ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి అమర్‌నాథ్
సాక్షి, రాజమహేంద్రవరం/పాడేరు: భారీ వర్షాలు, గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన నివేదికను అధికారుల ద్వారా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు.
ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లో ముంపు పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మరో 48 గంటలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల్లో చిక్కుకున్న 65 మందిని ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృంధాలు రక్షించాయని చెప్పారు. ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. బాధిత ప్రజలందరికీ సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
వరద పూర్తిగా తగ్గే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని, బియ్యం, ఇతర నిత్యావసరాలన్నింటిని పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేసామని మంత్రులు తెలిపారు. ఏరియల్ సర్వేలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment