వరద బాధితుడు కోహ్లీకి రూ. 47 లక్షలు!
Published Sat, Feb 25 2017 3:07 PM | Last Updated on Wed, Aug 1 2018 3:52 PM
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరద బాధితుడేనట. ఆయనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధుల నుంచి రూ. 47.19 లక్షలు చెల్లించింది. రుద్రప్రయాగ జిల్లా కోసం కేటాయించిన ఈ నిధులను కోహ్లీకి మళ్లించినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. బీజేపీ నాయకుడు అజయ రాజేంద్ర సమాచార హక్కు చట్టం ప్రకారం దాఖలుచేసిన ఓ దరఖాస్తుకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. రుద్రప్రయాగ జిల్లా విపత్తు నివారణ సంస్థకు కేటాయించిన నిధుల నుంచి 2015 జూలై నెలలో రూ. 47.19 లక్షలు విరాట్ కోహ్లీకి చెల్లించినట్లు తెలిపింది. ఉత్తరఖండ్ టూరిజం ప్రమోషన్ కోసం వచ్చినందుకు కోహ్లీకి ఈ మొత్తాన్ని ముంబైలోని మెసర్స్ కైలాష్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెల్లించిందని అన్నారు. కేదార్‌నాథ్ వరదలతో విధ్వంసమైన రుద్రప్రయాగ జిల్లా పునర్నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించారు.
పెద్ద పెద్ద సెలబ్రిటీలు వివిధ రాష్ట్రాలకు ఎండార్స్‌మెంట్లు చేయడం కొత్తేమీ కాదు గానీ.. విపత్తు నివారణ, తదనంతర చర్యల కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వ ప్రచారం కోసం ఖర్చుపెట్టడమే విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో టూరిజాన్ని ప్రమోట్ చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు గంట నిడివి ఉన్న ఆడియా - వీడియో క్లిప్‌ను రిలీజ్ చేసింది. అందులో విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. అయితే.. ఇలా చెల్లించడంలో తాము నిబంధనలను ఉల్లంఘించలేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సలహాదారు సురేంద్ర అగర్వాల్ చెప్పారు. కేదార్‌నాథ్ యాత్ర విజయవంతం కావాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు.
Advertisement