సచివాలయంలో స్పందన పనితీరును కర్ణాటక అధికారులకు వివరిస్తున్న ఏపీ అధికారులు
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా అమితంగా ఆకర్షించింది. ‘స్పందన’ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పందన కార్యక్రమం పనితీరును పరిశీలించడానికి కర్నాటక అధికారుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించింది. సచివాలయంలోని స్పందన మానిటరింగ్ యూనిట్‌ను వారు సందర్శించారు.
ఈ సందర్భంగా స్పందన కార్యక్రమం ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నారన్న విషయాలను సీఎం కార్యాలయంలోని ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ, ఆర్‌టీజీఎస్ సీఈవో విద్యాసాగర్‌లు వారికి వివరించారు. స్పందన కార్యక్రమం సీఎం జగన్ మానసపుత్రిక అని.. ఆ పేరును ఆయనే సూచించారని చెప్పారు. అంతేకాకుండా దాని పనితీరును ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.
ప్రజల సమస్యలను ఒక విజ్ఞప్తిగా చూడకుండా.. ఒక ఆదేశంగా భావించాలని చెప్పడమే కాకుండా, ఇందుకు అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేసి.. ఇప్పుడు గ్రామ సచివాలయాల వరకు తీసుకువెళ్లారని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మెచ్చుకున్న కర్ణాటక ప్రభుత్వాధికారులు.. గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా సందర్శించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. కర్ణాటక అధికారుల బృందంలో ఆ రాష్ట్ర సీఎం ఆఫీస్‌కు సంబంధించి ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలు పర్యవేక్షించే ప్రాజెక్టు డైరెక్టర్ జి.రషి్మ, ఈ–గవర్నెన్స్ ప్రోగ్రాం మేనేజర్ కేఎస్ రఘునాథ్, అధికారులు రాజేశ్, భారతి, ప్రైస్ వాటర్ కూపర్స్‌కు చెందిన సౌరభ్, సౌరభ్ భట్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment