water not give
-
ఆయకట్టుకు నీరివ్వం
హెచ్చెల్సీ పరిధిలో పంట సాగు వద్దు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరమణరెడ్డి కణేకల్లు: హెచ్చెల్సీ ఆయకట్టు కింద వరి లేదా ఆరుతడి పంటలేవి సాగు చేయరాదంటూ రైతులకు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వెంకటరమణరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో నీటి నిల్వలు నిరాశజనకంగా ఉన్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన డిస్ట్రిబ్యూటరీ సంఘం అధ్యక్షులు కేశవరెడ్డి అధ్యక్షతన సాగునీటి సంఘం అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నాటికి టీబీ డ్యామ్‌లో 1618.62 అడుగుల నీటిమట్టంతో 54.57టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఈ లెక్క ప్రకారం హెచ్చెల్సీకి 8.11 టీఎంసీల నీరు మాత్రమే వస్తాయని వివరించారు. జిల్లాలో తాగునీటి అవసరాలకు 10.50టీఎంసీల నీరు కాగా, తాజా లెక్కల ప్రకారం తాగునీటికి 2.40టీఎంసీల నీరు తక్కువ పడుతున్నాయని తెలిపారు. కర్ణాటక ప్రాంతం వారు నీటిని విడుదల చేసుకునే సమయంలోనే జిల్లాకు నీటిని సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. వచ్చే నెలలో హెచ్చెల్సీకి నీరు విడుదల చేసే అవకాశముందన్నారు. తాగునీటి కోసం విడుదల చేసే ఈ నీళ్లను అక్రమంగా జలచౌర్యం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. టీబీ డ్యామ్ పరిస్థితిని రైతులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు ఈఈ విజ్ఞప్తి చేశారు. ఆనయకట్టుదారులు చోరీ చేస్తే.. హెచ్చెల్సీ పొడువునా ఆనయకట్టు రైతులు పైప్‌లు, మోటార్ల ద్వారా జలచౌర్యం చేస్తే తామేమీ చేయలేమంటూ సాగునీటి సంఘాల అధ్యక్షులు కాంతారావు, రుద్రేగౌడ్, మాబుసాబ్ పేర్కొన్నారు. స్పెషల్ టీమ్, పోలీసు బందోబస్తు పెట్టి జలచౌర్యం కాకుండా అధికారులే చూసుకోవాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతానని ఈఈ అన్నారు. ఆరుతరి పంటలకైనా... హెచ్ఎల్సీ ఆయకట్టు కింద ఆరుతరి పంటల సాగుకైనా నీరివ్వాలని బెణికల్లు సాగునీటి సంఘం టీసీ సభ్యుడు రంగారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు మాబుసాబ్ తదితరులు విజ్ఞప్తి చేశారు. టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగి నీటి నిల్వ 70టీఎంసీలకు చేరితే ఆలోచిస్తామని, ప్రస్తుతమైతే చుక్కనీరు కూడా ఇవ్వలేమని పంటలు సాగు చేసి నష్టపోవద్దని ఈఈ స్పష్టం చేశారు. పరిహారమైనా ఇవ్వండి హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీరివ్వకుండా క్రాప్‌హాలిడే అమలు చేస్తే రైతులు బతకేదెలా అంటూ సాగునీటి సంఘం అధ్యక్షులు ఈఈ కె.వెంకటరమణరెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని పంటలు లేకపోతే కుటుంబాలను ఎలా పోషించుకుంటారని అసహనం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఆయకట్టు రైతులకు పరిహారమిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశం తన పరిధిలోకి రాదని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతానని ఈఈ అన్నారు. కార్యక్రమంలో కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న, జేఈలు దివాకర్‌రెడ్డి, నరేంద్రమారుతి, రంజిత్‌కుమార్, డిస్ట్రిబ్యూటరీ సంఘం ఉపాధ్యక్షులు చంద్రశేఖర్గుప్తాతోపాటు కణేకల్లు, బొమ్మనహళ్, విడపనకల్లు మండలాల సాగునీటి సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఆశలు గల్లంతు
– ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు – బీళ్లుగా మారనున్న లక్షలాది ఎకరాల ఆయకట్టు – తాగునీటి పథకాలకూ పొంచి ఉన్న ప్రమాదం – వందలాది గ్రామాలకు తప్పని దాహార్తి హెచ్చెల్సీ ఆయకట్టు : 2.84 లక్షల ఎకరాలు ఆధారపడిన గ్రామాలు : 2,068 ఆధారపడిన జిల్లాలు : అనంతపురం, వైఎస్సార్‌జిల్లా, కర్నూలు జిల్లాలో రిజర్వాయర్లలో ఉన్న నీళ్లు: పీఏబీఆర్‌లో– 1.45 టీఎంసీలు మిడ్‌పెన్నార్‌లో– 0.173 టీఎంసీ చిత్రావతిలో – 0.172 రిజర్వాయర్లపై ఆధారపడి తాగునీటి పథకాలు : సత్యసాయి తాగునీటి పథకాలు, మరో ఆరు ప్రభుత్వ పథకాలు తుంగభద్ర జలాశయంపై అనంత వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని ఆదివారం బెంగుళూరులో తుంగభద్ర బోర్డు నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశంలో నిర్ణయించారు. దీంతో అనంతకు సాగు, తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చనున్నాయి. - అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయంపై జిల్లాలో లక్షలాది ఎకరాల ఆయకట్టు, వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా ఆధారపడి ఉంది. ఇప్పటికే హై లెవల్ మెయిన్ కెనాల్(హెచ్‌ఎల్‌ఎంసీ) కింద దాదాపు 40 వేల ఎకరాలకు సరిపడ వరినార్లు పోసుకుని రైతులు సిద్ధ౾ంగా ఉన్నారు. అయితే ఆగస్టు తర్వాతే హెచ్చెల్సీకి నీళ్లు విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు నీటిపారుదల సలహా సమితి ప్రకటించడంతో ప్రస్తుతం నార్లు పోసుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సాగునీరు లేక రెండేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులు ఈసారైనా పంటలు సాగు చేసుకుందామని ఎంతో ఆశతో ఉన్నారు. ఈ మేరకు వేలాది ఎకరాలు దుక్కులు చేసుకుని సాగు సిద్ధం ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో తుంగభద్రకు నీళ్లు రావడం లేదని నీటి విడుదలను బోర్డు అధికారులు వాయిదా వేశారు. దీంతో వందలాది మంది రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి. ఒట్టిపోనున్న తాగునీటి పథకాలు జిల్లాలో 70 నుంచి 80శాతం గ్రామాలకు పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లపై ఏర్పాటు చేసిన తాగునీటి పథకాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. పీఏబీఆర్‌లో మరో 20 రోజుల వరకూ నీటి కొరత ఏర్పడకపోయినా... చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మాత్రం మరో వారం రోజులకు సరిపడా కూడా నీళ్లు లేవు. ఈ రిజర్వాయర్ ద్వారా ధర్మవరం, కదిరి మున్సిపాలిటీలతో పాటు సత్యసాయి తాగునీటి పథకాలు ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాలో పులివెందుల మున్సిపాలిటీకి, యురేనియం ఫ్యాక్టరీకి ఇక్కడి నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నారు. అయితే వారం రోజుల తర్వాత రిజర్వాయర్‌లో చుక్క నీరు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మన జిల్లాలోనే వేలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. అధికారపార్టీ నేతల విఫలం జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నంద్యాల ఉప ఎన్నికపై చూపుతున్న శ్రద్ధ జిల్లా రైతాంగం సంక్షేమంపై చూపడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జిల్లా వాసులంతా వర్షాకాలంలోనూ తాగునీటి తిప్పలు పడుతున్నా వారికి పట్టడం లేదు. కనీసం తుంగభద్ర జలాశయం నుంచి తాగేందుకైనా నీళ్లు తెప్పిద్దామనే ధ్యాస ఎవరిలోనూ కనిపించడం లేదు. ముఖ్యంగా మంత్రి కాలవ శ్రీనివాసులు నియోజకవర్గంలో రైతులు ఆపారంగా నష్టపోతున్నా... ఆయన పట్టించుకునే స్థితిలో లేరు. ఆదివారం తుంగభద్రబోర్డు సమావేశం జరుగుతుందని తెలిసినా... ఎవరూ ఆ సమావేశం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఫలితంగా జలాశయంలో 48.433 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నా... తాగేందుకు కూడా విడుదల చేయకుండా వాయిదా వేశారు. దీని వల్ల అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కానుంది. పరిస్థితి జఠిలంగా ఉన్నా... బోర్డు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితిలో అధికారపార్టీ నాయకులు లేకపోవడం బాధాకరం. ఇబ్బందులు తప్పవు ఆగస్టు నెలాఖరు వరకూ హెచ్చెల్సీకి నీళ్లు విడుదల చేయకపోతే జిల్లా వాసులందరికీ ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చనుంది. పీఏబీఆర్‌లో సరిపడ నీళ్లున్నా... చిత్రావతిలో మాత్రం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాగునీటి పథకాలు నిలుపుదల చేసే ప్రమాదం ఉంది. అలాగే కర్ణాటకలోని ఆయకట్టుకు ముందుగా వదులకుంటే శాంతిభద్రతల సమస్య కూడా ఏర్పడే ప్రమాదముంది. ఎక్కువశాతం నీళ్లు వారే తీసుకుంటారు. అక్కడి రైతులను కట్టడి చేసే పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోతా. ఈనెల 22న ఐఏబీ సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. - టి.వి శేషగిరిరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్, హెచ్చెల్సీ