క్రాప్ హాలిడే తప్పదా..?
- తుంగభ్రద డ్యామ్‌లో ఆశించిన స్థాయిలో లేనినీరు
- హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటసాగు ప్రశ్నార్థకం
- రైతులను జాగృత పరిచే దిశగా అధికారుల అడుగులు
కణేకల్లు : హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర డ్యామ్‌లో నీటి పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆయకట్టుకు సాగునీరివ్వకూడదనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. దామాషా ప్రకారం హెచ్చెల్సీకి వచ్చే నీరు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించారు. డ్యామ్‌లో ఇప్పుడున్న నీటి పరిస్థితి దృష్ట్యా వరి కాదు కదా... ఆరుతడి పంటలకు కూడా నీరిచ్చే పరిస్థితిలో లేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. చూస్తుంటే హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది క్రాప్ హాలిడే తప్పదా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
36 వేల ఆయకట్టు
హెచ్చెల్సీ కింద కణేకల్లు, బొమ్మనహళ్, విడపనకల్లు మండలాల్లో 15 డిస్ట్రిబ్యూటరీలు, కణేకల్లు చెరువు కింద మొత్తం 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది తుంగభద్ర డ్యామ్ పరివాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా డ్యామ్‌లో నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. దీంతో దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 10.50 టీఎంసీల నీరు కేటాయించారు. ఈ నీళ్లు కూడా తాగునీటికే సరిపోయాయి. ఎప్పటిలాగే రైతులు ముందుగా వరినారు పోసుకొని నాట్లకు సిద్ధంగా ఉండటంతో సాగునీరివ్వకపోతే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో అడపదడప సాగునీరిచ్చి రైతులను గట్టెక్కించారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు సైతం సక్రమంగా ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
సాగునీరు డౌటే..
ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో 40.955 టీఎంసీలతో 1612.83 అడుగుల నీరు నిల్వ ఉంది. టీబీ డ్యామ్‌కు ఇప్పుడున్న ఇన్‌ఫ్లో... నీటి నిల్వ, తగ్గుతున్న ఇన్‌ఫ్లో ఈ లెక్క ఆధారంగా టీబీ డ్యామ్‌లో నీటిమట్టం పెరిగే అవకాశం లేదని బోర్డు అధికారులు తేల్చి చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హెచ్చెల్సీకి 10 టీఎంసీలకు మించి నీరొచ్చే అవకాశం లేదు. ఈ నీళ్లను తాగునీటితో పాటు సాగుకు సర్దుబాటు చేయడం కుదరదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ క్రమంలో డ్యామ్ పరిస్థితి గురించి ఏమాత్రం లెక్క చేయకుండా వరినారు పోసుకొని పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులను జాగృతి చేయాలని హెచ్చెల్సీ అధికారులు నిర్ణయించారు.
ఇన్‌ఫ్లో పెరిగితే చూద్దాం
ఆయకట్టుకు ఒక్కసారిగా సాగునీరివ్వలేమని చెబితే రైతులు ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశముండటంతో తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే సాగుకు నీరిచ్చే విషయం ఆలోచిస్తామని చెప్పి ఆయకట్టు రైతులను నచ్చ చెప్పాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఇన్‌ఫ్లో ఆశించినంత లేదు కాబట్టి... ఇప్పడు సాగుకు నీరివ్వలేం. భవిష్యత్తులో ఇన్‌ఫ్లో పెరిగి నీటి లభ్యత పెరిగితే ఏ ఇబ్బంది లేకుండా నీరిస్తామని చెప్పాలని నిర్ణయించారు.
నేడు సాగునీటి సంఘాల అధ్యక్షులతో భేటీ
కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సాగునీటి సంఘాల అధ్యక్షులతో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు కబురు పెట్టినట్లు కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న తెలిపారు. టీబీ డ్యామ్‌లో నీటి పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో హెచ్చెల్సీ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.