north coastal
-
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడైంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పలుచోట్ల భారీ వర్షాలు అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.5 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో 7.5 సెంటీమీటర్లు, అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 7.4, నంద్యాల జిల్లా వెలుగోడులో 7, ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 6.2, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 5.7, అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 5, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4.7, శ్రీశైలంలో 4.6 సెంటీమీటర్ల వర్షం పడింది. -
తీరం దాటినా గులాబ్ తుఫాన్
-
Cyclone Gulab: తీరం దాటిన తుపాను
సాక్షి, శ్రీకాకుళం/విజయనగరం: కళింగపట్నం-గోపాలపూర్ మధ్య గులాబ్ తుపాను తీరం దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. కాగా, గులాబ్ తుఫాన్ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్ అదిత్య నాథ్ చర్యలు చేపడుతున్నారు. చదవండి: Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను -
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
-
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడి శనివారం సాయంత్రానికి గులాబ్ తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 370 కి.మీ., శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి తూర్పు దిశలో 440 కి.మీ. దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన గులాబ్ తుపానుగా మారిన తర్వాత గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది. ఇది శనివారం అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి.. పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కాస్త పరిస్థితుల మార్పు చెందితే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతోనూ.. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండనున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు దండోరా వేయించారు. పోర్డులకు మూడో ప్రమాద హెచ్చరిక తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉంది. బొప్పాయి, అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్రకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం, ఒక ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాన్ని సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళానికి మరో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పోలీస్, రెవెన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలందాయి. రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే యుద్ధప్రాతిపదికన సరిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. కోవిడ్ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలని, కోవిడ్–19 బారిన పడిన వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 28న మరో అల్ప పీడనం ఈ నెల 27న ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 86 వేల కుటుంబాలను గుర్తించి తుపాను షెల్టర్లకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసేలా ‘స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్’ ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల్లో జిల్లా స్థాయిలోను, తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే 76 మండలాల్లో మండల స్థాయిలోను ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. -
ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం : వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ‘రుతు పవనాలు కూడా మరింత బలంగా ముందుకు కదులుతున్నాయి. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండి, అలలు సాధారణం కంటే 3.5 మీటర్లు ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని’ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కాగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. -
ఉత్తర కోస్తాలో అకాల వర్షాలు!
ఉత్తరకోస్తా జిల్లాల్లో మూడురోజుల పాటు అక్కడక్కడ భారీ అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐంఎడీ వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి జల్లులుగానీ, వర్షంగానీ కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాపై వరుణుడు ప్రతాపం చూపనున్నాడు. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, అకాలవర్షాలతో పాటు పిడుగులుతో దాడి చేయనున్నాడు. రాష్ట్రంలో వాతావరణం మారిన నేపథ్యంలో అకాల వర్షాలకు ఆస్కారం ఏర్పడింది. గురు, శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో అక్కడక్కడ తేలికపాటి జల్లులుగానీ, వర్షంగానీ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు ప్రభావం చూపనున్నాయి. పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. -
ఉత్తరకోస్తాకు వర్ష సూచన
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో లంకకు సమీపంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 4.5కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలోని ఒకట్రెండు చోట్ల వర్షాలు ఉంటాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తా మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది. -
'ఉత్తరాంధ్రలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకోండి'
పై-లీన్ తుపాన్ ప్రభావంతో సముద్రంలో చేపట వేటకు వెళ్లని మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి సీఎం కిరణ్‌ను కోరారు. తుపాన్‌తో చిగురుటాకులా వణికిన ఉత్తరాంధ్ర జిల్లాలో రఘువీరా ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను సీఎం కిరణ్‌కు ఫోన్లో ఆయన వివరించారు. 74 వేల మత్స్యకారుల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం కిరణ్‌కు రఘువీరా విజ్ఞప్తి చేశారు. అందుకోసం జిల్లా యంత్రాగాన్ని ఆదేశించాలని ఆయన సీఎం కిరణ్‌ను కోరారు. -
పై-లీన్ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
రాగల 36 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే 36 గంటల్లో తీరం వెంబడి 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం,భీముని పట్నం ఓడరేవుల్లో10వ నెంబర్, విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 8వ నెంబర్, మచిలిపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలో 3వ ప్రమాద నెంబర్ హెచ్చరికాలు కొనసాగుతున్నాయి.