సాగర్ నుంచి దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: రాష్ట్రంలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆ జిల్లా వ్యాప్తంగా సగటున 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 13.2 సెం.మీ. వర్షం పడింది. కారెంపూడి మండలం శంకరపురంసిద్ధాయిలో 8.6 సెం.మీ, నకరికల్లు మండలం చాగల్లులో 7.3, నాదెండ్ల మండలం గణపవరంలో 7, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది.
ఇక కాకినాడ సిటీలో పలుచోట్ల 15–16 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరయ్యపాలెంలో 6.1, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెలలో 6.1, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 5.9, గుంటూరు జిల్లా తాడికొండ మండలం బెజత్‌పురంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని నల్లడ్రెయిన్‌కు గండి పడింది. ఫలితంగా వందలాది ఎకరాల్లోకి నీళ్లు చేరాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం సగటు వర్షపాతం 28.6 మి.మీ., కృష్ణా జిల్లాలో 16.3 మి.మీ.గా నమోదైంది.
ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఒంగోలు నగరంలో ముసురుపట్టినట్లు రోజుకు నాలుగైదుసార్లుగా వర్షం పడుతూనే ఉంది. నల్లవాగు, చిలకలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఎగువన కురిసిన వర్షాలకు మల్లవరం రిజర్వాయర్ ద్వారా శనివారం అర్ధరాత్రి నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది.
ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆదివారం బ్యారేజీకి చెందిన 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఎగువ నుంచి 5,09,431 క్యూసెక్కుల వరద వస్తుండగా, కాలువలకు 2,827 క్యూసెక్కులు, సముద్రంలోకి 5,06,604 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి ఐదు లక్షల క్యూసెక్కుల పైబడి వరద రావడం ఇదే తొలిసారి.
అలాగే, జూన్ 1 నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకూ మొత్తం 1,035.768 టీఎంసీలు కడలిలో కలవడం గమనార్హం. అలాగే, నాగార్జునసాగర్‌లో 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇక ఆదివారం సా. 6 గంటలకు శ్రీశైలంలోకి 4,01,187 క్యూసెక్కులు చేరుతుండటంతో తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3,59,978 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి దిగువకు 3,67,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.650 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.760 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment