'అదే జరిగితే సీఎం పదవికి రాజీనామా చేస్తా'
డెహ్రాడూన్: తనకు ఇప్పటికీ మెజారిటీ ఉందని, దానిని అసెంబ్లీలో నిరూపించుకుంటానని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ సీఎం హరీష్ రావత్ అన్నారు. తొమ్మిదిమంది రెబల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమతోనే ఉన్నారని, వారు కాంగ్రెస్ తోనే ఉండిపోతామని చెప్పారని అన్నారు. ఒక వేళ మెజారిటీ లేకపోతే అప్పుడు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి పదిమంది రెబల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపినట్లు వార్తలు వచ్చాయి.
అదీకాకుండా ప్రస్తుతం తమకు 35మంది శాసనసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే రావత్ స్పందించారు. తనకు పూర్తి బలం ఉందని, రెబల్ ఎమ్మెల్యేలకపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంటున్నారు. తమ ఎమ్మెల్యేలు అటు వెళ్లిపోయారంటూ బీజేపీ వాళ్లు చెబుతున్న సంఖ్యలన్నీ తప్పులేనని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చిందని, ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు.