కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్ దక్షిణ క్యాంపస్‌ను ప్రారంభిస్తున్న , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా(Amit Shah). చిత్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తదితరులు
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
ఎన్‌డీఆర్‌ఎఫ్ భవనాలకు ప్రారంభోత్సవం
వీహెచ్‌పీ నేతల భేటీలో పలు కీలక విషయాలపై చర్చ
తిరుపతి తొక్కిసలాట ఘటన కేంద్రం పరిశీలనలోనూ ఉందని వెల్లడి
బీజేపీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచన
సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ప్రజల భద్రతకు భరోసానిస్తూ జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) నిరుపమాన సేవలు అందిస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్, దక్షిణ క్యాంపస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మూడింతల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమిత్ షా(Amit Shah) మనిషిలా కాకుండా మెషిన్‌లా పని చేస్తున్నారని, ఆయన పనితీరు చూస్తుంటే అసూయ కలుగుతోందన్నారు. పీపీపీ విధానంలో ‘గోదావరి – బనకచర్ల’ అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపత్తులను తక్షణం ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా(Amit Shah) గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు.
తొక్కిసలాట ఘటనపై దృష్టి
తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సైతం దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి అమిత్‌షా వీహెచ్‌పీ నేతల భేటీలో వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనతో ఆదివారం ఉదయం వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు నేతృత్వంలో సంఘ ప్రముఖ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడలో వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం సభ గురించి వారు అమిత్‌షాకు వివరించారు. దేశవ్యాప్తంగా ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి పూర్తిగా తప్పించి, స్వయం ప్రతిపత్తి క ల్పించేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాట అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి వీహెచ్‌పీ నేతలకు వివరించారని తెలిసింది.
ప్రజలు ఏమనుకుంటున్నారు..
రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలాంటి భావంతో ఉన్నారని అమిత్ షా(Amit Shah).. రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన బస చేసిన హోటల్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాసవర్మ, రాష్ట్ర పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్‌లతో కొద్దిసేపు సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలపై పెద్ద ఎత్తున ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశనం చేశారు. నామినేటెడ్ పదవులు పంపకం సహా కూటమి పారీ్టల మధ్య సమన్వయం ఎలా ఉందన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment