దేశంలో తొలి రాష్ట్రంగా రికార్డు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో నేటి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు కాబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో యూసీసీని అమల్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించబోతున్నట్లు తెలిపారాయన.
ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించిన నిబంధనలను కేబినెట్ ఆమోదించినట్లు సీఎం ధామీ వెల్లడించారు. సమాజంలో ప్రజలందరి మధ్య సమానత్వం కోసం యూసీసీ అవసరమని ఉద్ఘాటించారు.
దీంతో అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు లభిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, సామరస్యం, స్వయం సమృద్ధితో కూడిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా యజ్ఞం చేస్తున్నారని, ఇందులో తమ వంతు పాత్రగా యూసీసీని అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల హామీ అమలు
అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్న 2022 ఎన్నికల హామీని బీజేపీ నిలుపుకుంటోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 2022 మే 27న నిపుణుల కమిటీ ఏర్పాటయ్యింది. 2024 ఫిబ్రవరి 2న ముసాయిదా ప్రతిని ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. నెల తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది. యూసీసీ చట్టం అమలుపై నియమ నిబంధనలు రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ నివేదిక అందజేసింది.
దేశమంతటా యూసీసీ: ధామి
సామరస్యపూర్వకమైన సమాజానికి ఉమ్మడి పౌరస్మృతి బలమైన పునాది అవుతుందని సీఎం ధామీ ఆదివారం పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలకు ఇచ్చిన హామీని సోమవారం నుంచే అమలు చేయబోతున్నామని వెల్లడించారు. వివక్షకు తావులేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించాలన్నదే బీజేపీ ధ్యేయమని తెలిపారు. ఎన్నో గొప్ప నదులు ఉత్తరాఖండ్‌లో పుట్టాయని, అలాగే యూసీసీ గంగోత్రి కూడా దేశమంతటా ప్రవహించబోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కూడా ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు.
యూసీసీపై ఉత్తరాఖండ్ మోడల్
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమల్లోకి వస్తుండడంతో మిగతా బీజేపీ పాలత రాష్ట్రాలూ అదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. అస్సాం ఇప్పటికే యూసీసీ అమలుపై ఆసక్తి వ్యక్తంచేసింది. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం తదితర వ్యవహారాల్లో కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తించడమే ఉమ్మడి పౌరస్మృతి.
యూసీసీతో బాహు భార్యత్వంపై నిషేధమూ అమల్లోకి వస్తుంది. అన్ని వర్గాల్లోని పురుషులు గానీ, స్త్రీలు గానీ ప్రభుత్వం నిర్దేశించిన వయసు కంటే ముందే పెళ్లి చేసుకోవడం నేరమవుతుంది. అన్ని రకాల పెళ్లిలు, సహజీవనాలను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఆన్‌లైనలో రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెళ్లి చేసుకోని జంటలకు జన్మించే బిడ్డలకు సైతం యూసీసీతో చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment