ఆశలు గల్లంతు | water not give after august | Sakshi
Sakshi News home page

ఆశలు గల్లంతు

Published Sun, Aug 13 2017 10:54 PM | Last Updated on Thu, Mar 28 2019 6:14 PM

ఆశలు గల్లంతు - Sakshi

ఆశలు గల్లంతు

– ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు
– బీళ్లుగా మారనున్న లక్షలాది ఎకరాల ఆయకట్టు
– తాగునీటి పథకాలకూ పొంచి ఉన్న ప్రమాదం
– వందలాది గ్రామాలకు తప్పని దాహార్తి


హెచ్చెల్సీ ఆయకట్టు : 2.84 లక్షల ఎకరాలు
ఆధారపడిన గ్రామాలు : 2,068
ఆధారపడిన జిల్లాలు : అనంతపురం, వైఎస్సార్‌జిల్లా, కర్నూలు
జిల్లాలో రిజర్వాయర్లలో ఉన్న నీళ్లు: పీఏబీఆర్‌లో– 1.45 టీఎంసీలు
                        మిడ్‌పెన్నార్‌లో– 0.173 టీఎంసీ
                        చిత్రావతిలో – 0.172
రిజర్వాయర్లపై ఆధారపడి తాగునీటి పథకాలు : సత్యసాయి తాగునీటి పథకాలు, మరో ఆరు ప్రభుత్వ పథకాలు


తుంగభద్ర జలాశయంపై అనంత వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని ఆదివారం బెంగుళూరులో తుంగభద్ర బోర్డు నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశంలో నిర్ణయించారు. దీంతో అనంతకు సాగు, తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చనున్నాయి.
- అనంతపురం సెంట్రల్‌:

తుంగభద్ర జలాశయంపై జిల్లాలో లక్షలాది ఎకరాల ఆయకట్టు, వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా ఆధారపడి ఉంది. ఇప్పటికే హై లెవల్‌ మెయిన్‌ కెనాల్‌(హెచ్‌ఎల్‌ఎంసీ) కింద దాదాపు 40 వేల ఎకరాలకు సరిపడ వరినార్లు పోసుకుని రైతులు సిద్ధ౾ంగా ఉన్నారు. అయితే ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు నీటిపారుదల సలహా సమితి ప్రకటించడంతో ప్రస్తుతం నార్లు పోసుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సాగునీరు లేక రెండేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులు ఈసారైనా పంటలు సాగు చేసుకుందామని ఎంతో ఆశతో ఉన్నారు. ఈ మేరకు వేలాది ఎకరాలు దుక్కులు చేసుకుని సాగు సిద్ధం ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో తుంగభద్రకు నీళ్లు రావడం లేదని నీటి విడుదలను బోర్డు అధికారులు వాయిదా వేశారు. దీంతో వందలాది మంది రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి.

ఒట్టిపోనున్న తాగునీటి పథకాలు
జిల్లాలో 70 నుంచి 80శాతం గ్రామాలకు పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లపై ఏర్పాటు చేసిన తాగునీటి పథకాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. పీఏబీఆర్‌లో మరో 20 రోజుల వరకూ నీటి కొరత ఏర్పడకపోయినా... చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో మాత్రం మరో వారం రోజులకు సరిపడా కూడా నీళ్లు లేవు. ఈ రిజర్వాయర్‌ ద్వారా ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి తాగునీటి పథకాలు ఉన్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో పులివెందుల మున్సిపాలిటీకి, యురేనియం ఫ్యాక్టరీకి ఇక్కడి నుంచి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. అయితే వారం రోజుల తర్వాత రిజర్వాయర్‌లో చుక్క  నీరు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మన జిల్లాలోనే వేలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది.

అధికారపార్టీ నేతల విఫలం
జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నంద్యాల ఉప ఎన్నికపై చూపుతున్న శ్రద్ధ జిల్లా రైతాంగం సంక్షేమంపై చూపడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జిల్లా వాసులంతా వర్షాకాలంలోనూ తాగునీటి తిప్పలు పడుతున్నా వారికి పట్టడం లేదు. కనీసం  తుంగభద్ర జలాశయం నుంచి తాగేందుకైనా నీళ్లు తెప్పిద్దామనే ధ్యాస ఎవరిలోనూ కనిపించడం లేదు. ముఖ్యంగా మంత్రి కాలవ శ్రీనివాసులు నియోజకవర్గంలో రైతులు ఆపారంగా నష్టపోతున్నా... ఆయన పట్టించుకునే స్థితిలో లేరు. ఆదివారం తుంగభద్రబోర్డు సమావేశం జరుగుతుందని తెలిసినా... ఎవరూ ఆ సమావేశం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఫలితంగా జలాశయంలో 48.433 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నా... తాగేందుకు కూడా విడుదల చేయకుండా వాయిదా వేశారు. దీని వల్ల అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కానుంది. పరిస్థితి జఠిలంగా ఉన్నా... బోర్డు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితిలో అధికారపార్టీ నాయకులు లేకపోవడం బాధాకరం.

ఇబ్బందులు తప్పవు
ఆగస్టు నెలాఖరు వరకూ హెచ్చెల్సీకి నీళ్లు విడుదల చేయకపోతే జిల్లా వాసులందరికీ ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చనుంది. పీఏబీఆర్‌లో సరిపడ నీళ్లున్నా... చిత్రావతిలో మాత్రం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది.  ఈ నేపథ్యంలో తాగునీటి పథకాలు నిలుపుదల చేసే ప్రమాదం ఉంది. అలాగే కర్ణాటకలోని ఆయకట్టుకు ముందుగా వదులకుంటే శాంతిభద్రతల సమస్య కూడా ఏర్పడే ప్రమాదముంది. ఎక్కువశాతం నీళ్లు వారే తీసుకుంటారు. అక్కడి రైతులను కట్టడి చేసే పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోతా. ఈనెల 22న ఐఏబీ సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం.
- టి.వి శేషగిరిరావు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్, హెచ్చెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement