తిరుపతి: తిరుమలలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్ర హోంశాఖ(Ministry of Home Affairs) సీరియస్‌గా ఉంది. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈనెల 8 వ తేదీన తిరుమలలో జరిగిన తొక్కిసలాట, 13వ తేదీన లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలపై ఇప్పటికే కేంద్రం నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అదనపు కార్శిదర్శి సంజీవ్ కుమార్ తిరుమలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానంగా తిరుమల తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై సోమవారం సమీక్షనిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ భేటీ కానున్నారు.
వరుసగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలపై టీటీడీ అధికారుల నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది. తిరుమలలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పర్యటనపై ఆసక్తి నెలకొంది.
పాలకుల వైఫల్యం.. భక్తులకు శాపం
ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ(TTD) పాలకుల మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.
తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు.
బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment