కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Shares Tweet On AP Govt Over Tirumala Stampede Incident, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్‌ జగన్‌

Published Sun, Jan 12 2025 9:48 PM | Last Updated on Mon, Jan 13 2025 12:58 PM

YS Jagan Mohan Reddy On AP Govt Tirumala Stampede Incident

తాడేపల్లి:  ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తొక్కిసలాట(tirupati stampede) జరిగి ఆరుగురు మృతి చెందితే ఆ ఘటనకు సంబంధించిన బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan mohan reddy) ధ్వజమెత్తారు ఈ విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.  ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా  ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. 

మొత్తం పోలీసుల బలగం అంతా చంద్రబాబు చుట్టూనే..
‘‘చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాలమీద పూర్తి నియంత్రణ  ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా, స్థానిక కలెక్టర్‌, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని   చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? 

శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు?  తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?’ అని ప్రశ్నించారు. 

డిప్యూటీ సీఎం తీరు ఇంకా హాస్యాస్పదం
ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంగారేమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు.  ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? 

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట(tirupati stampede Incident) జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు.  చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా స్థానిక కలెక్టర్‌, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్‌ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని హెచ్చరించారు వైఎస్‌ జగన్‌.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement