హైకోర్టు ఆదేశాలున్నా.. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు
విశాఖ కార్యాలయం కోసం వీఎంఆర్‌డీఏకు రూ.15 లక్షలు చెల్లించాం
అనకాపల్లి కార్యాలయం కోసం రూ.38 లక్షలు చెల్లించాం
ఇప్పుడు వీఎంఆర్‌డీఏ కాదు జీవీ ఎంసీ అనుమతులివ్వాలంటే ఎలా?
వీటిపై న్యాయ పోరాటం చేస్తాం
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలవడం లేదని, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. ఆయన శనివారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుంచి ఈరోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి దమనకాండ చూస్తూనే ఉన్నామన్నారు.
హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూలి్చవేయడం కూటమి నేతల విధ్వంసకాండకు పరాకాష్టగా చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అధికారులతో నోటీసులు జారీ చేయించారన్నారు. వీటిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, తమ పార్టీ దేవాలయాలను రక్షించుకుంటామని అన్నారు.
అనుమతులున్నా.. లేవంటూ నోటీసులు
విశాఖ, అనకాపల్లి పార్టీ కార్యాలయాలకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అనుమతుల్లేవంటూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 33 ఏళ్లకు డబ్బు చెల్లించి పార్టీ కార్యాలయానికి స్థలాలు లీజుకు తీసుకున్నామన్నారు. విశాఖ కార్యాలయానికి రూ.15 లక్షలు, అనకాపల్లి కార్యాలయానికి రూ.38 లక్షలు వీఏంఆర్డీఏకి చెల్లించి గతేడాది ఫిబ్రవరి నెలలోనే అనుమతి కోరామన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఏదైనా పార్టీ కార్యాలయాలకు లీజు పద్ధతిలో ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవచ్చనేది ఉందని, దాని ప్రకారమే 33 ఏళ్లకు లీజుకు తీసుకొని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయాలు నిరి్మస్తున్నామని తెలిపారు. గజాల్లో స్థలం ఉంటే జీవిఎంసీ అనుమతి కావాలని, కానీ 2 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలంటే వీఎంఆర్‌డీఏ అనుమతి తీసుకోవాలన్నారు.
దాని ప్రకారమే డబ్బులు చెల్లించి వీఎంఆర్‌డీఏ అనుమతి కోరామన్నారు. సెప్టెంబర్‌లో మార్టగేజ్ కూడా చేశామని తెలిపారు. ఈ నిర్మాణాలు తమ పరిధిలోకి రావని వీఎంఆర్‌డీఏ చెప్పి ఉంటే అప్పుడే జీవిఎంసీ అనుమతి కోరేవాళ్లమని అన్నారు. రూల్ ప్రకారం వీఎంఆర్‌డీఏ ద్వారానే జీవీఎంసీకి కూడా అనుమతికి పంపిస్తారని తెలిపారు.
విశాఖ టీడీపీ కార్యాలయాన్ని అక్రమ పద్ధతుల్లో నిర్మించారు
విశాఖలో టీడీపీ కార్యాలయానికి నిర్మాణం చేపట్టిన 16 ఏళ్ల వరకు అనుమతే తీసుకోలేదని, అనుమతుల్లేకుండా అక్రమ పద్ధతిలో దాన్ని నిర్మించారని చెప్పారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా నిరి్మంచిన టీడీపీ కార్యాలయాలను కూల్చడం క్షణాల్లో పని అని, కానీ తాము ఆ పని చేయలేదని అన్నారు. 2015–19 మధ్య ఏపీలో 10 టీడీపీ కార్యాలయాల కోసం లీజు పద్ధతిలో స్థలం తీసుకుని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.
ఇది బుల్డోజర్ల ప్రభుత్వమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం అక్రమాలతో పాలన సాగిస్తోందని శుక్రవారం తమ పారీ్టకి చెందిన 4వ వార్డు కార్పొరేటర్ కొండబాబు ఇంటిపై రాళ్లతో టీడీపీ మూకలు దాడి చేశాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు.
ఇది ప్రజాస్వామ్యమేనా?
హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ అధికార బలంతో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేయడం కక్ష సాధింపు చర్యేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.
దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూలి్చవేశారని మండిపడ్డారు. ఎన్‌డీఏ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని, నారా డిస్ట్రక్టివ్ అలయన్స్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమేనన్నారు. టీడీపీ కార్యాలయాలు చాలావరకు అనుమతుల్లేకుండా నిరి్మంచినవేనని తెలుసుకుని, అప్పుడు తమ పార్టీ ఆఫీస్‌కి నోటీసులిస్తే బెటర్ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment