సాక్షి,అమరావతి/చిత్తూరు అగ్రికల్చర్: అనుకున్నట్లుగానే నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగాలు, అండమాన్ సముద్ర ప్రాంతాన్ని సోమవారం రుతుపవనాలు తాకాయి. సాధారణంగా ఈ నెల 22న రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారం ముందే ప్రవేశించాయి.
రాబోయే రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపాయి. వీటి ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి. భూవాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోనూ 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకపోతే ఉక్కపోత ఉండడంతో కోస్తా ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంది.
రాయలసీమలో భారీ వర్షాలు
మరోవైపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి మరింతగా విస్తరించి ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి.
సోమవారం చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, రేణిగుంట, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, తిరుమల, చంద్రగిరి, కుప్పం, ఐరాల, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కురబలకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, సుండుపల్లి, వీరబల్లి, ఆదోని, పత్తికొండ, బద్వేలు, దువ్వూరు, పోరుమామిళ్ల, సిద్ధవఠం, మైదుకూరు, రాయచోటి, సంబేపల్లె తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు నేలకూలాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అరుదూరులోని శివాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది.
ఇద్దరు గొర్రెల కాపర్లు మృత్యువాత
వైఎస్సార్ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. దువ్వూరు మండలంలో పిడుగుపాటుకు గొర్రెల కాపర్లు.. నల్లబోతుల హనుమంతు (56), శెట్టిపల్లె మునిరావు (32) మృతి చెందారు. గొర్రెలు మేపుకునేందుకు గుట్టకు వెళ్లిన వీరు వాన ప్రారంభం కావడంతో సమీపంలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లారు. అంతలోనే పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.
బద్వేలులోని సురేంద్రనగర్‌లో ఓ ఇంటిపై పిడుగు పడటంతో గృహోపకరణాలు కాలిపోయాయి. వల్లూరు మండలం తప్పెట్ల బస్టాప్ వద్ద భారీ చెట్టు వర్షానికి కూలిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అనిబిసెంట్ వీధిలో ఓ మొబైల్ దుకాణంలోకి వర్షపునీరు చేరడంతో రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ పరికరాలు నీటమునిగాయి.
కోస్తాలో మోస్తరు వానలకు ఆస్కారం
కాగా, వచ్చే రెండు రోజులు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల పిడుగులు పడతాయని పేర్కొంది. కోస్తా ప్రాంతంలోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment