సాక్షి, తాడేపల్లి: చరిత్రలో గోదావరి వరదలు ఇంతలా రావడం ఎప్పుడూ చూడలేదన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారికి కావాల్సినవన్నీ సమకూర్చామని చెప్పారు. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కడుపుమంటతో చంద్రబాబు, ఆ పత్రికలు బాధపడుతున్నాయని విమర్శించారు. అధికారం కోసం వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
'చంద్రబాబు కోనసీమ వెళ్లే క్రమంలో.. మాకు ఏమీ అందలేదని వరద బాధితులతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా రోడ్ మ్యాప్నీ తయారు చేస్తోంది. ఇటువంటి పకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సీఎం జగన్ చేపట్టిన వ్యవస్థల్లో మార్పులు ఎలా ఉపయోగపడ్డాయి అనేది స్పష్టం అవుతోంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, సచివాలయం, 26 జిల్లాల కలెక్టర్ల వ్యవస్థ ఉంది. వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో హెలికాప్టర్లు, బోట్ల ద్వారా అన్ని నిత్యావసరాలు అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికి రూ.2000 ఇవ్వమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చేయాల్సింది చేస్తారు తప్ప మా నాయకుడికి ప్రచారం ఇష్టం లేదు' అని అమర్‌నాథ్ అన్నారు.
'హుద్‌హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు ఎంత పబ్లిసిటీ చేసుకున్నాడో చూశాం. చివరికి ఆ తుఫాన్ ఈయన్ని చూసి పారిపోయింది. మొన్నటికి మొన్న నేను ముఖ్యమంత్రిగా ఉంటే కోవిడ్ వచ్చేదా? అంటారు. చంద్రబాబుని పైకి లేపాలి అని ఆ పత్రికలు తెగ తాపత్రయ పడుతున్నాయి. నేరుగా ప్రతి ఒక్కటి ఇంటివద్దకు తీసుకెళ్ళి ఇస్తున్నాం. మనం ఏ అబద్దం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం పొరపాటు. ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే నమ్ముతారు అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. అధికారం లేక డొక్కలు ఎండుతుంది చంద్రబాబుకి, లోకేష్‍కి, ఆ పత్రికలకి. పశువులకు కాదు. వీరికి అధికారం లేదనే ఆవేదనను ఇలా వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడా వీళ్ళకి శవం దొరకలేదు. దొరికితే వేరేలా ఉండేది. ఈ రకంగా ప్రజల్ని నమ్మించాలనే మీ ఆలోచన సక్సెస్ కాదు. ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యతను మీరు సీఎం జగన్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. చూసి ఓర్వలేక, భవిష్యత్తు ఉండదని భయపడి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు' అని మంత్రి పేర్కొన్నారు.
'ఇటువంటి సందర్భాల్లో అయినా రాజకీయాలు మానుకోవాలి. చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే చేస్తాం. బ్యాక్ వాటర్స్ వల్ల వరద వస్తే... వాళ్ళు కట్టే ప్రాజెక్టులు కూడా తీసేయండి. పోలవరం ఎత్తు పెంచడానికి వీల్లేదనడం సరైంది కాదు. విలీన గ్రామాలను పట్టించుకోలేదని ఆయన చెప్తే ఎలా..? ముందు ఖమ్మం జిల్లాను పట్టించుకోమనండి. అలా అయితే ఏపీని తెలంగాణాలో కలపమనండి. హోదాపై వాళ్ళు ఏది చెప్పినా సరే మా పోరాటం కొనసాగుతుంది. మా డిమాండ్ కొనసాగిస్తాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చామో స్పష్టంగా చెప్పాం. ఒక గిరిజన మహిళను ఎంపిక చేయడం వల్లే మద్దతు పలికాం. అలా అని మా డిమాండ్ వెనక్కి పోయిందని కాదు' అని మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
చదవండి: అధికారం అంటే అజమాయీషీ కాదు.. అందరికీ సంక్షేమం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment