హెచ్చెల్సీ పరిధిలో పంట సాగు వద్దు
నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరమణరెడ్డి
కణేకల్లు: హెచ్చెల్సీ ఆయకట్టు కింద వరి లేదా ఆరుతడి పంటలేవి సాగు చేయరాదంటూ రైతులకు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వెంకటరమణరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో నీటి నిల్వలు నిరాశజనకంగా ఉన్నాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన డిస్ట్రిబ్యూటరీ సంఘం అధ్యక్షులు కేశవరెడ్డి అధ్యక్షతన సాగునీటి సంఘం అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బుధవారం నాటికి టీబీ డ్యామ్‌లో 1618.62 అడుగుల నీటిమట్టంతో 54.57టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఈ లెక్క ప్రకారం హెచ్చెల్సీకి 8.11 టీఎంసీల నీరు మాత్రమే వస్తాయని వివరించారు. జిల్లాలో తాగునీటి అవసరాలకు 10.50టీఎంసీల నీరు కాగా, తాజా లెక్కల ప్రకారం తాగునీటికి 2.40టీఎంసీల నీరు తక్కువ పడుతున్నాయని తెలిపారు. కర్ణాటక ప్రాంతం వారు నీటిని విడుదల చేసుకునే సమయంలోనే జిల్లాకు నీటిని సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. వచ్చే నెలలో హెచ్చెల్సీకి నీరు విడుదల చేసే అవకాశముందన్నారు. తాగునీటి కోసం విడుదల చేసే ఈ నీళ్లను అక్రమంగా జలచౌర్యం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. టీబీ డ్యామ్ పరిస్థితిని రైతులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు ఈఈ విజ్ఞప్తి చేశారు.
ఆనయకట్టుదారులు చోరీ చేస్తే..
హెచ్చెల్సీ పొడువునా ఆనయకట్టు రైతులు పైప్‌లు, మోటార్ల ద్వారా జలచౌర్యం చేస్తే తామేమీ చేయలేమంటూ సాగునీటి సంఘాల అధ్యక్షులు కాంతారావు, రుద్రేగౌడ్, మాబుసాబ్ పేర్కొన్నారు. స్పెషల్ టీమ్, పోలీసు బందోబస్తు పెట్టి జలచౌర్యం కాకుండా అధికారులే చూసుకోవాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతానని ఈఈ అన్నారు.
ఆరుతరి పంటలకైనా...
హెచ్‌ఎల్‌సీ ఆయకట్టు కింద ఆరుతరి పంటల సాగుకైనా నీరివ్వాలని బెణికల్లు సాగునీటి సంఘం టీసీ సభ్యుడు రంగారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు మాబుసాబ్ తదితరులు విజ్ఞప్తి చేశారు. టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో పెరిగి నీటి నిల్వ 70టీఎంసీలకు చేరితే ఆలోచిస్తామని, ప్రస్తుతమైతే చుక్కనీరు కూడా ఇవ్వలేమని పంటలు సాగు చేసి నష్టపోవద్దని ఈఈ స్పష్టం చేశారు.
పరిహారమైనా ఇవ్వండి
హెచ్‌ఎల్‌సీ ఆయకట్టుకు నీరివ్వకుండా క్రాప్‌హాలిడే అమలు చేస్తే రైతులు బతకేదెలా అంటూ సాగునీటి సంఘం అధ్యక్షులు ఈఈ కె.వెంకటరమణరెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని పంటలు లేకపోతే కుటుంబాలను ఎలా పోషించుకుంటారని అసహనం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఆయకట్టు రైతులకు పరిహారమిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశం తన పరిధిలోకి రాదని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతానని ఈఈ అన్నారు. కార్యక్రమంలో కణేకల్లు హెచ్చెల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న, జేఈలు దివాకర్‌రెడ్డి, నరేంద్రమారుతి, రంజిత్‌కుమార్, డిస్ట్రిబ్యూటరీ సంఘం ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌గుప్తాతోపాటు కణేకల్లు, బొమ్మనహళ్, విడపనకల్లు మండలాల సాగునీటి సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
ఆయకట్టుకు నీరివ్వం
Published Wed, Aug 23 2017 9:55 PM | Last Updated on Tue, Sep 12 2017 12:51 AM
Advertisement
Advertisement