అమరావతి: తిరుపతిలో తొక్కిసలాట(Tirupati Stampede Incident) జరిగి ఆరుగురి మృతి చెందడంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy). ఈ ఘటన అత్యంత దారుణమన్న వైవీ సుబ్బారెడ్డి.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కల్గించాయన్నారు. ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ‘సాక్షి’తో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ‘లక్షలమంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కనీసం సమీక్షలైనా నిర్వహించారా?, వైఎస్సార్‌సీపీ హయాంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. కాబట్టే ఏ ప్రమాదం జరగలేదు. నేనే స్వయంగా వెళ్లి క్యూ లైన్లనను పరిశీలించేవాడిని. సమస్యలు ఎక్కడ ఉన్నాయో స్వయంగా తెలుసుకునేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు. అధికారులతో టీటీడీ సరిగా పనిచేయించలేదు. మృతుల కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’ అని ఆయన కోరారు.
కాగా, వైకుంఠ ద్వార దర్శన(Vaikunta Dwara Darshan) టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్‌లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది.
మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది.
ఆదుకోని అంబులెన్స్‌లు..
ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు.
సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం
సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం.
– సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లా
ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం
టీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్‌లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది.
– సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లా
Comments
Please login to add a commentAdd a comment