
సాక్షి, శ్రీకాకుళం/విజయనగరం: కళింగపట్నం-గోపాలపూర్ మధ్య గులాబ్ తుపాను తీరం దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు.
కాగా, గులాబ్ తుఫాన్ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్ అదిత్య నాథ్ చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment