మహోగ్ర కృష్ణా | Heavy Flood At Krishna River Prakasam Barrage | Sakshi
Sakshi News home page

మహోగ్ర కృష్ణా

Published Sun, Oct 16 2022 4:43 AM | Last Updated on Sun, Oct 16 2022 4:43 AM

Heavy Flood At Krishna River Prakasam Barrage - Sakshi

‘శ్రీశైలం’ నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఎగువన ప్రాజెక్టులన్నీ నిండిపోయి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 4,53,067 క్యూసెక్కులు వస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

కృష్ణా డెల్టాకు 2,827 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,50,240 క్యూసెక్కులను బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్‌లో జూన్‌ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు వెయ్యి టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. 

శ్రీశైలంలోకి కొనసాగుతున్న వరద 
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,02,786 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ 65,643 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్, పులిచింతలలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. సాగర్, పులిచింతలలోకి వచ్చిన వరదను దిగువకు వదలిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది.  

ఎగువన తగ్గుతున్న వరద.. 
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలోకి వచ్చే వరద తగ్గింది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల స్పిల్‌ వే గేట్లను మూసివేశారు. తుంగభద్ర, భీమా నదుల్లోనూ వరద తగ్గింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి శ్రీశైలంలోకి చేరే వరద తగ్గనుంది. 

విజయవాడకు ముంపు భయం లేదిక 
ప్రతి ఏటా కృష్ణా నది వరదల సమయంలో ముంపు ముప్పును ఎదుర్కొనే విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు ఇప్పుడా భయం లేదు. గతంలో ప్రకాశం బ్యారేజ్‌ నుంచి మూడు లక్షల క్యూసెక్కులు వదిలితే దిగువన విజయవాడలోని కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. దాంతో ఆ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్ప మిగిలిన ముఖ్యమంత్రులెవరూ ఈ ప్రాంతాల ప్రజల అవస్థలను పట్టించుకోలేదు. కృష్ణా వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించడానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో యనమలకుదురు నుంచి కోటినగర్‌ వరకు కృష్ణా నదికి 2.28 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడలు నిర్మించారు.

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు కోటినగర్‌ నుంచి తారకరామనగర్‌ వరకు 1.56 కిలోమీటర్ల పొడవున రూ. 125 కోట్లతో రక్షణ గోడ నిర్మించారు. ఈ పనులను 2021 మే 31న ప్రారంభించి.. రికార్డు సమయంలో పూర్తి చేశారు.

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 12 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినా లోతట్టు ప్రాంతాలకు వరద చేరకుండా పటిష్ఠంగా ఈ గోడ నిర్మించారు. దీంతో లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు ప్రజలకు ముంపు ముప్పు తొలగింది. ప్రస్తుతం పద్మావతి ఘాట్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు కృష్ణా నదికి రక్షణ గోడ నిర్మిస్తున్నారు. దీనికి రూ.135 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  

పెన్నాలో మరింత పెరిగిన వరద 
కర్ణాటక, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. పెన్నా ప్రధాన పాయతోపాటు ఉప నదులు జయమంగళ, కుముద్వతి, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, బాహుదా, పించా, సగిలేరు ఉరకలెత్తుతున్నాయి. దీంతో పెన్నాలోకి భారీగా వరద వస్తోంది.

శనివారం నెల్లూరు బ్యారేజ్‌ నుంచి 81 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారంటే.. పెన్నాలో వరద స్థాయిని అంచనా వేయచ్చు. ఇప్పటికే పెన్నా ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడం, వరద భారీగా వస్తుండటంతో అప్పర్‌ పెన్నార్‌ నుంచి నెల్లూరు బ్యారేజ్‌ వరకు ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. ఒక సీజన్‌లో ప్రాజెక్టుల గేట్లను రెండోసారి ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement