Gulab Cyclone 2021: High Alert In North Coastal Andhra Pradesh - Sakshi
Sakshi News home page

Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్‌ తుపాను

Published Sun, Sep 26 2021 4:08 AM | Last Updated on Sun, Sep 26 2021 4:45 PM

Gulab Cyclone High Alert In North Coastal Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్‌ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడి శనివారం సాయంత్రానికి గులాబ్‌ తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 370 కి.మీ., శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి తూర్పు దిశలో 440 కి.మీ. దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన గులాబ్‌ తుపానుగా మారిన తర్వాత గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది.

ఇది శనివారం అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి.. పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కాస్త పరిస్థితుల మార్పు చెందితే  సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతోనూ.. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండనున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు దండోరా వేయించారు.

పోర్డులకు మూడో ప్రమాద హెచ్చరిక
తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉంది. బొప్పాయి, అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఉత్తరాంధ్రకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు 
ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందం, ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాన్ని సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళానికి మరో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

పోలీస్, రెవెన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలందాయి. రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్‌ సమస్యలు ఎదురైతే యుద్ధప్రాతిపదికన సరిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆర్‌ అండ్‌ బీ శాఖను ఆదేశించింది. కోవిడ్‌ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉంచుకోవాలని, కోవిడ్‌–19 బారిన పడిన వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

28న మరో అల్ప పీడనం
ఈ నెల 27న ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 86 వేల కుటుంబాలను గుర్తించి తుపాను షెల్టర్లకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసేలా ‘స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌’ ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల్లో జిల్లా స్థాయిలోను, తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే 76 మండలాల్లో మండల స్థాయిలోను ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement