‘ప్రధాని భూమి పూజ చేసే ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే’ | Gudivada Amarnath Comments On Chandrababu Naidu Over YSRCP Projects, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ప్రధాని భూమి పూజ చేసే ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే’

Published Tue, Jan 7 2025 8:03 AM | Last Updated on Tue, Jan 7 2025 9:32 AM

Gudivada Amarnath Comments On Chandrababu Over YSRCP Projects
  • ఆ ప్రాజెక్టులన్నీ వైఎస్సార్‌సీపీ హయాంలో సాధించినవే.. 
  • ∙రైల్వే జోన్, బల్క్‌ డ్రగ్‌ పార్క్, ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు రావడం వైఎస్‌ జగన్‌ ఘనతే 
  • ∙ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.. 
  • ∙15 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు
  • ∙దీనిపై లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధం
  • మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో భూమి పూజ చేయనున్న రైల్వే జోన్, నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టులన్నీ వైఎస్సార్‌సీపీ హయాంలో సాధించినవేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌(Gudivada Amarnath) చెప్పారు. కానీ ‘సొమ్మొకడిది సోకొకడిది...’ అన్న చందంగా ఇవన్నీ తామే తీసుకొచ్చామన్నట్లుగా మంత్రి లోకేశ్‌ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని, ప్లాంట్‌ అభివృద్ధి కోసం కర్ణాటక తరహాలో రూ.15 వేల కోట్లను కేంద్రం నుంచి తీసుకురావాలని సవాల్‌ విసిరారు. స్థానిక మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ శాఖపైనా అవగాహన లేకపోయినా.. సకల శాఖల మంత్రిగా, కలెక్షన్‌ కింగ్‌గా లోకేశ్‌ ఏడు నెలల్లో మంచి పేరే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

 ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని, దీనిపై లోకేశ్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని అమర్‌నాథ్‌ ప్రకటించారు. అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటుపై విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా చర్చించి ఒప్పందం చేసుకునేలా చూశారని తెలిపారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భూమి పూజ చేయాలనుకున్నా ప్రధానికి సమయం కుదరలేదని, ఆ తర్వాత ఎలక్షన్‌ కోడ్‌ వచ్చిందని  చెప్పారు.

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి దాన్ని సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, ఇది కచ్చితంగా నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ఘనతేనని స్పష్టంచేశా>రు. రైల్వే జోన్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూములే ఇవ్వలేదని లోకేశ్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని, రైల్వేశాఖకు 52 ఎకరాలు కేటాయిస్తూ జీవీఎంసీ కమిషనర్‌ గత ఏడాది జనవరి రెండో తేదీన ఉత్తర్వులు ఇచ్చారని వివరించారు. రుషికొండపై టూరిజం గెస్ట్‌హౌస్‌ ఏమైనా మా సొంత నిర్మాణమా? ప్రభుత్వానిదే కదా? ఏ అవసరం కోసమైనా వాడుకోవచ్చు కదా? ఎందుకా పిచ్చి విమర్శలు? అని అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement