సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 30 నుంచి 50 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక ప్రతిపాదించిన నవలి రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించే ప్రశ్నేలేదని ఏపీ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు మరోసారి తేల్చిచెప్పింది. హెచ్చెల్సీ (ఎగువ కాలువ)కి సమాంతరంగా రోజుకు 2 టీఎంసీలు తరలించేలా కాలువ తవ్వి.. వరద రోజుల్లో నీటిని తరలిస్తే.. తుంగభద్ర డ్యామ్‌లో నిల్వచేసిన నీటితో మిగతా ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని సూచించింది.
సమాంతర కాలువతో ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణకూ ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీంతో.. సమాంతర కాలువ, నవలి రిజర్వాయర్‌పై సమగ్ర అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుందామని తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే చెప్పారు. ఈయన అధ్యక్షతన గురువారం తుంగభద్ర బోర్డు సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఏపీ తరఫున ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున ఈఎన్‌సీ మురళీధర్, కర్ణాటక తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి కృష్ణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నవలితో ప్రయోజనాలకు విఘాతం
తుంగభద్ర డ్యామ్‌లో పూడిక పేరుకుపోయిన నేపథ్యంలో నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు తగ్గిందని.. దాంతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీలను వాడుకోలేకపోతున్నామని కర్ణాటక అధికారులు చెప్పారు. నీటినిల్వ సామర్థ్యం తగ్గిన మేరకు నవలి వద్ద కొత్త రిజర్వాయర్‌ను నిర్మించి.. నిల్వ చేద్దామని.. దీనివల్ల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చునని ప్రతిపాదించారు.
ఈ రిజర్వాయర్ నిర్మాణానికయ్యే రూ.పది వేల కోట్ల వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా మూడు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలని కోరారు. దీనిపై ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నవలి రిజర్వాయర్‌వల్ల తమ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. నవలికి బదులుగా హెచ్చెల్సీకి సమాంతర కాలువ తవ్వడానికి అనుమతివ్వాలని నారాయణరెడ్డి కోరారు.
డిస్ట్రిబ్యూటరీల ద్వారానే తాగునీరు
హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ప్రధాన కాలువలపై తాగునీటి పథకాలను ఏర్పాటుచేయడానికి అనుమతివ్వాలని కర్ణాటక అధికారులు చేసిన ప్రతిపాదనపై ఏపీ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందన్నారు. డిస్ట్రిబ్యూటరీలపై తాగునీటి పథకాలు ఏర్పాటుచేసుకుని.. వాడుకున్న నీటిని కర్ణాటక కోటాలో కలపాలని సూచించారు.
ఇందుకు తుంగభద్ర బోర్డు చైర్మన్ డీఎం రాయ్‌పురే సానుకూలంగా స్పందించారు. మరోవైపు.. తుంగభద్ర బోర్డు నిర్వహణ వ్యయాన్ని భరించకుండా.. సిబ్బందిని సమకూర్చని తెలంగాణకు బోర్డులో ఎలా సభ్యత్వం ఇస్తారని నారాయణరెడ్డి బోర్డు చైర్మన్‌ను నిలదీశారు. నిర్వహణ వ్యయం, సిబ్బందిని సమకూర్చడంపై తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలంగాణ ఈఎన్‌సీ చెప్పారు.
ఇక హోస్పేట్ పరిసరాల్లో బోర్డుకు చెందిన 70 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని కర్ణాటక అధికారులు కోరడంపై ఏపీ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తంచేశారు. బోర్డు భూములు మూడు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులని.. వాటిని కర్ణాటకకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై బోర్డు చైర్మన్ రాయ్‌పురే స్పందిస్తూ.. ఉమ్మడి ఆస్తులను ఏ రాష్ట్రానికీ ఇచ్చే ప్రశ్నేలేదని స్పష్టంచేశారు.
సమాంతర కాలువతోనే ప్రయోజనం
Published Fri, May 27 2022 5:01 AM | Last Updated on Fri, May 27 2022 8:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment