
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 48 గంటల అనంతరం అంటే ఈ నెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఈనెల 8 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే వీలుందని వివరించింది. అదే సమయంలో గంటకు 45 – 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది.
ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment