Development committee
-
మా మీద విద్వేషపూరిత వివక్ష
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాము ధరించే హిజాబ్‌ను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వివక్ష చూపుతోందని కర్ణాటక హైకోర్టులో ముస్లిం విద్యార్థినులు వాదించారు. ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ చట్టవ్యతిరేకమని, ఈ విషయంపై ఎంఎల్ఏ ఆధ్వర్యంలోని కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ(సీడీసీ)కి నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. భారతీయులు లాకెట్లు, శిలువ, బుర్కా, గాజులు, హిజాబ్, బొట్టు, తలపాగా లాంటి పలురకాల మత చిహ్నాలు ధరిస్తారని విద్యార్థినుల తరఫు న్యాయవాది రవి వర్మ కుమార్ చెప్పారు. ఈ పిటీషన్‌ను సీజే జస్టిస్ అవస్తీతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. 1995 విద్యా శాఖ నిబంధనల్లో 11వ నిబంధన ప్రకారం విద్యాసంస్థలు యూనిఫామ్ మార్పుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు కనీసం ఏడాది ముందు తెలియజేయాలన్నారు. అలాగే ప్రీయూనివర్సిటీ కాలేజీల్లో యూనిఫామ్ గురించి పీయూ విద్యాశాఖ నిబంధనలు ఎక్కడా ప్రస్తావించలేదని కుమార్ చెప్పారు. ఎక్కడా హిజాబ్‌ను నిషేధించాలని లేనప్పుడు ఏ అధికారంతో పిల్లలను క్లాసు నుంచి బయటకు పంపుతున్నారని ప్రశ్నించారు. సీడీసీలను విద్యాప్రమాణాల మెరుగుదల కోసం, నిధుల సక్రమ వినియోగ పర్యవేక్షణ కోసం ఒక సర్క్యులర్ ద్వారా 2014లో ఏర్పాటు చేశారని, ఈ కమిటీకి విద్యార్థుల సంక్షేమంతో సంబంధం లేదని వాదించారు. కమిటీ అధిపతులైన ఎంఎల్ఏకు కార్యనిర్వాహక అధికారాలివ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వాదనల అనంతరం కోర్టు విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో అదే తంతు వారం రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ కాలేజీలు బుధవారం తెరుచుకున్నాయి. అయితే పలు చోట్ల బుర్కా ధరించిన విద్యార్థినులకు కాలేజీల్లోకి ప్రవేశాన్ని నిరాకరించారు. సున్నిత ప్రాంతాల్లోని కాలేజీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలామంది ముస్లిం విద్యార్థినులు బుర్కా తీసివేయడానికి నిరాకరించారు. ఉడిపిలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హిజాబ్‌పై హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ముస్లిం బాలికలు కళాశాలకు హాజరు కాలేదని ప్రిన్సిపాల్ రుద్ర గౌడ చప్పారు. మిగిలిన ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తీసివేసి క్లాసులకు హాజరయ్యారని చెప్పారు. కుందాపూర్‌లో హిజాబ్ తీసివేయడానికి నిరాకరించిన 23 మంది విద్యార్థినులు కూడా కాలేజీకి హాజరుకాలేదు. గతవారం గందరగోళం జరిగిన మణిపాల్‌లోని ఎంజీఎం కాలేజీ సహా ఆందోళనలు తలెత్తిన ప్రాంతాల్లో కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం హిజాబ్ తీసివేసిన విద్యార్థినులనే తరగతులకు అనుమతించారు. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు సైతం బుధవారం ఆరంభమయ్యాయి. అయితే వీటిలో ఎలాంటి యూనిఫామ్ నిబంధన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అసెంబ్లీలో వెల్లడించారు. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ యూనిఫామ్ నిబంధన డిగ్రీ కాలేజీలకు వర్తించదని వివరణ ఇచ్చారు. గాజులు మత చిహ్నాలు కాదా? సమాజంలోని భిన్న వర్గాలు భిన్న మత చిహ్నాలు ఉపయోగిస్తాయని, కానీ ప్రభుత్వం కేవలం హిజాబ్‌పై వివక్ష చూపుతోందన్నారు. అలాంటప్పుడు గాజులు మత చిహ్నాల కిందకు రావా? అని న్యాయవాది కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల్లో ఇతర మత చిహ్నాలను వదిలికేవలం హిజాబ్‌ను మాత్రమే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించిన ఆయన కేవలం ముస్లింల విశ్వాసానికి చెందినది కాబట్టే హిజాబ్‌ను వద్దంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ముస్లిం బాలికలపై ఈ వివక్ష 15వ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినకుండా నేరుగా శిక్ష విధించినట్లయిందని, ఇది అమానుషమని వాదించారు. విద్య బహుళత్వాన్ని బోధించాలని, తరగతి గదులు సమాజంలో భిన్నత్వాన్ని ప్రతిబింబించాలని చెప్పారు. -
సీఎం ప్రతిపాదన ఉత్తరాంధ్రకు వరం
అల్లిపురం(విశాఖ దక్షిణ): రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా ఉండే అన్ని అర్హతలు విశాఖపట్నానికే ఉన్నాయని మేధావులు, పారిశ్రామిక వేత్తలు స్పష్టం చేశారు. తక్షణమే రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు తమ వంతు మద్దతు ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో శనివారం అల్లిపురంలోని ఓ హోటల్లో మేధావులు, పారిశ్రామిక వేత్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ‘విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని–సీఎం ప్రతిపాదన’కు మద్దతుగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంకాస్మోపాలిటన్ నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కొంతమంది నాయకులు విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘విశాఖ ప్రజలు సౌమ్యులు.. ఎవరినీ ఏమీ అడగరు.. ఎవరు వచ్చినా స్వాగతించి.. ఆదరించి అన్నం పెడతారు’అని అన్నారు. బౌద్ధ భిక్షువులకు, వ్యాపార నిమిత్తం వచ్చిన ఎందరికో అన్నం పెట్టిన నేల ఉత్తరాంధ్ర అని కొనియాడారు. పావురాల కొండ, తొట్ల కొండ, బొజ్జన్నకొండ వంటి 12 బౌద్ధారామాలు కలిగిన కొండలు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. గొప్ప చరిత్ర కలిగిన విశాఖకే పరిపాలనా రాజధానిగా ఉండే అర్హత ఉందని వక్తలు నొక్కివక్కాణించారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి పేరుతో ఆందోళన చేస్తున్న వారు రైతులు కారని, నిజమైన రైతులు 150 కిలోమీటర్ల దూరం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలిందన్నారు. రైతుల పేరుతో దీక్షలు, ధర్నాలు చేసి రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వాసులకు రాజధాని ఎందుకని పదే పదే మాట్లాడటం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకుని మూడు రాజధానులకు మద్దతివ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, వారి వాక్కును వినిపించేందుకుగానూ.. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితిని ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ పీవీ సాంబమూర్తి తెలిపారు. విభజన చట్టంలో అంశాలను టీడీపీ అనుసరించలేదు విభజన చట్టంలోని అంశాలను టీడీపీ ప్రభుత్వం అనుసరించలేదు. హైదరాబాద్‌ను రాజధానిగా పదేళ్లు మనం ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఉండే హక్కును వదులుకుని రాజధాని అభివృద్ధి చేయకుండానే అమరావతికి తరలిరావడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల బాగోగులు చూడాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా సీఎం చేసిన ప్రతిపాదనను అందరూ స్వాగతించాలి. –ఆచార్య సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యులు, ఏయూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ అవసరం. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. విశాఖ ఒక విశిష్ట నగరం. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు, అర్హతలు ఉన్నాయి. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. నేరుగా పరిపాలన జరిపేందుకు అవసరమైన ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి పాలనా పరమైన ఇబ్బందులు లేకుండా, ఖర్చు తగ్గించుకునేందుకు ఇదే మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాలి. – ఆచార్య తిమ్మారెడ్డి ధర్నాలు చేస్తోంది నిజమైన రైతులు కాదు అమరావతి రాజధాని కావాలని ధర్నాలు చేస్తున్నవారు నిజమైన రైతులు కారు. మా బృందం 15 గ్రామాల్లో 1,500 మంది రైతులను స్వయంగా కలిసి మాట్లాడింది. నిజమైన రైతులు, రైతు కూలీలు రోజూ ఉపాధి నిమిత్తం కిలోమీటర్ల దూరం వెళ్లిపోతున్నారు. ధర్నాల్లో పాల్గొంటున్న వారు దళారులు, భూస్వాములే. వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసింది. నిజమైన రైతులకు విద్యా, ఉపాధి అవకాశాలు లేవు. వారిని ఆదుకుని సరైన న్యాయం చేయాలి. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకే ఉన్నాయి. – ఆచార్య ఎం.వి.రామరాజు, సైకాలజిస్ట్ -
జాడలేని రిమ్స్ అభివృద్ధి కమిటీ
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్రంలో రిమ్స్‌ను ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్ మరణానంతరం పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో వైద్యం అందని ద్రాక్షగానే మారింది. ఆస్పత్రిలో రోగుల సమస్యలు, పరికరాల కొనుగోలు, అభివృద్ధి అంశాలను చర్చించేందుకు రిమ్స్ అభివృద్ధి కమిటీ పనిచేస్తుంది. మూడు నెలలకోసారి రిమ్స్ డెరైక్టర్ ఆధ్వర్యంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో చర్చించి, తీసుకున్న నిర్ణయాలు యుద్ధప్రాతిపాదికన అమలు చేయాలి. కానీ అభివృద్ధి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుకాకపోవడంతో అభివృద్ధి పడకేసింది. దీంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలున్నాయి. అభివృద్ధికి ఆటంకం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం చివరిసా రి 2012 మే 22న జరిగింది. అప్పటి నుంచి ఏడాదిన్నర కాలంగా సమావేశం నిర్వహించకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. దీంతో ఆస్పత్రి అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొం టున్న సమస్యలు, అవసరమైన పరికరాలు, మందులు కొనుగోళ్లు, అభివృద్ధి నిధుల ఖర్చు ల వివరాలపై చర్చించి పలు తీర్మానించడానికి ఏర్పాటు చేయాల్సిన సమావేశం ఊసేలేకపోవడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఆయా విభాగాల అధికారులకు కమిటీ సభ్యులు తెలియజేస్తారు. సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా తీర్మానాలు చేసి వదిలేస్తున్నారే తప్పా వాటిపై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కమిటీలో ఎవరెవరు.. రిమ్స్ ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, లోక్‌సభ, శాసనసభ సభ్యులు, రిమ్స్ డెరైక్టర్, డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్, పురపాలక సంఘం కమిషనర్, ఇద్దరు సీని యర్ వైద్య నిపుణులు, ఐఎంఏ అధ్యక్షుడు, ఒక ఎన్జీవో, ఒక డ్వాక్రా మహిళ సభ్యులుగా రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి సంఘంలో ఉంటారు. ఈ సంఘానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇంత మంది జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్న సంఘం లో వారు తీసుకున్న నిర్ణయాలు అమలుకాకపోవడం శోచనీయం. సమావేశానికి మాత్రమే జిల్లా ప్రజాప్రతినిధులు రిమ్స్‌లో కనిపిస్తారు. అంతేగాని రిమ్స్‌లో రోగులకు వైద్య సేవలు అందుతున్నాయ? వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా? సరైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయా? ఆస్ప త్రి అభివృద్ధి నిధులు దేనికి ఖర్చు చేస్తున్నార న్న విషయాలపై ప్రజాప్రతినిధులు ఆరా తీసి న దాఖలాలు లేవు. ప్రస్తుత కలెక్టర్ రిమ్స్‌పై దృష్టి సారించడంతో ఆస్పత్రి అభివృద్ధి జరుగుతుందని అందరు ఆశగా చూ స్తున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీపై కూడా కలెక్టర్ పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు. అమలుకు నోచుకోని తీర్మానాలు.. గతంలో నిర్వహించిన సమావేశాల్లో ఆస్పత్రిలో చేరే రోగులకు సకాలంలో చికిత్సలు అందించడానికి వీలుగా 20మంది క్యాజువా లిటీ మెడికల్ ఆఫీసర్స్(సీఎంవో) నియమించాలని నిర్ణయించారు. వీరిని ఒప్పంద ప్రాతిపాదికన నియమిస్తామని అప్పటి డెరైక్టర్ పేర్కొన్నారు. అది అమలు కాలేదు. దీంతో క్యాజువాలిటీలో తగినంత మంది వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రిమ్స్‌కు వచ్చే రోగులకు సరిపడా పడకల ను ఉంచాలంటూ ఆస్పత్రి అభివృద్ధి సం ఘం తీర్మానించినా పరిస్థితిలో మార్పు రా లేదు. ఆస్పత్రిలో మరో 200 పడకలు అవసరమున్నాయి. సరిపడ పడకలు లేకపోవడంతో రోగులు బల్లపైనే పడుకొని చికిత్స పొందే పరిస్థితి ఏర్పడింది. వార్డుల్లో ఒక్కో పడకపై ఇద్దేరేసి రోగులను చూడవచ్చు. 2012 జనవరి 27న నిర్వహించిన సమావేశంలో ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ ఏర్పా టు చేయాలని కమిటీ తీర్మానించినా అమలుకాలేదు. సెంట్రల్ ఆక్సిజన్ లేకపోవడంతో రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2012 మే 22న నిర్వహించిన సమావేశంలో రిమ్స్‌లో మూడు బోరుబావులు, ఒక చేతి పంపు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అదేకాకుండా రిమ్స్‌కు మున్సిపాలిటీ పైప్ లైన్ ద్వారా రూ.9.50 లక్షలతో మున్సిపాలిటీ వాటర్ సరఫరా కనెక్షన్ పెట్టించాలని కమిషనర్‌కు అప్పటి కలెక్టర్ తెలిపారు. దీనికి అవసరమైన ఆ నిధులను రిమ్స్ డెరైక్టర్ సమకూర్చాలని తీర్మానించారు. ఈ నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. రిమ్స్‌లో క్యాంటీన్, బేకరీలు టెండర్ ద్వారా నిర్వహించి రోగులకు నాణ్యమైన ఆహార పదర్థాలు అందించాలని నిర్ణయించారు. అది కూడా జరగడం లేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.