ దేశాలు అతి శీతల వాతావరణంతో అల్లాడాయి. తర్వాత అమెరికా దాని దెబ్బకు 10 రోజులకు పైగా దాదాపుగా స్తంభించిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, మంచు తుఫాన్లతో అల్లాడింది. వేల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం చవిచూసింది. ► అమెరికాలో ఇటీవలి దాకా కార్చిచ్చులతో అల్లాడిన కాలిఫోర్నియా ఇప్పుడేమో కనీవినీ ఎరగని వరద బీభత్సంతో తల్లడిల్లుతోంది. ► ఉత్తర భారతం కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి చలితో వణుకుతోంది. ► పొరుగు దేశం పాకిస్తాన్ గతేడాది దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి వరదలతో అతలాకుతలమైంది. మూడొంతుల ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రభావం నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏటా 10 సెం.మీ. కుంగిన జోషీ మఠ్! జోషి మఠ్‌లో నేల 2018 నుంచి ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వస్తోందట! అధునాతన శాటిలైట్ ఇమేజ్ విశ్లేషణ ఆధారంగా జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జోషిమఠ్ బాటలో...
ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కొండల్లో రాళ్లు, మట్టి వదులుగా మారి ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తోందన్న భయంతో స్థానికులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జూలై 2020 నుంచి మార్చి 2022 మధ్య చేసిన అధ్యయనంలో జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏడాదికి 6.5 సెంటీమీటర్లు కుంగిపోతున్నట్టుగా గుర్తించారు. ఒకప్పుడు ఇళ్లకు చిన్న పాటి చీలికలు కనిపించేవి. ఇప్పుడు భారీగా పగుళ్లు మాదిరిగా ఏర్పడుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం
డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ జోషిమఠ్ రోజుకు రోజుకు కుంగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం చాలా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రమాదకరంగా మారిన ఇళ్లు, భవనాలను కూల్చివేసింది. అయితే జోషిమఠ్ నిర్వాసితులకు సాయం విషయంపై ఉత్తరాఖండ్ కేబినెట్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జోషిమఠ్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అద్దె సాయంగా రూ.5వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 6 నెలల పాటు విద్యుత్ బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. నవంబర్ 2022 నుంచి ఇది వర్తిస్తుంది. ఇళ్లు ఖాళీ చేసి హోటళ్లు, రిసార్టుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న వారికి గదికి రూ.950 చొప్పున చెల్లించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.450 ఇవ్వనుంది. ఇస్రో ఫొటోలు.. జోషిమఠ్ గత 12 రోజుల్లోనే 5.4 సెంటిమీటర్లు కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఛాయాగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఇక్కడి పరిస్థితిపై కేంద్ర హొంమంత్రి అమిష్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులకు సూచించారు. జోషిమఠ్‌లో ఇప్పటివరకు 169 కుటుంబాలకు చెందిన 589 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పగుళ్ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన 42 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు తాత్కాలిక సాయంగా అందించింది. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
విధానాల శాపమే... ఈ పాపం!
బద్రీనాథ్ పవిత్ర మందిరానికి ప్రవేశ ద్వారం అయిన ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ కుంగిపోవడం పాలకుల పర్యావరణ పట్టింపులేనితనానికి నిదర్శనం. కొండచరియలు విరిగిపడే ఈ భౌగోళిక సున్నిత ప్రాంతంలో సొరంగాల తవ్వకం, పేల్చడం వంటి నిర్మాణ పనులు చేయకూడదు. అయినా అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కేంద్రం హద్దుల్లేని మద్దతిచ్చింది. ఇది సరిపోదన్నట్టుగా, ఈ కొండల్లో 800 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ‘చార్ధామ్ హైవే ప్రాజెక్టు’ను ప్రారంభించింది. పైగా పర్యావరణ చట్టాల్లో 123 క్రమబద్ధీకరణ మార్పులను తీసుకొచ్చారు. ప్రధాని కార్యాలయం చార్ధామ్ వంటి ప్రాజెక్టులను నేరుగా పర్యవేక్షిస్తున్నప్పుడు, జోషీమఠ్ కుంగిపోతున్న ఘటనకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జోషీమఠ్ కుంగిపోతోంది. ఈ ప్రాంతంలోని 600 ఇళ్లు బీటలు వారాయి. డజన్లకొద్దీ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. హోటల్స్ వంటి కొన్ని వాణిజ్య భవనాలు అనిశ్చితంగా ఒకదానిపై ఒకటి ఒరిగిపోయాయి. సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పట్టణం ‘చార్ ధామ్’ లలో ఒకటైన బద్రీనాథ్ పవిత్ర మందిరం, హేమ్‌కుండ్ సాహిబ్ దగ్గరి సిక్కు తీర్థయాత్రా స్థలం, ఔలి దగ్గరి స్కీయింగ్ ఆకర్షణకు ప్రవేశ ద్వారం. హిమాలయాల్లో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంలో జోషీమఠ్ ఉంది. సాపేక్షికంగా యువ పర్వతమైన దీని భౌగోళికత ఇతర పర్వతాలతో పోలిస్తే భిన్నమైంది. సమీపంలోని హాథీ పర్వతం, ఔలి స్థిరమైన శిలలపై ఏర్పడి ఉండగా, జోషీమఠ్ ప్రాచీన కొండ చరియలలో భాగంగా ఉన్న స్థిరపడని బండరాళ్లతో ఏర్పడింది. అందువల్ల ఇది కొండచరియలు విరిగిపడే ప్రాంతం. ఇక్కడ సొరంగాల తవ్వకం, పేల్చడం వంటివి చేస్తే నేలకు భంగం కలుగుతుంది. 1970లో ఒక కొండ నుంచి పెద్ద బండరాయి విడివడి అలకనంద నదిలో పడిపోయింది. ఆ ప్రాంతంలో పెరిగిన నిర్మాణ కార్య కలాపాలు, పెరుగుతున్న జనాభా ఒత్తడి వంటివే ఇలా కొండ చరియలు విరిగిపడటానికి కారణం అవుతున్నాయని డజన్ల కొద్ది శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించాయి. స్థానిక ప్రజలకు రోడ్లు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ, స్థానిక వినియోగం కోసం చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టు వంటివి హేతుబద్ధమే కావొచ్చు. కానీ వరుసగా ఏర్పడుతూ వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో హైవేలు, జలవిద్యుత్, మౌలిక వసతుల అభివృద్ధి వగైరా అతిపెద్ద ప్రాజెక్టులకు తెరతీశాయి. జోషీమuŠ‡ వంటి ఘటనలకు ప్రకృతిని, వాతావరణ మార్పును లేదా స్థానిక ప్రజలను తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఇవన్నీ న్యూఢిల్లీలో రూపొందిస్తున్న విధానాలు కలిగిస్తున్న విపత్తుల ఫలితమేనని కింది కారణాల వల్ల చెప్పవచ్చు. మొదటి కారణం, 2013 కేదార్నాథ్ విషాదం జరిగిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం హద్దుల్లేని మద్దతును ఇవ్వడమే. ఉత్తరాఖండ్‌లో ఉనికిలో ఉన్న, నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల సుదీర్ఘ మన్నిక; అస్థిరమైన జోన్లలో అధిక అవక్షేపాల భారం... తీవ్ర సమస్య లుగా ఉంటూనే వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే సుప్రీంకోర్టుచే నియమితులైన నిపుణుల బృందం, ‘మెయిన్ సెంట్రల్ థ్రస్ట్’ (ఎమ్‌సీటీ)పై ఉన్న భూభాగాన్ని సాధారణంగానూ, పేరుకుపోయే చలికాలపు మంచు భూభాగాన్ని ప్రత్యేకంగానూ జలవిద్యుత్ పనుల నుంచి దూరంగా ఉంచాలని సూచించింది. 2014 డిసెంబర్లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. 2013లో వరదలు ముంచెత్తడానికి జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయని ఇందులో పేర్కొంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రాంతంలో నివసించే ప్రజల భద్రతను పరిరక్షించడానికి ఇలాంటి ప్రాజెక్టులపై సమీక్ష అత్యవసరమని 2016 లోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే 2013 నుంచి ఈ ప్రాంతంలోని ఏ జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా సమీక్షించడం కానీ, నిలిపి వేయడం కానీ జరగలేదు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఈ అఫిడవిట్లన్నీ కాగితాల మీదే ఉండిపోయాయి. హిమాలయాలపై జలవిద్యుత్ ప్రాజెక్టుల దాడి సరిపోలేదని కాబోలు... కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ కొండల్లో 800 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ‘చార్ ధామ్ హైవే ప్రాజెక్టు’ను ప్రారంభిం చింది. దీనికోసం మైదానాల్లో ఉండే విధంగానే రోడ్డుకు ఇరువైపులా ఖాళీ ప్రాంతంతో 12 మీటర్ల వెడల్పు డబుల్ లేన్‌ను డిజైన్ చేశారు. అంటే వందలాది చెట్లను విచ్చలవిడిగా నరకడం, కొండ వాలులను అస్థిర పరచడం, సహజమైన ఊటలను ధ్వంసం చేయడం, వీటితో పాటు లోయల కింది భాగంలో చెత్త, వ్యర్థాలను కుప్పతెప్పలుగా పోయడం అని అర్థం. ఈ ప్రాజెక్టును మదింపు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన అత్యున్నత సాధికారిక కమిటీ ఈ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసానికి రోడ్డు వెడల్పే ప్రత్యక్ష కారణంగా ఉంటోందని భావించింది. అందుకని వెడల్పును తగ్గించినట్లయితే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించే అవకాశముందని పేర్కొంది. నిజానికి 5.5 మీటర్ల ‘క్యారేజ్ వే’తో పర్వత ప్రాంత రోడ్లను భిన్నంగా డిజైన్ చేయాలని సూచిస్తూ 2018లోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది. కానీ తన సొంత నిబంధనలను అదే లెక్కచేయకుండా, ఆ సర్క్యులర్‌ను కోర్టు నియమించిన ప్యానెల్‌కు కూడా చూపకుండా దాచింది. బలహీనమైన పర్వత ప్రాంతాల్లో వెడల్పాటి హైవే నిర్మాణం కోసం ఒత్తిడి చేయడం ద్వారా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పర్యా వరణ విధ్వంసం జరగడాన్ని అనుమతించింది. రెండో కారణం, ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలను పాతరేయడానికి సాహసించడమే. అన్ని భారీ ప్రాజెక్టులూ పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)నకు లోబడి ఉండాలి; పర్యావరణ నిర్వ హణ పథకాన్ని(ఈఎంపీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. రోడ్డు ప్రాజెక్టుల కోసం, ఈఐఏ పరిధి 100 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికి చార్ ధామ్ ప్రాజెక్టును ఒక్కొక్కటీ 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండేలా 53 ప్రాజెక్టులుగా విభజించారు. కాబట్టి పర్యావరణంపై అవిచ్ఛిన్నమైన, సంచిత ప్రభావాలు ఉంటున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఎలాంటి క్రమబద్ధీకరణ, తనిఖీ లేకుండా; ప్రతిక్రియాత్మక పర్యావరణ నిర్వహణ పథకం లేకుండా ప్రాజెక్టును ప్రారంభించేశారు. సరళతర వాణిజ్యం కోసం ప్రభుత్వం పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడవడం కూడా అతిపెద్ద సమస్య అయింది. 2020 మార్చ్ నుంచి 2022 మార్చ్ వరకు పర్యావరణ చట్టాల్లో 123 క్రమబద్ధీకరణ మార్పులను తీసుకొచ్చారని ‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ చేసిన అధ్యయనం తెలిపింది. ఈ మార్పుల్లో నాలుగింట మూడొంతులు చట్టాలను సడలించడానికీ, చట్టబద్ధమైన అవసరాలకు మినహాయింపులు ఇవ్వడానికీ సంబంధించినవే కావడం గమనార్హం. మూడో కారణం ఏమిటంటే, ధార్మిక పర్యాటకం పేరుతో దాని సామర్థ్యాన్ని పట్టించుకోకుండా, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో విచ్చలవిడి టూరిజాన్ని ప్రోత్సహించడమే. హైవే ప్రాజెక్టుకు అదనంగా ప్రభుత్వం చార్ ధామ్ ప్రాంతంలో రైలు సర్వీసులను, రోప్ వేలను ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందిస్తోంది. క్రితంసారి కేదార్ నాథ్‌ను సందర్శించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ– రైళ్లు, రోడ్లు, రోప్ వేలు తమతో పాటు ఉద్యోగాలను కొనితెస్తాయనీ, జీవి తాన్ని సులభతరం చేసి సాధికారతను కలిగిస్తాయనీ గొప్పగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 17 గంటలపాటు ఏకాంతంలో గడిపిన ధ్యాన గుహ భక్తులకు ముఖ్య ఆకర్షణ కేంద్రంగా మారి పోయింది. దీని ఫలితంగా ఇలాంటి మరో మూడు ధ్యాన గుహలను పర్యాటకుల కోసం నిర్మిస్తున్నారు. అంతిమంగా, జోషీమఠ్‌లో విపత్తు కలిగిన తర్వాత కూడా ప్రభుత్వ స్పందన మిడిమిడి జ్ఞానంతోనే ఉంటోంది. ప్రధాని కార్యాలయం నిర్వహించిన ఒక సమావేశంలో, ఈ ప్రమాదంలో 350 మీటర్ల కొండ ప్రాంతం మాత్రమే ప్రభావితమైందని తేలికచేసి మాట్లాడారు. ప్రధానమంత్రి, ప్రధాని కార్యాలయం ఛార్ ధామ్ వంటి ప్రాజెక్టులను నేరుగా పర్యవేక్షిస్తున్నప్పుడు, జోషీమఠ్ కుంగిపోతున్న ఘటనకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రదర్శనలు కాకుండా, నిజమైన ప్రతిక్రియకు పూనుకోవాల్సిన సమయం ఇది! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జోషిమఠ్ పగుళ్లు.. ఉత్తరాఖండ్ సీఎం కీలక ప్రకటన
డెహ్రాడూన్: బ్రదినాథ్ లాంటి పుణ్యక్షేత్రానికి ద్వారంగా పేరున్న ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. జోషిమఠ్ ప్రభావిత కుటుంబాలకు ఇవాళ(గురువారం) సాయంత్రంకల్లా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. జోషిమఠ్‌లో కేవలం 25 శాతం ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయని ఆయన ప్రకటించారు. జ్యోతిమఠ్ కుంగిపోతుండడంతో.. కేవలం నాలుగోవంతు ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలకు లక్షన్నర రూపాయల సాయాన్ని ఇవాళ సాయంత్రంకల్లా అందజేస్తాం. పూర్తి నివేదికలు అందిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నాం. అలాగే.. ఇతర ఊళ్లలోనూ ఇలాంటి సమస్య ఉందేమో ప్రభుత్వం పరిశీలిస్తుంది. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం ధామి ప్రకటించారు. అంతకు ముందు జోషిమఠ్‌లో స్వయంగా పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అధైర్యపడొద్దని చెబుతూ.. సురక్షిత ప్రాంతాల తరలింపునకు అధికారులను ఆదేశించారు కూడా. ఆ మరునాడే ఆయన కీలక ప్రకటన చేయడం గమనార్హం. జోషిమఠ్‌లో గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడు కావడంతోనే.. పరమ పవిత్ర ప్రాంతం కుంగుబాటుకు లోనవుతోంది. ఇళ్లకు, రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. జనాలు కొంతవరకు ఖాళీ చేసి వెళ్లిపోగా.. ఆరువందలకు పైగా ఇళ్లు, హోటళ్లలతో 20వేల మందికిపైగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదకారకంగా ఉన్న భవనాలను పడగొట్టి.. వాళ్లకు తక్షణం తాత్కాలిక సదుపాయాల్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. చైనా సరిహద్దులో కీలకంగా భావించే ఆర్మీ బేస్‌కి కూడా పగుళ్లు వస్తున్నాయి. గ్లేసియర్లు కరగడం, కన్స్ట్రక్షన్ పనులు, కొండల తవ్వకం, భూభాగం కిందుగా నీటి ప్రవాహం.. తదితర కారణాలతో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చారు. అభివృద్ధి పేరిట ఇక్కడ జరిగిన పనుల వల్లే.. 2021లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మంది బలైయ్యారనే విమర్శ ఒకటి ఉంది. -
జోషిమఠ్ తరహాలో ఆ గ్రామంలోనూ పగుళ్లు.. ఆందోళనలో ప్రజలు
దెహ్రాదూన్: పౌరాణిక, చారిత్రక పర్యాటక ప్రదేశమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి నివాస గృహాలు బీటలువారుతుండటం, నేల నెర్రెలుబారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. జోషిమఠ్ నుంచి సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. అలాగే ప్రమాదకరంగా మారిన భవనాలు, హోటళ్లను కూల్చేసేందుకు సిద్ధమైంది. అయితే, జోషిమఠ్ మాత్రమే కాదు మరో గ్రామంలోనూ ఇళ్లకు పగుళ్లు, నేల నెర్రెలుబారడం గుర్తించడం కలకలం సృష్టిస్తోంది. అది కూడా జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణప్రయాగ్లోనే. జోషిమఠ్‌కు ఈ గ్రామం 80కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో ఉంటుంది. కర్ణప్రయాగ్లోని బహుగున నగర్లో సుమారు 50 ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో బిక్కు బిక్కు మంటు కాలం వెళ్లదిస్తూన్నారు ప్రజలు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సింతర్గాంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ సోమవారం మాట్లాడుతూ జోషిమఠ్ తరహాలోనే ఇతర గ్రామాల్లోనూ ఈ సమస్య ఉందని పేర్కొన్నారు. ‘జోషిమఠ్‌లో ప్రభావితమైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. జోషిమఠ్ ప్రజల భద్రతకు భరోసా ఇస్తున్నాం. జోషిమఠ్ తరహాలోని పరిస్థితులు కనిపిస్తున్నట్లు సమీప గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి వివరాలు వెల్లడిస్తారు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే. మరోవైపు.. జోషిమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇతర భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. హోటళ్లు మలారి ఇన్, మౌంట్ వ్యూకు భారీగా పగుళ్లు ఏర్పడిన క్రమంలో మంగళవారం సాయంత్రానికి వాటిని కూల్చేయనున్నారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ బిల్డింగ్ రీసర్ట్ ఇన్స్టిట్యూ(సీబీఆర్ఐ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)ల పర్యవేక్షణలో కూల్చివేతలు సాగుతాయని తెలిపారు. #WATCH | Chamoli, Uttarakhand: Amid the issue of land subsidence in Joshimath, cracks also seen on some houses in Bahuguna Nagar of Karnaprayag Municipality. pic.twitter.com/hwRfFcwhJy — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023 ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?! -
Joshimath: కుంగుతున్నా వదలట్లేదు
డెహ్రాడూన్: భూమి కుంగిపోతున్నా సొంతింటిని, స్వస్థలాలను వదిలి వెళ్లేందుకు జోషీమఠ్ వాసులు ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలంటూ ఇప్పటికే దాదాపు 200కుపైగా ఇళ్లకు అధికారులు ఎరుపు రంగు పూశారు. వెంటనే సురక్షిత శిబిరాలకు లేదా అద్దె భవనాలకు తరలిపోవాలని, ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4,000 చొప్పున ఆరునెలలపాటు ఆర్థికసాయం అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం మరో 68 ఇళ్లకు పగుళ్లు పడ్డాయి. దీంతో కుంగిన, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 678కి పెరిగింది. అయినా పలువురు ఇళ్లు వీడటం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధూ సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు. ‘ ప్రతి నిమిషమూ అత్యంత ప్రధానం. వెంటనే ఇళ్లను వీడండి’’ అని కోరారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు ఇప్పటికే జోషిమఠ్‌లో సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. భూమి కుంగడంతో పగిలిన తాగు నీటి సరఫరా పైపులను పునరుద్దరించాలి. లేదంటే పెద్దమొత్తంలో నీరు దిగువ భూముల్లో ఇంకి త్వరగా మరింతగా కుంగే ప్రమాదం పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు. కాగా, ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్చేసింది. కుటుంబానికి రూ.5,000 చాలా తక్కువ మొత్తమని, సర్వస్వం కోల్పోతున్న ఒక్కో బాధితునికి రూ.50వేలు ఇవ్వాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అభిప్రాయపడ్డారు. -
Joshimath: ఎవరి పాపం ఇది?!
అది సాక్షాత్తూ శంకరాచార్యుడు నడయాడిన నేల. ఆయన ప్రవచనాలు విని పులకించిన పుణ్య భూమి. ఆయన చేతుల మీదుగా దేశంలో ఏర్పాటైన నాలుగు ప్రధాన పీఠాల్లో ఒకటైన జ్యోతిర్మఠం ఇక్కడిదే. ఈ పట్టణం పేరు దాన్నుంచే వచ్చింది. హిరణ్యకశిపుడిని వధించిన ఉగ్ర నరసింహుడు శాంతమూర్తిగా మారింది ఈ ప్రదేశంలోనేనని వ్యాస విరచిత స్కంధపురాణం అంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ఇక్కడి ఎత్తయిన హిమవన్నగాలు, దట్టమైన అడవులు, నిత్యం గలగలపారే హిమానీ నదాలను వీక్షించటానికి వచ్చే పర్యాటకులు కూడా తక్కువేమీ కాదు. పైగా చైనా సరిహద్దును ఆనుకునివున్న ప్రాంతంగనుక వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. హిమశిఖరాల అధిరోహణకు తరలివెళ్లే బృందాలు ఈ ప్రాంతం మీదుగానే సాగుతాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇంతటి ఘనమైన పౌరాణిక, చారిత్రక, పర్యాటక ప్రదేశమైన జోషిమఠ్ సంబంధించి కొన్ని వారాలుగా వెలువడుతున్న వార్తలు హడలెత్తిస్తున్నాయి. అక్కడి నివాస గృహాలు ఉన్నట్టుండి బీటలు వారుతుండటం, నేల నెర్రెలుబారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తు న్నాయి. జోషిమuŠ‡ ఉన్న చమోలీ జిల్లాలోనే కర్ణప్రయాగ్, గోపేశ్వర్ పట్టణాలు... తెహ్రీ జిల్లాలోని ఘన్సాలీ, పితోర్‌గఢ్ జిల్లా మున్సియారి, ధార్చులా... ఉత్తరకాశీ జిల్లా భట్వారీ... ఇంకా పౌరీ, నైని టాల్ తదితర పట్టణాలకు సైతం ఇలాంటి ముప్పే పొంచివున్నదని నిపుణులంటున్న మాట. ఇది ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ముప్పు కాదు. గత కొన్ని దశాబ్దాలుగా మనుషులు చేసిన, చేస్తున్న పాపాల పర్యవసానమే ఈ ఉత్పాతం. లాభార్జన తప్ప మరేమీ పట్టని కార్పొరేట్ సంస్థలు, అక్రమార్జనకు అలవాటుపడిన నేతలు ఏకమై ప్రకృతి వనరులను దోచుకు తింటున్నారన్న ఏకైక కారణంతో ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాఖండ్ వాసులు సుదీర్ఘకాలం పోరాటాలు చేశారు. అవి కొన్నిసార్లు హింసాయుత రూపం కూడా తీసుకున్నాయి. వృక్షాలను హత్తుకునే అహింసాయుత చిప్కో ఉద్యమం పురుడుపోసుకున్నది ఈ నేలపైనే. తమ జీవనాధారమైన అడవులను నేలమట్టం చేస్తున్న తీరుపై 1973లో వేలాదిమంది గ్రామీణులు సుందర్‌లాల్ బహుగుణ నేతృత్వంలో ప్రారంభించిన ఈ ఉద్యమం దీర్ఘకాలం ప్రభావవంతంగా కొనసాగడంలో మహిళల పాత్ర ప్రధాన మైనది. అనంతరకాలంలో ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు ఊపిరులూదిందీ, ప్రేరణగా నిలిచిందీ చిప్కో ఉద్యమమే. తెహ్రీ డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఎన్నో ఉద్యమాలు సాగాయి. స్థానిక వనరులపై సంపూర్ణావగాహనగల తమ ప్రాంతంవారు పాలకులైతే తప్ప ఈ దోపిడీనీ, ఈ అరాచ కాన్నీ నివారించలేమన్న భావనతో స్థానికులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన పర్యవసానం గానే... వారి త్యాగాల ఫలితంగానే 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది. కానీ గత రెండు దశాబ్దాలుగా జరిగిందంతా వేరు. బలమైన నాయకత్వం కొరవడి రాష్ట్రం అస్థిరత్వంలోకి జారుకుంది. రాష్ట్రం 13 మంది ముఖ్యమంత్రులను, రెండు దఫాలు రాష్ట్రపతి పాలన చవిచూసిం దంటే పార్టీలకు అతీతంగా నాయకగణం ఎలా భ్రష్టుపట్టిపోయిందో అర్థమవుతుంది. అభివృద్ధి పేరుతో నిర్మించిన జలవిద్యుత్ ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవంతులు, కొండల్ని పిండిచేసి నిర్మించే రహదారులు, సొరంగాలు అక్కడి పర్యావరణ సమతౌల్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అడవుల విధ్వంసం సరేసరి. ఎన్నడో 1976లోనే ఎంసీ మిశ్రా కమిషన్ ఈ ప్రాంత ప్రత్యేక భౌగోళిక స్థితిపై నివేదిక వెలువరించింది. జోషిమఠ్ భూగర్భంలోని అంతర్వాహినులవల్ల ఈ నేలకు కుంగి పోయే గుణమున్నదని హెచ్చరించింది. విన్నవారేరి? దశాబ్దాలుగా అన్ని హెచ్చరికలనూ పాలకులు పెడచెవిన పెట్టి అభివృద్ధి మంత్రం జపించిన పర్యవసానంగా అక్కడి ప్రజానీకం భయం గుప్పెట్లో బతుకులీడుస్తున్నారు. ఈ ప్రాంతంలో సాగిస్తున్న నిర్మాణాల తీరుతెన్నులు చూస్తే భయాందోళనలు కలుగుతాయి. ఆసియాలో అతిపెద్దదైన, దీర్ఘమైన రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడిదే. 420 మెగా వాట్ల విష్ణుప్రయాగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు, ఎన్టీపీసీకి చెందిన 520 మెగావాట్ల తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్టులతోపాటు చార్ధామ్ ప్రాజెక్టు పేరిట విశాలమైన రహదారులు, సొరంగాలు నిర్మాణ మవుతున్నాయి. ఇవన్నీ నదీప్రవాహాలకు ఆటంకమవుతుంటే అవి తమ దోవ తాము వెదుక్కుంటు న్నాయి. ఇక వలసలతో నానాటికీ పెరుగుతున్న జనాభా సంగతి సరేసరి. ఈ ప్రాంతం భూకంప జోన్లో ఉన్నదన్న జ్ఞానం కూడా పాలకులకు కొరవడింది. మనిషి మనుగడకు ప్రకృతి వనరుల వినియోగం తప్పనిసరే. అందువల్ల సహజమైన సమతుల్యత ఏదోమేరకు దెబ్బతినడం కూడా అనివార్యమే. కానీ దాన్ని కనిష్ట స్థాయిలో ఉంచటం, మరీ ముఖ్యంగా ఎంతో సున్నితమైన హిమవత్పర్వత ప్రాంతంలో ప్రకృతిపట్ల భయభక్తులతో మెలగటం అవసరం. కార్పొరేట్ సంస్థల దురాశకూ, కాంట్రాక్టర్ల లాభార్జనకూ, స్వీయప్రయోజనాల రక్షణకూ యధేచ్ఛగా పర్యావరణ విధ్వంసానికి పూనుకుంటే ఏమవుతుందో జోషిమఠ్ ఉత్పాతం తెలియజెబుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి పేరిట సాగిస్తున్న నిర్మాణాలే ప్రస్తుత దుస్థితికి కారణమని జోషిమఠ్ పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద్ చేసిన ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఇప్పటికైనా పాలకులు మేల్కొనాలి. పరిస్థితులు చేయిదాటిపోకుండా తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. ఉత్తరాఖండ్ భౌగోళిక స్థితిగతుల ఆధారంగా పకడ్బందీ మాస్టర్‌ప్లాన్ రూపొం దించి, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలి. -
మరిన్ని ‘జోషి మఠ్’లు!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో ఇళ్లు పగుళ్లివ్వడానికి విపరీతమైన వర్షాల వల్ల భూమి క్రమక్షయం, నేల లోపలి భాగం గుల్లబారడం వంటివి కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘వీటితో పాటు ఇష్టారాజ్యంగా తవ్వకాలు, ఇళ్లతో పాటు డ్యాముల వంటి భారీ నిర్మాణాలు కూడా సమస్యకు కారణమే. అయితే భూమి లోపలి పొరల్లోని (టెక్టానిక్) కదలికలే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఇది వేగం పుంజుకుంది. దీన్ని అడ్డుకోవడం మన చేతుల్లో లేదు ’’ అని వారంటున్నారు. రాష్ట్రంలోని నైనిటాల్, ఉత్తరకాశి, చంపావత్ తదితర పట్టణాలకూ ఇలాంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని సున్నితం, బలహీనమైన నేల, దాని లోపలి పొరలతో ఎప్పటికైనా ప్రమాదమేనని చెబుతున్నారు. మరోవైపు, జోషి మఠ్‌ను కొండచరియలు విరిగిపడే ముప్పున్న ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా 60కి పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. మరో 90 కుటుంబాలను కూడా తరలించనున్నారు. కలెక్టర్ సారథ్యంలో ప్రభావిత ఇళ్ల పరిశీలన కొనసాగుతోంది. పట్టణంలోని 4,500 పై చిలుకు ఇళ్లలో 610 ఇళ్లు పగుళ్లిచ్చి నివాసానికి పనికిరాకుండా పోయినట్టు గఢ్వాల్ కమిషనర్ సుశీల్‌కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం పుష్కర్‌సింగ్ ధామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. ప్రధాని కార్యాలయం కూడా ఆదివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపింది. ప్రజల క్షేమమే తొలి ప్రాధాన్యమని ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఐటీ రూర్కీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. జోషి మఠ్ పరిస్థితిపై హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా అధ్యయనం చేయనున్నాయి. -
‘జోషిమఠ్’పగుళ్లపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమఠ్( చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లకు బీటలువారాయి. సుమారు 600 కుటుంబాలను ఖాళీ చేసేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జోషిమఠ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం. కేబినెట్ సెక్రెటరీ సహా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ విభాగం అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులతో పాటు జోషిమఠ్ జిల్లా అధికారులు సైతం హాజరుకానున్నారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు బీటలు వస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. శనివారం జోషిమఠ్‌లో పర్యటించారు. ప్రభావితమైన 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జోషిమఠ్ ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: Joshimath Sinking: జోషీ మఠ్‌లో వందలాది ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ! ఏమిటీ జోషీమఠ్ ? -
జోషీ మఠ్‌లో ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ!
జోషిమఠ్. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు చిరపరిచితమైన పేరు. ఉత్తరాఖండ్‌లో అత్యంత పురాతమైన పట్టణం పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరకొస్తున్నాయి. జోషిమఠ్‌లో వందలాది ఇళ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భూమిలోంచి నీళ్లు ఉబుకుబుకి పైకి వస్తున్నాయి. ఈ పట్టణం నిట్టనిలువుగా భూమిలోకి కుంగిపోవడమే దీనికి కారణం. ఏదో ఒక రోజు జోషిమఠ్ మునిగిపోవడం ఖాయమని దశాబ్దాల క్రితమే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ప్రజలు గత కొద్ది రోజులుగా ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపుగా 600 ఇళ్లు బీటలు వారాయి. నేలకింద నుంచి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తోంది. భూమి కింద నుంచి శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు వణికిపోతున్నారు. చార్ధామ్ యాత్రికుల కోసం హెలాంగ్ నుంచి మార్వారి వరకు రోడ్డుని వెడల్పు చేసే ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ముప్పు ముంచుకొచ్చింది. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రంగంలోకి దిగారు. రహదారి నిర్మాణాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. జోషీమఠ్ పరిస్థితిపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. అక్కడి 600 కుటుంబాలను తక్షణం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శనివారం అక్కడ పర్యటించనున్నారు. దాంతో విపత్తు సహాయక బృందాలు ప్రజల్ని తరలిస్తున్నాయి. ఎందుకీ ముప్పు ? జోషీమఠ్ పట్టణం కొండల్లో ఏటవాలుగా ఉన్నట్టు ఒకవైపు ఒరిగి ఉంటుంది. అత్యంత పురాతనమైన కొండచరియలపై ఇళ్లు నిర్మించడంతో పునాదులు బలంగా లేవు. అడపా దడపా భూ ప్రకంపనలు పలకరిస్తూనే ఉంటాయి. రైని ప్రాంతంలోని అలకనంద నదికి వరదలు వచ్చినప్పుడల్లా జోíషీమఠ్‌లో మట్టిని బలహీనపరుస్తోంది. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టవద్దని ఎందరో నిపుణులు హెచ్చరించినా మన ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్ని పేల్చేయడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు, చెట్లు నరికేయడం వంటి చర్యలు జోíషీమఠ్ పట్టణాన్ని ప్రమాదంలో పడేశాయి. ఎన్టీపీసికి చెందిన తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. గత ఏడాది ఈ ప్రాజెక్టు దగ్గర ఆకస్మిక వరదలు సంభవించి 200 మంది మరణించిన విషయం తెలిసిందే. ఏడాది పొడవునా చార్ధామ్ యాత్ర చేయడానికి వీలుగా హెలోంగ్ నుంచి మార్వారి వరకు 20కి.మీ. మేర చేపట్టిన రహదారి వెడల్పు చేసే ప్రాజెక్టు ముప్పుని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నీ తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. సమస్యకి శాశ్వతమైన పరిష్కారాలు కనుగొనే వరకు చిన్నపాటి తవ్వకాలు కూడా చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది జోషీమఠ్‌కి ముప్పుని తొలిసారి గుర్తించారు. చమోలిలో ప్రమాదకరంగా కొండచరియలు విరిగిపడినప్పుడు జోíషీమఠ్‌లో ఇళ్లు బీటలు వారాయి. అప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి. దీనికి గల కారణాలపై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ పట్టణం ఉన్న ప్రాంతంలో సహజసిద్ధంగా వచ్చే ముప్పుతో పాటు మానవ తప్పిదాలు కారణమని తేల్చింది. 50 ఏళ్ల క్రితమే ప్రమాదం గుర్తించిన నిపుణులు జోషీమఠ్ పూర్తిగా మునిగిపోతుందని 50 ఏళ్ల క్రితమే నిపుణులు అంచనా వేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో తరచూ వరదలు రావడానికి గల కారణాలు అన్వేషించడానికి ఏర్పాటు చేసిన మిశ్రా కమిటీ 1976లో ఇచ్చిన నివేదికలో జోíషీమఠ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ విషయాన్ని ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వృద్ధులు కథలుగా చెబుతున్నారు. జోషిమఠ్ కనుమరుగైపోతుందా అన్న ఆందోళనలో స్థానికులు దినమొక గండంగా బతుకుతున్నారు. కుప్పకూలిన జోషిమఠ్ ఆలయం జోషీమఠ్: హిమాలయాల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ఓ ఆలయం శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానికులు చెప్పారు. ఆలయ గోడలు పగుళ్లు వారుతుండటంతో 15 రోజుల క్రితమే మూసివేసినట్లు చెప్పారు. సింగ్‌ధర్ వార్డులోని చాలా ఇళ్లు బీటలు వారుతుండటంతో 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అదేవిధంగా, అక్కడికి సమీపంలోనే ఉన్న జల విద్యుత్ కేంద్రంలో పనిచేసే 60 కుటుంబాలను కూడా మరో చోటికి తరలించారు. మర్వారీలోని జలాశయం బీటలు వారి నీరు ధారాళంగా మూడు రోజులుగా దిగువకు వస్తుండటంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. చార్‌ధామ్‌లో కొనసాగుతున్న బైపాస్ రోడ్డు, జల విద్యుత్ ప్రాజెక్టు పనులను, ఔలి రోప్ వే సేవలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఏడాది కాలంగా భూమి కుంగిపోతోంది. పక్షం రోజులు గా భూమి కుంగుబాటు మరీ ఎక్కువైంది. ఏమిటీ జోషీమఠ్ ? హిమాలయాల్లోని ప్రకృతి అందాలకు నెలవు ఈ పట్టణం. చమోలి జిల్లాలో బద్రీనాథ్, హేమ్‌కుంద్ సాహిబ్ మధ్య 6 వేల అడుగుల ఎత్తులో జోషీ మఠ్ ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఈ పట్టణం ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుడు ఎనిమిదో శతాబ్దంలో జోíషీమఠ్‌లోనే జ్ఞానోదయం పొందారని ప్రతీతి. ఇప్పటికే అత్యధిక భూకంపం ముప్పు ఉన్న కేటగిరి జోన్–5లో ఈ ప్రాంతం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జోషిమత్: ఊరికి ఊరే కుంగిపోతోంది! ఎందుకో తెలుసా?
అది పరమ పవిత్ర ప్రాంతం. హిందువులకు బద్రీనాథ్, సిక్కులకు హేమకుండ్ సాహిబ్ లాంటి పుణ్యక్షేత్రాలకు చేరువగా ఉండే నిలయం. హిమాలయాల పర్వతారోహకులకు అదొక ద్వారం. పైగా చైనా సరిహద్దులో భద్రత విషయంలో భారత కంటోన్మెంట్ ఏరియాగా కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి ఊరు కుంగిపోతోంది. ఉన్నట్లుండి వందల ఇళ్లకు.. రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ఏడాది కాలంగా పునరావాసం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఆ ఊరి ప్రజలు. రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో.. ముఖ్యమంత్రి తమకు ఓ పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ, అది జరగలేదు. అందుకే పోరాటాన్ని ఉధృతం చేశారు. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమత్(చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వంద సంఖ్యలో ఇళ్లకు బీటలు వారాయి. అయినప్పటికీ ఉండడానికి మరో చోటులేక అక్కడే ఉండిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వం వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే అరవైకిపైగా కుటుంబాలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరికొందరి ఇళ్లు మరీ దారుణంగా తయారు అయ్యాయి. దీంతో 29 కుటుంబాలను అధికారులే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినా మరో 500 కుటుంబాలు అక్కడే భయం భయంగా గడుపుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనుకుంటూనే.. ఎక్కడ ఉండాలో తెలియక.. ఆవాసం కోసం బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ స్పందన.. జోషిమత్‌లో భూమి కుంగడం, ఇళ్లకు పగళ్లు రావడంపై ఎట్టకేలకు ఉత్తరాఖండ్ స్పందించింది. ఐఐటీ రూర్కీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించి ఓ నివేదికను రూపొందించబోతోంది. ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భావిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించబోతున్నారట. మూడు వేల మంది జనాభా ఉంటున్న ఈ ప్రాంతం.. ముప్పు ముంగిట ఉండడం వెనక కారణాల కోసం అన్వేషిస్తోంది ప్రభుత్వం. జోషిమత్‌లో ఇళ్లు మాత్రమే కాదు.. రోడ్లు కూడా దారుణంగా నాశనం అయ్యాయి. రవిగ్రామ్, గాంధీనగర్, మనోహర్‌బాగ్, సింగ్‌ధర్, పర్సారీ, ఉప్పర్‌బజార్, సునీల్, మార్వాడీ, లోయర్ బజార్.. ఇలా జోషిమత్‌లో పలు ఏరియాల్లో ఇళ్లకు పగళ్లు వచ్చాయి. అయినప్పటికీ పునరావాసం లేక అక్కడే ఉండిపోతున్నారు జోషిమత్ ప్రజలు. వెదరు బొంగులు, బరువైన వస్తువులను కుంగిపోతున్న నేలకు, గోడలకు సపోర్ట్‌గా ఉంచుతూ.. సునామీకి గొడుగు అడ్డుపెట్టే యత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడి పరిస్థితిపై నివేదిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సేవ్ జోషిమత్ కమిటీ కన్వీనర్ అతుల్ సతి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆధ్వర్యంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని, తమను కాపాడాలంటూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కారణాలు అవేనా? అయితే ఈ ప్రకృతి వైపరిత్యానికి గల సరైన కారణాలను తేల్చాల్సి ఉందని జోషిమత్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ చెబుతున్నారు. కానీ, జోషిమత్ భూకంపాలకు సంభావ్యత ఉన్న ప్రాంతం. చమోలీ జిల్లాకు ఆరు వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. హై రిస్క్ జోన్(జోన్-5) పరిధిలో ఉంది ఈ చోటు. పైగా భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలోనే ఇలా జరుగుతుందోనేమోనని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చమోలీ జిల్లా జాయింట్ మేజిస్ట్రేట్ దీపక్ సైనీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జోషిమత్‌కు పరమ పవిత ప్రాంతంగా వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు.. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్య నలు దిక్కుల నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి జోషిమత్(జ్యోతిర్మఠ్). ఉత్తరామ్నాయ మఠ్ పీఠం ఇది. (మిగతావి శృంగేరి, పూరీ, ద్వారకా). ఆదిశంకరాచార్య మఠంతో పాటు భవిష్య కేదార్ టెంపుల్, నార్సింగ్ ఆలయం, తపోవన్, గారి భవాని ఆలయం వీటితో పాటు ఔలీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్కడ ఉంది. 2021 ఉత్తరాఖండ్ వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యింది ఈ ప్రాంతం. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్‌ను బేస్ క్యాంప్‌గా సహాయక చర్యలకు ఉపయోగించారు కూడా. -
పెద్దింట పెళ్లిళ్లు.. చెత్తకు రూ. 2.5 లక్షల ఫైన్
డెహ్రాడూన్: దక్షిణాఫ్రికాకు చెందిన గుప్తా కుటుంబానికి ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ మున్సిపాలిటీ రూ. 2.5 లక్షల జరిమానా విధించింది. పెళ్లి తర్వాత మిగిలిన చెత్తను ఖాళీగా ఉన్న చోట పడేయడంతో జరిమానా విధించినట్లు జోషిమత్ మున్సిపాలిటీ అధికారి సత్యపాల్ నౌతియాల్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి స్కి రిసార్ట్‌లో జూన్ 20, 22న జరిగిన వారి ఇద్దరి కుమారుల పెళ్లిళ్లలో 321 క్వింటాళ్ల చెత్త పోగయింది. ఆ చెత్తను అలాగే వదిలేసినందుకు రూ. 1.5 లక్షలు, ఖాళీ స్థలంలో వేసినందుకు మరో లక్ష జరిమానా విధించింది. ఈ పెళ్లిళ్లకు రూ. 200 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లిళ్ల అనంతరం చెత్తను తొలగించేందుకుగాను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి రూ. 8.14 లక్షల బిల్లును పంపినట్లు అధికారులు తెలిపారు. యూజర్ చార్జీలు రూ. 54 వేలతో కలిపి మున్సిపాలిటీకి ముందుగానే రూ. 5.54 లక్షలను గుప్తా సోదరులు డిపాజిట్ చేయడం విశేషం. -
భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే?!
జోషిమఠ్ : హిందూ-ముస్లింల ఐక్యతను మరోసారి ప్రపంచానికి చాటారు. కేవలం కొందరి స్వార్థప్రయోజనాల వల్లే ఈ రెండు వర్గాల మద్య ఘర్షణలు తప్ప వాస్తవంగా ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవని ఇరు వర్గాలు మరోసారి తమ చర్యల ద్వారా స్పష్టం చేశాయి. ముస్లింల పవిత్ర దినమైన ఈద్ పండుగ రోజు నమాజ్‌చేసుకోవడానికి తమ గురుద్వారాను ఇచ్చి.. మత సామరస్యానికిమరో సారి నిలువుటద్దంలా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఆసక్తిర విషయాలు ఇవి. చార్దామ్ యాత్రలో మజిలీ అయినా బద్రినాథ్‌కు వెళ్లే దారిలో జోషిమఠ్ వస్తుంది. ఇక్కడ సిక్కులు, హిందువులు, ముస్లింలు చాలామంది నివసిస్తుంటారు. ఈ జోషిమఠ్‌లో శనివారం ఈద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు పెద్దఎత్తున గాంధీ మైదాన్‌లో నమాజ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. వర్షం భారీగా కురవడంతో ప్రార్థన చేసుకునేందుకు ముస్లింలు ఇబ్బంది పడ్డారు. వారి పరిస్థిని మగనించిన హేమకుండ్ గురుద్వారా ప్రభంధక్ కమిటీవారు.. తమ గురుద్వారాలో నమాజ్ చేసుకునేందుకు సిక్కు సోదరులు అవకాశం కల్పించారు. సిక్కు సోదరులు ప్రేమగా నమాజ్‌చేసుకోవడానికి ఆహ్వానించడంతో సుమారు వెయ్యిమంది ముస్లింలు గురుద్వారా నమాజ్ చేసుకున్నారు. ఆ సమయంలో ముస్లింలు టీ, పాలు ఇతర పదార్థాలను అందించారు.