![Sakshi Editorial On Uttarakhand UCC Bill](/styles/webp/s3/article_images/2024/02/7/UCC.jpg.webp?itok=jJCdDUg6)
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టి దేశంలోనే ఆ దిశగా తొలి అడుగేసిన రాష్ట్రమైంది. ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ ఆరాటం ఎవరికీ తెలియంది కాదు. ఆవిర్భావం నుంచీ బీజేపీ ఆ మాట చెబుతూ వస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూసీసీ ఆ పార్టీ వాగ్దానాల్లో కీలకాంశం. రాష్ట్రాల్లో అంతకుముందూ, ఆ తర్వాతా బీజేపీ అధికారం అందుకున్నా ఎక్కడా ఉమ్మడి పౌరస్మృతి ఇలా బిల్లు రూపంలో చట్టసభ ముందుకొచ్చిన వైనం లేదు. మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్‌లలో బీజేపీ ప్రభుత్వాలే వున్నా ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదు.
ఆ రకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఇతరులకన్నా చాలా ముందున్నట్టు లెక్క. దేశంలో ప్రస్తుతం ఒక్క గోవాలో మాత్రమే యూసీసీ అమల్లో వుంది. అయితే అది 1867లో అప్పటి పోర్చుగీస్ పాలకులు తెచ్చిన చట్టం. రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం యూసీసీ గురించి చర్చ జరిగింది. దాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడగా మైనా రిటీ వర్గాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించటంతో అంతకుమించి ముందుకు కదల్లేదు. చివరకది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 44వ అధికరణ అయింది. దేశంలోని పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటానికి రాజ్యం కృషి చేయాలని ఆ అధికరణ నిర్దేశించింది.
ఆదేశిక సూత్రాలు రాజ్యం అమలు చేసి తీరాల్సినవి కాదు గనుక న్యాయస్థానాల తీర్పుల్లో ఉటంకించటానికి మాత్రమే ఆ అధికరణ పనికొచ్చింది. 1985లో షాబానో కేసులోనూ, 1995లో సరళా ముద్గల్ కేసు లోనూ వెలువరించిన తీర్పుల్లో ఉమ్మడి పౌరస్మృతి దేశ సమైక్యతకూ, సమగ్రతకూ తోడ్పడుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనాలు అభిప్రాయపడ్డాయి. 21వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతిపై భిన్నవర్గాల అభిప్రాయాలు సేకరించి, న్యాయనిపుణులతో కొన్ని నెలలపాటు చర్చించి ‘ఈ దశలో అది అవసరమూ కాదు, వాంఛనీయమూ కాద’ని తేల్చింది. చిత్రమేమంటే ఆ తర్వాత ఏర్పడ్డ 22వ లా కమిషన్ యూసీసీపై ప్రజాభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రకటనలు విడుదల చేసింది. అది జరిగి మూడేళ్లు గడిచింది కాబట్టి ప్రజల తాజా అభిప్రాయమేమిటో తెలుసుకోదల్చుకున్నామని లా కమిషన్ సమర్థించుకుంది.
ఉమ్మడి పౌరస్మృతి చుట్టూ మొదటినుంచీ వివాదాలు అల్లుకుంటూనే వున్నాయి. దాన్ని తీసుకు రావటం, సజావుగా అమలు చేయటం భిన్న మతాల, సంస్కృతులకు నిలయమైన భారత్‌లో సాధ్యంకాదన్నది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత తది తర వ్యవహారాలతో ముడిపడివుండే అంశాల్లో వేర్వేరు మతాలకు వేర్వేరు సంప్రదాయాలున్నాయి. దాదాపు అన్ని పర్సనల్ చట్టాలూ మహిళలపై వివక్ష ప్రదర్శిస్తున్నాయి. ఈ దశలో అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటం అంత సులభం కాదు.
50వ దశకంలో హిందువులకు వర్తించేలా అయిదు చట్టాలు– హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనర్ల సంరక్షకత్వ చట్టం, హిందూ దత్తత, మనోవర్తి చట్టం, హిందూ ఆస్తి స్వాధీనతా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాలే సిక్కు, బౌద్ధ, జైన మతస్తులకు కూడా వర్తిస్తున్నాయి. ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతస్తులకు వేర్వేరు పర్సనల్ చట్టాలున్నాయి. ఆ మతాల్లో కూడా కొన్ని అంశాల్లో ఏకరూపత లేదు. సంప్ర దాయాల పరంగా చూస్తే వివాహాలకు సంబంధించి హిందూమతంలోనే భిన్నమైన ఆచరణలు న్నాయి. అవిభాజ్య హిందూ కుటుంబాలకు వర్తించే పన్ను రాయితీల వంటివి వేరే మతస్తులకు వర్తించవు.
ఇక ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలలో స్థానిక సంప్రదాయాలను పరిరక్షించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. రాజ్యాంగంలోని 25వ అధికరణ పౌరులందరికీ ఏ మతా న్నయినా ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కును ఇస్తున్నది. ఇన్ని అవరోధాలను దాటుకుని అందరికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావటం అంత సులభమేమీ కాదు. 2019లో కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టానికి ఏమైందో మన కళ్లముందే వుంది.
అందులోని కఠిన నిబంధనల కారణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ అవసరాలకు తగినట్టు చట్టానికి సవరణలు తీసుకొచ్చాయి. వలస పాలకుల హయాంలో రూపొంది ఇంతవరకూ అమల్లోవున్న సాక్ష్యాధారాల చట్టం, కాంట్రాక్టు చట్టం, ఆస్తి బదలాయింపు చట్టం వగైరాలకు దాదాపు అన్ని రాష్ట్రాలూ వందల సవరణలు చేసుకున్నాయి. కనుక ‘ఒకే దేశం–ఒకే చట్టం’ ఆదర్శనీయమైనంతగా ఆచరణసాధ్యం కాదు.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై చర్చ, ఆమోదం మంగళవారమే ఉంటాయని ప్రభుత్వం చెప్పినా మరింత సమయం అవసరమన్న విపక్షాల వినతితో అసెంబ్లీ స్పీకర్ దాన్ని సవరించారు. ఆ సంగ తలా వుంచితే ఒక్క ఆదివాసీలు మినహా అన్ని మతాలవారికీ వివాహం, విడాకులు, ఆస్తి హక్కు వగైరా అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని బిల్లు చెబుతోంది. ఆఖరికి సహజీవనం చేసే జంటలు సైతం తమ బంధాన్ని రిజిస్టర్ చేయించుకోవాల్సిందేనని బిల్లు నిర్దేశిస్తోంది.
సహజీవనంలోకి వెళ్లిన నెలలోగా రిజిస్టర్ చేసుకోవాలనీ, అలా చేయకపోతే మూడునెలల కారాగారం తప్పదనీ హెచ్చరిస్తోంది. రిజిస్టర్ చేయించుకున్న సహజీవనం ద్వారా జన్మించే సంతానాన్ని మాత్రమే సక్రమ సంతానంగా గుర్తించటం సాధ్యమంటున్నది. ఉత్తరాఖండ్‌లో నివసించే వేరే రాష్ట్రాలవారికి సైతం ఇది వర్తిస్తుందని చెబుతోంది. ఇలా పౌరుల వ్యక్తిగత అంశాల్లోకి రాజ్యం చొరబడటం సబబేనా? అసలు దేశమంతటికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని 44వ అధికరణ నిర్దేశిస్తుండగా, ఒక రాష్ట్రం అలాంటి చట్టం తీసుకురావటం రాజ్యాంగబద్ధమేనా?
Comments
Please login to add a commentAdd a comment