సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడైంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
పలుచోట్ల భారీ వర్షాలు
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.5 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో 7.5 సెంటీమీటర్లు, అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 7.4, నంద్యాల జిల్లా వెలుగోడులో 7, ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 6.2, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 5.7, అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 5, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4.7, శ్రీశైలంలో 4.6 సెంటీమీటర్ల వర్షం పడింది.
AP Rain Alert: కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
Published Tue, Aug 9 2022 3:35 AM | Last Updated on Tue, Aug 9 2022 3:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment