శాంతించిన తమ్మిలేరు, ఏలేరు | AP Districts Are Recovering From Heavy Rains Caused By Cyclone | Sakshi
Sakshi News home page

శాంతించిన తమ్మిలేరు, ఏలేరు

Published Fri, Oct 16 2020 9:12 AM | Last Updated on Fri, Oct 16 2020 9:12 AM

AP Districts Are Recovering From Heavy Rains Caused By Cyclone - Sakshi

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇళ్లలోకి చేరిన వరద నీరు,

సాక్షి, ఏలూరు/అమలాపురం : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన జిల్లాలు తేరుకుంటున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గురువారం వాతావరణం పొడిగానే ఉంది. అయినా పల్లపు ప్రాంతాల్లోకి చేరిన నీరు బయటకు పోకపోవడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలో బుధవారం ఎర్రకాలువలో పడి రైతు రాటాల త్రిమూర్తులు (38) మృతిచెందగా గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలోని వాగులో గురువారం 88 త్యాళ్లూరు గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి పిల్లి హేమంత్‌ (12) కొట్టుకుపోయాడు. చదవండి: నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం

పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్మిలేరు శాంతించినా ఎర్రకాల్వ మాత్రం ఇంకా పోటెత్తుతూనే ఉంది. పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తమ్మిలేరుకు వరద తగ్గింది. ఆంధ్రాకాల్వ నుంచి మాత్రమే తమ్మిలేరుకు వరద వస్తోంది. ఎర్రకాల్వ నీరు నిడదవోలుతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పంటపొలాల్లోకి చేరింది. ఈ కాలువ నీరు కలవడంతో తణుకు రూరల్‌ మండలం దువ్వ వయ్యేరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి క్షేత్రంలోకి ఎర్రకాల్వ ముంచెత్తింది. యనమదుర్రు డ్రైన్‌ ఉప్పొంగడంతో భీమవరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చదవండి: దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు


ప.గో జిల్లా తాళ్లపాలెంలో ముంపును పరిశీలిస్తున్న మంత్రి వనిత, ఎమ్మెల్యే శ్రీనివాస్‌

వరద ముంపునకు గురైన గ్రామాలకు తాగునీరు, నిత్యావసర సరుకులు తీసుకెళుతున్న పడవ గురువారం దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరువాగులో కొట్టుకుపోయింది. దీన్లో ప్రయాణిస్తున్న మత్స్యశాఖ ఏడీ, ఎఫ్‌డివో, గ్రామస్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిడదవోలులో ముంపు ప్రాంతాలను రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, నిడదవోలు ఎమ్మెల్యే జీఎస్‌ నాయుడు పరిశీలించారు.

బాధితులకు మంత్రి కన్నబాబు పరామర్శ
తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పొంగి పొలాలను, పలు ప్రాంతాలను ముంచెత్తిన ఏలేరు నెమ్మదించింది. రిజర్వాయర్‌లో 86.23 మీటర్లున్న నీటిమట్టం 86.13 మీటర్లకు తగ్గింది. బుధవారం రాత్రి వరకు 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి 14 వేల క్యూసెక్కులకు తగ్గించారు. పిఠాపురం– గొల్లప్రోలు మధ్య 216వ నంబరు హైవే మీద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ రూరల్‌ మండలంలో 40 కాలనీలు ముంపులో ఉన్నాయి. ఎఫ్‌సీఐ కాలనీ, జనచైతన్య కాలనీలో మంత్రి కన్నబాబు మోకాలు లోతు నీటిలో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులకు సహాయ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. 

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సీతమ్మధార (విశాఖ ఉత్తర): విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గణపతినగర్‌లో భారీవర్షాలకు గత ఆదివారం గోడకూలి మరణించిన గర్భిణి రామలక్ష్మి, ఆమె కుమారుడు జ్ఞానేశ్వరావు కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించింది. మృతురాలి తల్లి నెల్లి పార్వతికి ప్రభుత్వం తరఫున రూ.8 లక్షల చెక్కును పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌ గురువారం అందజేశారు. పుర్రె సురేష్‌యాదవ్, పీవీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


బాధితులకు చెక్కు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి, మళ్ల విజయప్రసాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement