డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో మంచు, వర్షం కారణంగా నిలిచిపోయిన భవనాల కూల్చీవేత పనులు శనివారం నుంచి మళ్లీ మొదలయ్యాయి. 269 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. వీరికి హీటర్లు, ఉలెన్ దుస్తులు, వేడి నీరు, ఆహారపదార్థాల కిట్లు అందజేశామన్నారు. కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంచు కురవడం, తుంపర్ల వర్షం కారణంగా చలి తీవ్రత పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. జోషీమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
కాగా ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. భూమి కుంగిపోవడంతో జోషీమఠ్‌లో 849 ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. అంతేగాక జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment