water down
-
పాతాళంలో జలం..అయినా పంటలు పుష్కలం..!
సాక్షి, అమరావతి బ్యూరో: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతే ఆ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతుంది. కానీ.. అందుకు భిన్నంగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం మాత్రం పచ్చని పంటలతో కళకళలాడుతోంది. అలాగని ఆ మండలంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. కేవలం వర్షాలు బోరు బావులు మాత్రమే అక్కడి రైతులకు ఆధారం. ఆ మండలంలో 1990 వరకు భూగర్భ జలాలు అందుబాటులోనే ఉండేవి. ఆ తర్వాత బోర్లు వేయడంతో నీటి వినియోగం బాగా పెరిగింది.. 1999లో 21.67 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2019 నాటికి 110 మీటర్లు, కొన్నిచోట్ల 150 మీటర్ల లోతుకు కూడా వెళ్లిపోయాయి. భూగర్భ జలాల రాష్ట్ర సగటు 12.82 మీటర్లు కాగా.. రాష్ట్ర సగటు కంటే 8 నుంచి 12 రెట్లు దిగువకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ మండలంలో 5,352 బోర్లున్నాయి. వీటిలో చాలా బోర్లు వెయ్యి అడుగుల లోతుకు తవ్వారు. ఒకప్పుడు గరిష్టంగా 5 హార్స్పవర్ (హెచ్‌పీ) మోటార్లను వాడేవారు. ఇప్పుడుగా 15, 20 హెచ్‌పీ మోటార్లను వాడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో ఒక్క కొర్లకుంట మినహా మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వాల్టా చట్టం అమలు చేస్తూ అధికారులు కొత్త బోర్ల ఏర్పాటుపై నియంత్రణ విధించారు. ప్రస్తుతం ఉన్న బోర్లు మరింత లోతుకు తవ్వకుండా ఆంక్షలు పెట్టారు. ఈ మండలాన్ని డార్క్ ఏరియాగా ప్రకటించారు. అక్కడ ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. 60 రకాల పంటలతో.. ఈ మండలంలో 13,351 హెక్టార్లలో 60 రకాల పంటలు సాగవుతున్నాయి. బోర్లు వేయకముందు ఇక్కడ పది రకాల పంటలే పండించేవారు. ఏటా రెండు, మూడు పంటలు వేసి గణనీయమైన, నాణ్యమైన దిగుబడులనూ సాధిస్తున్నారు. వీటిలో మొక్కజొన్న, ఆయిల్‌పామ్, వరి, మామిడి, అరటి, పొగాకు, మిర్చి, కొబ్బరి, పత్తి, నిమ్మ, జామ, కూరగాయలు, చెరకు, వేరుశనగ, బొప్పాయి, మినుములు, పెసలు, జీడిమామిడి, బీర, ఉలవలు, టమాటా, కేప్సికం, సుబాబుల్, జొన్న, కంది, బీన్స్, పసుపు, మల్లె, చామంతి, రేగు, ములక్కాడ, పొద్దు తిరుగుడు, కాకర వంటివి ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా నీరు అధికంగా అవసరమయ్యే ఆయిల్‌పామ్ 2,345 హెక్టార్లలోను, వరి 2,200 హెక్టార్లలోను సాగవుతున్నాయి. నేల గొప్పదనమే ఇది ముసునూరులో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నా నీటి లభ్యతతో పాటు పంటలు పండడానికి అక్కడ ఎర్ర ఇసుక నేలలే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేల కింద ఇసుక రాతి పొరలున్నాయి. ఇవి ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల భూమిలో లోతుకు వెళ్లినా సమృద్ధిగా నీళ్లు లభిస్తున్నాయి. జలశక్తి అభియాన్‌లో ఎంపిక.. కేంద్ర జలశక్తి అభియాన్ పథకంలో ముసునూరు మండలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి దోహదపడే నీటి పొదుపు చర్యలు పాటించడం, పొలంలో ఫారం పాండ్స్ ఏర్పాటు, నీటి వినియోగం తక్కువయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం వంటివి సిఫార్సు చేస్తూ అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు క్రమంగా డ్రిప్ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపుతుండటంతో సుమారు 7వేల హెక్టార్లలో నీటిని పొదుపు చేస్తున్నారు. మండలంలోని ముసునూరు, సూర్యపల్లి, వేల్పుచర్లల్లో పిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలాల స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం.. చింతలపూడి పథకం ద్వారా గోదావరి జలాలను సాగర్ ఎడమ కాలువలోకి మళ్లించి.. తమ్మిలేరు వాగు పరీవాహక ప్రాంతంలోని లోపూడి, గుళ్లపూడి, గుడిపాడు, వలసపల్లి, ఎల్లాపురం గ్రామాలకు కలిపితే చెరువులు నిండి భూగర్భ జలాల వృద్ధికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్ పుణ్యం కట్టుకోవడం వల్ల చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. – రేగుల గోపాలకృష్ణ, అధ్యక్షుడు, ముసునూరు పీఏసీఎస్ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం భూగర్భ జలాల పెంపుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ ఆవశ్యకతను వివరిస్తున్నాం. రెండు వేల మంది రైతులకు శాస్త్రవేత్తలతో కలిసి కిసాన్ మేళా నిర్వహించాం. ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు వస్తున్నాయి. – బి.శివశంకర్, మండల వ్యవసాయాధికారి, ముసునూరు 30 ఏళ్ల క్రితం 25 అడుగుల్లోనే నీరు 30 ఏళ్ల క్రితం మా ప్రాంతంలో 25 అడుగుల్లోనే నీరుండేది. అప్పట్లో బోర్లు వేయడానికి 100 అడుగులు తవ్వితే సరిపోయేది. ఇప్పుడు 600 అడుగుల తోతుకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల 15–20 హెచ్‌పీ మోటార్లు బిగించి నీరు తోడుతున్నారు. చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. – ఎం.సుబ్బారావు, రైతు, గుడిపాడు, ముసునూరు మండలం -
తగ్గిన తుంగభద్ర ప్రవాహం
కోసిగి(కర్నూలు): తుంగభద్ర నదీ మూడు రోజులుగా తగుముఖం పట్టింది. జూలై 18న కర్ణాటక హోస్పేట్ డ్యామ్ నుంచి నదికి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కోసిగి మండలం అగసనూరు గ్రామ సమీపంలో తుంగభద్ర నదీ ఒడ్డున నిర్మించిన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టపై రెండు అడుగులు ఎత్తు వరకు నీటి ప్రవాహం ఉంది. శుక్రవారం ప్రవాహం ఆనకట్ట లెవల్ వరకు తగ్గిపోయింది. కర్నూలు వైపు కేవలం ఒక స్లూయిస్ నుంచి మాత్రమే దిగువకు ప్రవహిస్తున్నాయి. నీళ్లు తగ్గడంతో నదితీర ప్రాంత రైతులు ఆందోళనకు గురువుతున్నారు. సాగుకు నోచుకోని పంట పొలాలు : కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలతో తుంగభద్ర నదికి నీళ్లు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పదిహేను రోజులు గడవక ముందే నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నేటికి నదతీర పంట పోలాలు సాగుకు నోచుకోలేదు. వరినార ఏర్పాటుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అంతలోనే నదీ ప్రవాహం తగ్గడంతో సాగుచేకున్న తర్వాత నదికి నీళ్లు వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిండని ఎత్తిపోతల పథకాలు: ఎల్లెల్సీ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించే దిశగా నదితీరంలో నిర్మించిన ఎత్తి పోతల పథకాలు నిండని కుండలుగా మారిపోయాయి. కోసిగి మండలంలోని దుద్ది ఎత్తి పోతల పథకం కింద 3200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎత్తిపోతల పథకం వద్ద రెండు మిషన్లు పనిచేయడం లేదు. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఒక మిషన్‌తో పంపింగ్ చేశారు. మూడు మిషన్లు మరమ్మత్తులకు గురైనా విషయం తెలిసినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే మూగలదొడ్డి ఎత్తిపోతల పథకం, పులికనుమ రిజర్వాయర్ కూడా నిండేది కష్టమే. ఎల్లెల్సీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. -
క్రాప్ హాలిడే తప్పదా..?
- తుంగభ్రద డ్యామ్‌లో ఆశించిన స్థాయిలో లేనినీరు - హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటసాగు ప్రశ్నార్థకం - రైతులను జాగృత పరిచే దిశగా అధికారుల అడుగులు కణేకల్లు : హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. తుంగభద్ర డ్యామ్‌లో నీటి పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆయకట్టుకు సాగునీరివ్వకూడదనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. దామాషా ప్రకారం హెచ్చెల్సీకి వచ్చే నీరు తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించారు. డ్యామ్‌లో ఇప్పుడున్న నీటి పరిస్థితి దృష్ట్యా వరి కాదు కదా... ఆరుతడి పంటలకు కూడా నీరిచ్చే పరిస్థితిలో లేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. చూస్తుంటే హెచ్చెల్సీ ఆయకట్టు కింద ఈ ఏడాది క్రాప్ హాలిడే తప్పదా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. 36 వేల ఆయకట్టు హెచ్చెల్సీ కింద కణేకల్లు, బొమ్మనహళ్, విడపనకల్లు మండలాల్లో 15 డిస్ట్రిబ్యూటరీలు, కణేకల్లు చెరువు కింద మొత్తం 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది తుంగభద్ర డ్యామ్ పరివాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా డ్యామ్‌లో నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. దీంతో దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 10.50 టీఎంసీల నీరు కేటాయించారు. ఈ నీళ్లు కూడా తాగునీటికే సరిపోయాయి. ఎప్పటిలాగే రైతులు ముందుగా వరినారు పోసుకొని నాట్లకు సిద్ధంగా ఉండటంతో సాగునీరివ్వకపోతే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో అడపదడప సాగునీరిచ్చి రైతులను గట్టెక్కించారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు సైతం సక్రమంగా ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. సాగునీరు డౌటే.. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో 40.955 టీఎంసీలతో 1612.83 అడుగుల నీరు నిల్వ ఉంది. టీబీ డ్యామ్‌కు ఇప్పుడున్న ఇన్‌ఫ్లో... నీటి నిల్వ, తగ్గుతున్న ఇన్‌ఫ్లో ఈ లెక్క ఆధారంగా టీబీ డ్యామ్‌లో నీటిమట్టం పెరిగే అవకాశం లేదని బోర్డు అధికారులు తేల్చి చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హెచ్చెల్సీకి 10 టీఎంసీలకు మించి నీరొచ్చే అవకాశం లేదు. ఈ నీళ్లను తాగునీటితో పాటు సాగుకు సర్దుబాటు చేయడం కుదరదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ క్రమంలో డ్యామ్ పరిస్థితి గురించి ఏమాత్రం లెక్క చేయకుండా వరినారు పోసుకొని పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులను జాగృతి చేయాలని హెచ్చెల్సీ అధికారులు నిర్ణయించారు. ఇన్‌ఫ్లో పెరిగితే చూద్దాం ఆయకట్టుకు ఒక్కసారిగా సాగునీరివ్వలేమని చెబితే రైతులు ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశముండటంతో తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగితే సాగుకు నీరిచ్చే విషయం ఆలోచిస్తామని చెప్పి ఆయకట్టు రైతులను నచ్చ చెప్పాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఇన్‌ఫ్లో ఆశించినంత లేదు కాబట్టి... ఇప్పడు సాగుకు నీరివ్వలేం. భవిష్యత్తులో ఇన్‌ఫ్లో పెరిగి నీటి లభ్యత పెరిగితే ఏ ఇబ్బంది లేకుండా నీరిస్తామని చెప్పాలని నిర్ణయించారు. నేడు సాగునీటి సంఘాల అధ్యక్షులతో భేటీ కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సాగునీటి సంఘాల అధ్యక్షులతో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు కబురు పెట్టినట్లు కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న తెలిపారు. టీబీ డ్యామ్‌లో నీటి పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో హెచ్చెల్సీ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.