uttarakhand government
-
Joshimath: కుంగుతున్నా వదలట్లేదు
డెహ్రాడూన్: భూమి కుంగిపోతున్నా సొంతింటిని, స్వస్థలాలను వదిలి వెళ్లేందుకు జోషీమఠ్ వాసులు ససేమిరా అంటున్నారు. ఖాళీ చేయాలంటూ ఇప్పటికే దాదాపు 200కుపైగా ఇళ్లకు అధికారులు ఎరుపు రంగు పూశారు. వెంటనే సురక్షిత శిబిరాలకు లేదా అద్దె భవనాలకు తరలిపోవాలని, ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4,000 చొప్పున ఆరునెలలపాటు ఆర్థికసాయం అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం మరో 68 ఇళ్లకు పగుళ్లు పడ్డాయి. దీంతో కుంగిన, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 678కి పెరిగింది. అయినా పలువురు ఇళ్లు వీడటం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధూ సోమవారం ఆందోళన వ్యక్తంచేశారు. ‘ ప్రతి నిమిషమూ అత్యంత ప్రధానం. వెంటనే ఇళ్లను వీడండి’’ అని కోరారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు ఇప్పటికే జోషిమఠ్‌లో సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. భూమి కుంగడంతో పగిలిన తాగు నీటి సరఫరా పైపులను పునరుద్దరించాలి. లేదంటే పెద్దమొత్తంలో నీరు దిగువ భూముల్లో ఇంకి త్వరగా మరింతగా కుంగే ప్రమాదం పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు. కాగా, ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్చేసింది. కుటుంబానికి రూ.5,000 చాలా తక్కువ మొత్తమని, సర్వస్వం కోల్పోతున్న ఒక్కో బాధితునికి రూ.50వేలు ఇవ్వాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అభిప్రాయపడ్డారు. -
‘చార్ధామ్’కు కోవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
డెహ్రాడూన్: ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు, సరిహద్దుల వద్ద వారు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు /వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నిబంధనను ప్రస్తుతానికి తొలగించినట్లు వివరించింది. పర్యాటక శాఖ పోర్టల్‌లో యాత్రికుల సంఖ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
ఏది నిజం, అక్కడ అమ్మాయిలు ఉన్నట్లా! లేనట్లా?
ఉత్తరాఖండ్: దేశంలో కనీసం 1000మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు జన్మిస్తున్నారనే విషయంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సర్వే నిర్వహించి రిపోర్ట్ ను విడుదల చేస్తాయి. వాటి ఆధారంగా ఆయా రాష్ట్రాల లింగ నిష్పత్తుల్ని నిర్ధారిస్తారు. తాజాగా ఉత్తరాఖండ్ లింగ నిష్పత్తుల్లో గందరగోళం నెలకొంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తిపై నీతి ఆయోగ్ ( సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ - ఎస్ డీజీ) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నీతి ఆయోగ్ రిపోర్ట్‌లో 1000 మంది అబ్బాయిలకు 840 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 1000 మంది అబ్బాయిలకు 949 మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది. కానీ తాజాగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వేలో మొత్తం 960మంది అమ్మాయిలు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. గత మూడేళ్లుగా నీతిఆయోగ్ ఎస్డీజీ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్‌కు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్‌కు ఒక్క ఏడాది సమానంగా లేదు, "నాకెందుకో నీతి ఆయోగ్ రిపోర్ట్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఆర్ఎస్ రిపోర్ట్‌లో సైతం దేశంలోనే లింగ నిష్పత్తిలో మంచి ఫలితాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉందని విషయాన్ని స్పష్టం చేసిందంటూ" మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య అన్నారు. అయితే నీతి ఆయోగ్ కేంద్ర (గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ) ఆధారంగా లింగ నిష్పత్తి రిపోర్ట్ ను విడుదల చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు చెప్పిన వివరాల ఆధారంగా ఈ రిపోర్ట్ విడుదల చేస్తుంది. మరి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ కరెక్ట్ గా ఉందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. చదవండి: అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?! -
వరద బాధితుడు కోహ్లీకి రూ. 47 లక్షలు!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరద బాధితుడేనట. ఆయనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధుల నుంచి రూ. 47.19 లక్షలు చెల్లించింది. రుద్రప్రయాగ జిల్లా కోసం కేటాయించిన ఈ నిధులను కోహ్లీకి మళ్లించినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. బీజేపీ నాయకుడు అజయ రాజేంద్ర సమాచార హక్కు చట్టం ప్రకారం దాఖలుచేసిన ఓ దరఖాస్తుకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. రుద్రప్రయాగ జిల్లా విపత్తు నివారణ సంస్థకు కేటాయించిన నిధుల నుంచి 2015 జూలై నెలలో రూ. 47.19 లక్షలు విరాట్ కోహ్లీకి చెల్లించినట్లు తెలిపింది. ఉత్తరఖండ్ టూరిజం ప్రమోషన్ కోసం వచ్చినందుకు కోహ్లీకి ఈ మొత్తాన్ని ముంబైలోని మెసర్స్ కైలాష్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెల్లించిందని అన్నారు. కేదార్నాథ్ వరదలతో విధ్వంసమైన రుద్రప్రయాగ జిల్లా పునర్నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వివిధ రాష్ట్రాలకు ఎండార్స్మెంట్లు చేయడం కొత్తేమీ కాదు గానీ.. విపత్తు నివారణ, తదనంతర చర్యల కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వ ప్రచారం కోసం ఖర్చుపెట్టడమే విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో టూరిజాన్ని ప్రమోట్ చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు గంట నిడివి ఉన్న ఆడియా - వీడియో క్లిప్‌ను రిలీజ్ చేసింది. అందులో విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. అయితే.. ఇలా చెల్లించడంలో తాము నిబంధనలను ఉల్లంఘించలేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సలహాదారు సురేంద్ర అగర్వాల్ చెప్పారు. కేదార్నాథ్ యాత్ర విజయవంతం కావాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. -
'అదే జరిగితే సీఎం పదవికి రాజీనామా చేస్తా'
డెహ్రాడూన్: తనకు ఇప్పటికీ మెజారిటీ ఉందని, దానిని అసెంబ్లీలో నిరూపించుకుంటానని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ సీఎం హరీష్ రావత్ అన్నారు. తొమ్మిదిమంది రెబల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమతోనే ఉన్నారని, వారు కాంగ్రెస్ తోనే ఉండిపోతామని చెప్పారని అన్నారు. ఒక వేళ మెజారిటీ లేకపోతే అప్పుడు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి పదిమంది రెబల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపినట్లు వార్తలు వచ్చాయి. అదీకాకుండా ప్రస్తుతం తమకు 35మంది శాసనసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే రావత్ స్పందించారు. తనకు పూర్తి బలం ఉందని, రెబల్ ఎమ్మెల్యేలకపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంటున్నారు. తమ ఎమ్మెల్యేలు అటు వెళ్లిపోయారంటూ బీజేపీ వాళ్లు చెబుతున్న సంఖ్యలన్నీ తప్పులేనని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చిందని, ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. -
మరో సీఎం పదవికి ఎసరు!
మరో ముఖ్యమంత్రి చాప కిందకు నీళ్లు వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తబోతోంది. హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 10 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు.. 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. శుక్రవారం రాత్రి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వీళ్లంతా కలిసి శనివారం నాడు బీజేపీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశం కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హరక్ సింగ్ రావత్, ప్రదీప్ బాత్రా, శైలేంద్ర సింఘాల్, ఉమేష్ చంద్ర కౌ, సుబోధ్ ఉనియాల్, శైలా రాణి రావత్, అమృతా రావత్, కుమార్ ప్రణవ్.. ఈ పదిమందీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ భగత్ సింగ్ కోషియారీ నేతృత్వంలోని త్రిసభ్య బీజేపీ కమిటీ గవర్నర్ కేకే పాల్‌ను కలిసి.. హరీష్ రావత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, అందువల్ల దాన్ని డిస్మిస్ చేయాలని కోరింది. ఈ బృందంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే అజయ్ భట్ కూడా ఉన్నారు. తగిన వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని గవర్నర్ ఆ బృందానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తనకు పూర్తి బలం ఉందని, రెబల్ ఎమ్మెల్యేలకపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంటున్నారు. తమ ఎమ్మెల్యేలు అటు వెళ్లిపోయారంటూ బీజేపీ వాళ్లు చెబుతున్న సంఖ్యలన్నీ తప్పులేనని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చిందని, ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, తాజా పరిణామంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తొలుత అరుణాచల్ ప్రదేశ్ లోను, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోను ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ అత్యంత అవినీతిమయమైన, దేశద్రోహ, అధికార దాహంతో ఉన్న పార్టీ అని రుజువు అవుతోందని వ్యాఖ్యానించారు. Brazen horse trading-first Arunachal now Uttarakhand. BJP proving to be most corrupt, deshdrohi n power hungry party https://t.co/vNTpy7T2xE — Arvind Kejriwal (@ArvindKejriwal) March 19, 2016