మరో సీఎం పదవికి ఎసరు!
మరో ముఖ్యమంత్రి చాప కిందకు నీళ్లు వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తబోతోంది. హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 10 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు.. 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. శుక్రవారం రాత్రి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వీళ్లంతా కలిసి శనివారం నాడు బీజేపీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశం కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హరక్ సింగ్ రావత్, ప్రదీప్ బాత్రా, శైలేంద్ర సింఘాల్, ఉమేష్ చంద్ర కౌ, సుబోధ్ ఉనియాల్, శైలా రాణి రావత్, అమృతా రావత్, కుమార్ ప్రణవ్.. ఈ పదిమందీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ భగత్ సింగ్ కోషియారీ నేతృత్వంలోని త్రిసభ్య బీజేపీ కమిటీ గవర్నర్ కేకే పాల్‌ను కలిసి.. హరీష్ రావత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, అందువల్ల దాన్ని డిస్మిస్ చేయాలని కోరింది. ఈ బృందంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే అజయ్ భట్ కూడా ఉన్నారు. తగిన వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని గవర్నర్ ఆ బృందానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే తనకు పూర్తి బలం ఉందని, రెబల్ ఎమ్మెల్యేలకపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హరీష్ రావత్ అంటున్నారు. తమ ఎమ్మెల్యేలు అటు వెళ్లిపోయారంటూ బీజేపీ వాళ్లు చెబుతున్న సంఖ్యలన్నీ తప్పులేనని అన్నారు. ఇప్పటివరకు కేవలం ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చిందని, ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, తాజా పరిణామంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తొలుత అరుణాచల్ ప్రదేశ్ లోను, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోను ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ అత్యంత అవినీతిమయమైన, దేశద్రోహ, అధికార దాహంతో ఉన్న పార్టీ అని రుజువు అవుతోందని వ్యాఖ్యానించారు.
Brazen horse trading-first Arunachal now Uttarakhand. BJP proving to be most corrupt, deshdrohi n power hungry party https://t.co/vNTpy7T2xE
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 19, 2016