డెహ్రాడూన్: భూమి కుంగిపోతున్నా సొంతింటిని, స్వస్థలాలను వదిలి వెళ్లేందుకు జోషీమఠ్ వాసులు ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలంటూ ఇప్పటికే దాదాపు 200కుపైగా ఇళ్లకు అధికారులు ఎరుపు రంగు పూశారు. వెంటనే సురక్షిత శిబిరాలకు లేదా అద్దె భవనాలకు తరలిపోవాలని, ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4,000 చొప్పున ఆరునెలలపాటు ఆర్థికసాయం అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం మరో 68 ఇళ్లకు పగుళ్లు పడ్డాయి. దీంతో కుంగిన, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 678కి పెరిగింది. అయినా పలువురు ఇళ్లు వీడటం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ సంధూ సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు.
‘ ప్రతి నిమిషమూ అత్యంత ప్రధానం. వెంటనే ఇళ్లను వీడండి’’ అని కోరారు. ‘‘ఎన్‌డీఆర్‌ఎఫ్, రాష్ట్ర బృందాలు ఇప్పటికే జోషిమఠ్‌లో సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. భూమి కుంగడంతో పగిలిన తాగు నీటి సరఫరా పైపులను పునరుద్దరించాలి. లేదంటే పెద్దమొత్తంలో నీరు దిగువ భూముల్లో ఇంకి త్వరగా మరింతగా కుంగే ప్రమాదం పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు. కాగా, ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్‌చేసింది. కుటుంబానికి రూ.5,000 చాలా తక్కువ మొత్తమని, సర్వస్వం కోల్పోతున్న ఒక్కో బాధితునికి రూ.50వేలు ఇవ్వాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment