Joshimath: ఎవరి పాపం ఇది?! | Editorial About-Joshimath Uttarakhand | Sakshi
Sakshi News home page

Joshimath: ఎవరి పాపం ఇది?!

Published Tue, Jan 10 2023 12:22 AM | Last Updated on Tue, Jan 10 2023 12:24 AM

Editorial About-Joshimath Uttarakhand - Sakshi

అది సాక్షాత్తూ శంకరాచార్యుడు నడయాడిన నేల. ఆయన ప్రవచనాలు విని పులకించిన పుణ్య భూమి. ఆయన చేతుల మీదుగా దేశంలో ఏర్పాటైన నాలుగు ప్రధాన పీఠాల్లో ఒకటైన జ్యోతిర్మఠం ఇక్కడిదే. ఈ పట్టణం పేరు దాన్నుంచే వచ్చింది. హిరణ్యకశిపుడిని వధించిన ఉగ్ర నరసింహుడు శాంతమూర్తిగా మారింది ఈ ప్రదేశంలోనేనని వ్యాస విరచిత స్కంధపురాణం అంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ఇక్కడి ఎత్తయిన హిమవన్నగాలు, దట్టమైన అడవులు, నిత్యం గలగలపారే హిమానీ నదాలను వీక్షించటానికి వచ్చే పర్యాటకులు కూడా తక్కువేమీ కాదు. పైగా చైనా సరిహద్దును ఆనుకునివున్న ప్రాంతంగనుక వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. హిమశిఖరాల అధిరోహణకు తరలివెళ్లే బృందాలు ఈ ప్రాంతం మీదుగానే సాగుతాయి.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఇంతటి ఘనమైన పౌరాణిక, చారిత్రక, పర్యాటక ప్రదేశమైన జోషిమఠ్‌ సంబంధించి కొన్ని వారాలుగా వెలువడుతున్న వార్తలు హడలెత్తిస్తున్నాయి. అక్కడి నివాస గృహాలు ఉన్నట్టుండి బీటలు వారుతుండటం, నేల నెర్రెలుబారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తు న్నాయి. జోషిమuŠ‡ ఉన్న చమోలీ జిల్లాలోనే కర్ణప్రయాగ్, గోపేశ్వర్‌ పట్టణాలు... తెహ్రీ జిల్లాలోని ఘన్సాలీ, పితోర్‌గఢ్‌ జిల్లా మున్సియారి, ధార్చులా... ఉత్తరకాశీ జిల్లా భట్వారీ... ఇంకా పౌరీ, నైని టాల్‌ తదితర పట్టణాలకు సైతం ఇలాంటి ముప్పే పొంచివున్నదని నిపుణులంటున్న మాట. 

ఇది ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ముప్పు కాదు. గత కొన్ని దశాబ్దాలుగా మనుషులు చేసిన, చేస్తున్న పాపాల పర్యవసానమే ఈ ఉత్పాతం. లాభార్జన తప్ప మరేమీ పట్టని కార్పొరేట్‌ సంస్థలు, అక్రమార్జనకు అలవాటుపడిన నేతలు ఏకమై ప్రకృతి వనరులను దోచుకు తింటున్నారన్న ఏకైక కారణంతో ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాఖండ్‌ వాసులు సుదీర్ఘకాలం పోరాటాలు చేశారు. అవి కొన్నిసార్లు హింసాయుత రూపం కూడా తీసుకున్నాయి. వృక్షాలను హత్తుకునే అహింసాయుత చిప్కో ఉద్యమం పురుడుపోసుకున్నది ఈ నేలపైనే.

తమ జీవనాధారమైన అడవులను నేలమట్టం చేస్తున్న తీరుపై 1973లో వేలాదిమంది గ్రామీణులు సుందర్‌లాల్‌ బహుగుణ నేతృత్వంలో ప్రారంభించిన ఈ ఉద్యమం దీర్ఘకాలం ప్రభావవంతంగా కొనసాగడంలో మహిళల పాత్ర ప్రధాన మైనది. అనంతరకాలంలో ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు ఊపిరులూదిందీ, ప్రేరణగా నిలిచిందీ చిప్కో ఉద్యమమే. తెహ్రీ డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఎన్నో ఉద్యమాలు సాగాయి. స్థానిక వనరులపై సంపూర్ణావగాహనగల తమ ప్రాంతంవారు పాలకులైతే తప్ప ఈ దోపిడీనీ, ఈ అరాచ కాన్నీ నివారించలేమన్న భావనతో స్థానికులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన పర్యవసానం గానే... వారి త్యాగాల ఫలితంగానే 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ ఆవిర్భవించింది.

కానీ గత రెండు దశాబ్దాలుగా జరిగిందంతా వేరు. బలమైన నాయకత్వం కొరవడి రాష్ట్రం అస్థిరత్వంలోకి జారుకుంది. రాష్ట్రం 13 మంది ముఖ్యమంత్రులను, రెండు దఫాలు రాష్ట్రపతి పాలన చవిచూసిం దంటే పార్టీలకు అతీతంగా నాయకగణం ఎలా భ్రష్టుపట్టిపోయిందో అర్థమవుతుంది. అభివృద్ధి పేరుతో నిర్మించిన జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవంతులు, కొండల్ని పిండిచేసి నిర్మించే రహదారులు, సొరంగాలు అక్కడి పర్యావరణ సమతౌల్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అడవుల విధ్వంసం సరేసరి. ఎన్నడో 1976లోనే ఎంసీ మిశ్రా కమిషన్‌ ఈ ప్రాంత ప్రత్యేక భౌగోళిక స్థితిపై నివేదిక వెలువరించింది.

జోషిమఠ్‌ భూగర్భంలోని అంతర్వాహినులవల్ల ఈ నేలకు కుంగి పోయే గుణమున్నదని హెచ్చరించింది. విన్నవారేరి? దశాబ్దాలుగా అన్ని హెచ్చరికలనూ పాలకులు పెడచెవిన పెట్టి అభివృద్ధి మంత్రం జపించిన పర్యవసానంగా అక్కడి ప్రజానీకం భయం గుప్పెట్లో బతుకులీడుస్తున్నారు. ఈ ప్రాంతంలో సాగిస్తున్న నిర్మాణాల తీరుతెన్నులు చూస్తే భయాందోళనలు కలుగుతాయి. ఆసియాలో అతిపెద్దదైన, దీర్ఘమైన రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడిదే.

420 మెగా వాట్ల విష్ణుప్రయాగ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు, ఎన్‌టీపీసీకి చెందిన 520 మెగావాట్ల తపోవన్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టులతోపాటు చార్‌ధామ్‌ ప్రాజెక్టు పేరిట విశాలమైన రహదారులు, సొరంగాలు నిర్మాణ మవుతున్నాయి. ఇవన్నీ నదీప్రవాహాలకు ఆటంకమవుతుంటే అవి తమ దోవ తాము వెదుక్కుంటు న్నాయి. ఇక వలసలతో నానాటికీ పెరుగుతున్న జనాభా సంగతి సరేసరి. ఈ ప్రాంతం భూకంప జోన్‌లో ఉన్నదన్న జ్ఞానం కూడా పాలకులకు కొరవడింది. 

మనిషి మనుగడకు ప్రకృతి వనరుల వినియోగం తప్పనిసరే. అందువల్ల సహజమైన సమతుల్యత ఏదోమేరకు దెబ్బతినడం కూడా అనివార్యమే. కానీ దాన్ని కనిష్ట స్థాయిలో ఉంచటం, మరీ ముఖ్యంగా ఎంతో సున్నితమైన హిమవత్పర్వత ప్రాంతంలో ప్రకృతిపట్ల భయభక్తులతో మెలగటం అవసరం. కార్పొరేట్‌ సంస్థల దురాశకూ, కాంట్రాక్టర్ల లాభార్జనకూ, స్వీయప్రయోజనాల రక్షణకూ యధేచ్ఛగా పర్యావరణ విధ్వంసానికి పూనుకుంటే ఏమవుతుందో జోషిమఠ్‌ ఉత్పాతం తెలియజెబుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి పేరిట సాగిస్తున్న నిర్మాణాలే ప్రస్తుత దుస్థితికి కారణమని జోషిమఠ్‌  పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద్‌ చేసిన ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఇప్పటికైనా పాలకులు మేల్కొనాలి. పరిస్థితులు చేయిదాటిపోకుండా తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. ఉత్తరాఖండ్‌ భౌగోళిక స్థితిగతుల ఆధారంగా పకడ్బందీ మాస్టర్‌ప్లాన్‌ రూపొం దించి, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement