సాక్షి, విజయవాడ: తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జ్‌తో విచారణ సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలల పాటు విచారణ కమిషన్‌కు గడువు ఇచ్చింది. కాలయాపనకే 6 నెలలు సమయం ఇచ్చారని భక్తుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం అమాయక భక్తుల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చెలగాటమాడింది.
రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు.
రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment