రాజమహేంద్రవరంలో రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ అమలాపురం/ధవళేశ్వరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చింతూరు/ ఎటపాక/దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది.
లక్ష్మీ బ్యారేజ్ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద 19,90,294 క్యూసెక్కులు ఉండగా..
వరద నీటి మట్టం 63.20 అడుగులకు చేరగా. ఇది శుక్రవారం 70 అడుగులను దాటే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి 1986, ఆగస్టు 16న రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలంలో గరిష్ఠంగా 75.6 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 24, 1990న 70.8 అడుగులుగా నమోదైంది. అనంతరం.. గత 32 ఏళ్లుగా ఎన్నడూ భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 70 అడుగులను దాటలేదు.
తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంక వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోం మంత్రి వనిత, ఎమ్మెల్యే రాజా, కలెక్టర్ మాధవీలత తదితరులు
పోలవరం వద్ద హైఅలర్ట్..
ఎగువ నుంచి గోదావరి పోటెత్తుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 24 గంటలూ ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని అధికారులు సమీక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్దకు గురువారం రాత్రి 9 గంటలకు 16,48,375 క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 36.495 మీటర్లకు చేరగా.. దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.20 మీటర్లకు చేరుకుంది. ఇక్కడకు శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత వరద వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వరద ఉధృతి
మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. బ్యారేజ్‌లోకి గురువారం 16,61,565 క్యూసెక్కులు చేరుతోంది. మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి 16,76,434 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. వరద మట్టం 15.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అలాగే, శుక్రవారం సాయంత్రం లేదా రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీలోకి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముంది.
అప్పుడు వరద మట్టం 17.75 అడుగులను దాటే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీచేయనున్నారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 17.60 అడుగులుగా ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశముంది. అంబేద్కర్ కోనసీమలో 20, తూర్పు గోదావరిలో 8, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి 4, ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశముంది.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా గ్రామంలో హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న దృశ్యం
కోనసీమ లంక వాసుల ఆందోళన
గోదావరికి మరింత వరద వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో కోనసీమ లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కె.గంగవరం, ఐ.పోలవరం మండలాల్లోని పలుచోట్ల ఇళ్లలోకి నీరుచేరింది. 18 మండలాల్లోని 59 గ్రామాలు వరద నీట చిక్కుకున్నాయి. 73,400 మంది వరదబారిన పడ్డారు. వరద ఉధృతి మరింత పెరిగితే ఈ మండలాల్లో మరికొన్ని గ్రామాలతోపాటు కాట్రేనికోన, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరే అవకాశముంది.
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్టు సమీపంలో ఏటిగట్టు తెగే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పలు లంకలకు అధికారులు పడవలు ఏర్పాటుచేశారు. అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీలో 65 ఇళ్లు వరద ముంపుబారిన పడ్డాయి. పి.గన్నవరం మండలం నాగుల్లంక శివారు పల్లిపాలెం, ఎల్.గన్నవరం శివారు జొన్నలలంక. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పుచ్చల్లంక, రాయలంక, కనకాయలంక, అయోధ్యలంకల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
ఈ జిల్లాలో 73 పునరావస కేంద్రాలను గుర్తించి, 143 బోట్లను సిద్ధంచేశారు. 7,600 మందికి అహార ప్యాకెట్లు అందించగా, సుమారు రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లు అందించారు. 79 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపు బాధితుల వద్దకు మంత్రి వేణు పడవపై వెళ్లి నిత్యావసర సరుకులు అందజేశారు. పాండిచ్చేరీ యానాంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకీ వరద నీరు చేరింది.
‘తూర్పులో ఎనిమిది ప్రాంతాలపై దృష్టి
ధవళేశ్వరం హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ‘తూర్పు’లో ఎనిమిది వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కొవ్వూరులో 70, సీతానగరం మండలంలో 270 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో నీటిలో చిక్కుకున్న 8 మంది గొర్రెల కాపరులను, 60 గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కరకట్టలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ కె.మాధవీలత గురువారం పర్యటించారు. విశాఖ జిల్లా ఎటపాక పోలీసుస్టేషన్లోకి గోదావరి వరద చేరింది.
తూర్పు గోదావరి జిల్లా బుర్రింక వద్ద గోదావరి లంకల్లో చిక్కుకున్న గొర్రెలు, గొర్రెల కాపరులను ఒడ్డుకు చేర్చేందుకు బోట్లపైకి ఎక్కిస్తున్న దృశ్యం
విలీన మండలాలు విలవిల
గోదావరి మహోగ్రరూపంతో పోలవరం ముంపు (విలీన) మండలాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని అనేక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. 12,694 కుటుంబాలకు చెందిన 36 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చింతూరు కేంద్రంగా అధికారులు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సాయంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసరాలను ముంపు ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అందచేస్తున్నారు.
దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. వేలేరుపాడు మండలంలో కొయిదా గ్రామానికి గురువారం హెలికాఫ్టర్ ద్వారా 800 మందికి సరిపోయే నిత్యావసరాలు అందించారు. శుక్రవారం కూడా ఇలాగే అందించనున్నారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మలు వేలేరుపాడులో పర్యటించి పునరావాస కేంద్రాలు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment