బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాము ధరించే హిజాబ్‌ను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వివక్ష చూపుతోందని కర్ణాటక హైకోర్టులో ముస్లిం విద్యార్థినులు వాదించారు. ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ చట్టవ్యతిరేకమని, ఈ విషయంపై ఎంఎల్‌ఏ ఆధ్వర్యంలోని కాలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ(సీడీసీ)కి నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. భారతీయులు లాకెట్లు, శిలువ, బుర్కా, గాజులు, హిజాబ్, బొట్టు, తలపాగా లాంటి పలురకాల మత చిహ్నాలు ధరిస్తారని విద్యార్థినుల తరఫు న్యాయవాది రవి వర్మ కుమార్ చెప్పారు.
ఈ పిటీషన్‌ను సీజే జస్టిస్ అవస్తీతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. 1995 విద్యా శాఖ నిబంధనల్లో 11వ నిబంధన ప్రకారం విద్యాసంస్థలు యూనిఫామ్ మార్పుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనీసం ఏడాది ముందు తెలియజేయాలన్నారు. అలాగే ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ గురించి పీయూ విద్యాశాఖ నిబంధనలు ఎక్కడా ప్రస్తావించలేదని కుమార్ చెప్పారు.
ఎక్కడా హిజాబ్‌ను నిషేధించాలని లేనప్పుడు ఏ అధికారంతో పిల్లలను క్లాసు నుంచి బయటకు పంపుతున్నారని ప్రశ్నించారు. సీడీసీలను విద్యాప్రమాణాల మెరుగుదల కోసం, నిధుల సక్రమ వినియోగ పర్యవేక్షణ కోసం ఒక సర్క్యులర్ ద్వారా 2014లో ఏర్పాటు చేశారని, ఈ కమిటీకి విద్యార్థుల సంక్షేమంతో సంబంధం లేదని వాదించారు. కమిటీ అధిపతులైన ఎంఎల్‌ఏకు కార్యనిర్వాహక అధికారాలివ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వాదనల అనంతరం కోర్టు విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది.
ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో అదే తంతు
వారం రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ కాలేజీలు బుధవారం తెరుచుకున్నాయి. అయితే పలు చోట్ల బుర్కా ధరించిన విద్యార్థినులకు కాలేజీల్లోకి ప్రవేశాన్ని నిరాకరించారు. సున్నిత ప్రాంతాల్లోని కాలేజీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలామంది ముస్లిం విద్యార్థినులు బుర్కా తీసివేయడానికి నిరాకరించారు. ఉడిపిలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హిజాబ్‌పై హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ముస్లిం బాలికలు కళాశాలకు హాజరు కాలేదని ప్రిన్సిపాల్ రుద్ర గౌడ చప్పారు.
మిగిలిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసివేసి క్లాసులకు హాజరయ్యారని చెప్పారు. కుందాపూర్‌లో హిజాబ్ తీసివేయడానికి నిరాకరించిన 23 మంది విద్యార్థినులు కూడా కాలేజీకి హాజరుకాలేదు. గతవారం గందరగోళం జరిగిన మణిపాల్‌లోని ఎంజీఎం కాలేజీ సహా ఆందోళనలు తలెత్తిన ప్రాంతాల్లో కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం హిజాబ్ తీసివేసిన విద్యార్థినులనే తరగతులకు అనుమతించారు. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు సైతం బుధవారం ఆరంభమయ్యాయి. అయితే వీటిలో ఎలాంటి యూనిఫామ్ నిబంధన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం
హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అసెంబ్లీలో వెల్లడించారు. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ యూనిఫామ్ నిబంధన డిగ్రీ కాలేజీలకు వర్తించదని వివరణ ఇచ్చారు.
గాజులు మత చిహ్నాలు కాదా?
సమాజంలోని భిన్న వర్గాలు భిన్న మత చిహ్నాలు ఉపయోగిస్తాయని, కానీ ప్రభుత్వం కేవలం హిజాబ్‌పై వివక్ష చూపుతోందన్నారు. అలాంటప్పుడు గాజులు మత చిహ్నాల కిందకు రావా? అని న్యాయవాది కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల్లో ఇతర మత చిహ్నాలను వదిలికేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించిన ఆయన కేవలం ముస్లింల విశ్వాసానికి చెందినది కాబట్టే హిజాబ్‌ను వద్దంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ముస్లిం బాలికలపై ఈ వివక్ష 15వ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినకుండా నేరుగా శిక్ష విధించినట్లయిందని, ఇది అమానుషమని వాదించారు. విద్య బహుళత్వాన్ని బోధించాలని, తరగతి గదులు సమాజంలో భిన్నత్వాన్ని ప్రతిబింబించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment