
సాక్షి, విశాఖపట్నం: గులాబ్ తుపాను ప్రభావంతో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల వాతావరణం చల్లగా మారిందని భావించిన ప్రజలకు ఆదివారం భానుడు ప్రతాపం చూపించాడు. నడి వేసవిని తలపిస్తూ ఎండలు ఠారెత్తించాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కంచికచర్లలో అత్యధికంగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో 38.6, గోపాలపురంలో 38.4, కర్నూలు, రేణిగుంటలో 38.3, అనకాపల్లిలో 38.2, పమిడిలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదిలావుండగా.. షహీన్ తుపాను పాకిస్తాన్ వైపు వెళ్లడంతో రాజస్థాన్‌లో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా తిరోగమించడం ప్రారంభించాయి. దీంతో రాష్ట్రం వైపుగా తూర్పు, దక్షిణ గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ గాలులు రాష్ట్రంపై ఉన్న తేమని తీర ప్రాంతం వైపు తీసుకెళ్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల రాగల 2 రోజుల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది.
మూడో వారంలో తుపాను!
అక్టోబర్ మూడో వారంలో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. క్రమంగా తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని భావిస్తున్నారు. గడచిన 24 గంటల్లో కొమరాడలో 48.5 మి.మీ., పార్వతీపురంలో 37.3 మి.మీల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment