Thunderstorms
-
Uttar Pradesh: పిడుగుపాటుకు 38 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పిడుగులు పడిన ఘటనలు పలువురి ప్రాణాలు బలిగొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై కనీసం 38 మంది మరణించారని అధికారులు గురువారం ప్రకటించారు. ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, హత్రాస్, వారణాసి, సిద్ధార్థనగర్లలో ఒక్కొక్కరు మరణించారు. అనేక మందికి కాలిన గాయాలయ్యాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఘటనలో 13, 15 ఏళ్లున్న ఇద్దరుతో సహా చాలా మంది బాధితులు పొలంలో పనిచేస్తున్నారు. అప్పుడే చేపలు పట్టేటప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. సుల్తాన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొందరు వరి నాట్లు వేస్తుండగా, ఒకరు మామిడి కాయలు కోసేందుకు వెళ్లి, మరొకరు తాగునీరు తెచ్చేందుకు వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. బుధవారం భారీ వర్షం కురుస్తుండగా చెట్టు కింద తలదాచుకుంటున్న ఓ మహిళ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం కురుస్తుండటంతో మామిడి చెట్టు కింద తలదాచుకుంటున్న 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. డియోరియాలో పొలంలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తుండగా పిడుగుపడి 5 ఏళ్ల బాలిక మరణించింది. వారణాసిలో ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురయ్యారు. ఒకరు కాలిన గాయాలతో మృతి చెందగా, మరొకరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్. దాని పరిసర రాష్ట్రాలు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
గుజరాత్లో అకాల వర్షాలు..
అహ్మదాబాద్: గుజరాత్ వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో 20 మంది వరకు చనిపోయినట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది. దహోడ్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, అహ్మదాబాద్, అమ్రేలీ, బనస్కాంత, బోటడ్, ఖేడా, మెహ్సానా, పంచ్‌మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవ్‌భూమి ద్వారకల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలోని 252 తాలుకాలను గాను 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, సౌరాష్ట్ర ప్రాంతంలోని సెరామిక్ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రానికి మరింత వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్‌ప్రదేశ్‌లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
వర్షాలపై కీలక అప్డేట్.. రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు
-
అమెరికాలో భీకర వర్షాలు.. పిడుగులు
వాషింగ్టన్: అమెరికాలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూహ్యాంప్‌షైర్, న్యూయార్క్, రోడ్ఐలాండ్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భీకర వర్షాలకుతోడు పిడుగుల ముప్పు కారణంగా అమెరికాలో తాజాగా 2,600కుపైగా విమానాల రాకపోకలను రద్దుచేశారు. మరో 8,000 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ప్రధానంగా ఈశాన్య అమెరికాలో వాతావరణం ప్రతికూలంగా మారింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేన్వియా, మసాచుసెట్స్, వెర్మాంట్‌లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా, పశి్చమ, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కాలిఫోరి్నయా రాష్ట్రంలోని డెత్ వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. -
2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ విజ్ఞప్తులు
అమెరికాలో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా ఆదివారం(జులై 16) 2,600లకు పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 8 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఏబీసీ న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం అత్యధికంగా ఈశాన్య ప్రాంతంలోనే రద్దయ్యాయి. ఒక్క న్యూజెర్సీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే 350 కిపైగా విమానాలు రద్దయినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్, లా గార్డియన్ విమానాశ్రయాలు కూడా స్తంభించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి ➤ ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందే ఫ్లయిట్ టైమింగ్, వాతావరణ పరిస్థితులను సరిచూసుకోవాలని ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తులు చేశాయి. కాగా ఆ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక వరదలు సైతం నమోదైనట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఇది ఇలా ఉంటే, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశంలోని కొన్ని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో వడ గాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి, పశ్చిమ గల్ఫ్ కోస్ట్, దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది. -
రానున్న ఐదు రోజులు వడగాల్పులే.. యెల్లో అలర్డ్ జారీ..
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 42°C నుంచి 44°C వరకు స్థిరంగా నమోదవుతాయని పేర్కొంది. హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో 39°C నుంచి 41°C వరకు నమోదవుతాయని స్పష్టం చేసింది. వడగాలల నేపథ్యంలో పలు జిల్లాలకి వాతావరణశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు.. రేపు ఖమ్మం ,నల్గొండ,సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా అవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొంది. ఇదీ చదవండి:విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. -
మహాకాల్ లోక్‌లో గాలివాన బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
-
Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్
భువనేశ్వర్: దేశంలో అత్యంత వేగంగా పేరున్న సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అయితే ఈ రైలు నాణ్యత విషయంలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు అందుకు కారణం. తాజాగా.. వడగండ్ల వానకు, పిడుగుపడి ఓ వందేభారత్ రైలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఒడిషాలో ఈమధ్యే ప్రారంభమైన పూరీ-హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్(22896) ఆదివారం మధ్యాహ్నం ముందు భాగం దెబ్బతింది. భద్రాక్ రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో.. పిడుగుపడి డ్రైవర్ క్యాబిన్ విండ్‌స్క్రీన్, సైడ్ విండోలు పగుళ్లు వచ్చాయి. అయితే ఎవరికీ ఏం కాలేదు. అలాగే వడగండ్ల వాన కురిసి.. పలు కోచ్‌ల సైడ్ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు రైలు ఆగిపోయింది. రైలులో పవర్ సప్లై నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. ఓ డీజిల్ ఇంజిన్‌ను పంపించి రైలును అక్కడి నుంచి తరలించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) రైలును రద్దు చేశారు. ఒడిషా పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ హౌరాను కనెక్ట్ చేస్తూ ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా గత గురువారం ప్రారంభించారు. వచ్చే నెల ముగింపు లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందేభారత్ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది భారత రైల్వేస్. Odisha | Puri-Howrah Vande Bharat Express halted between Dulakhapatna-Manjuri Road Station after the overhead wire was damaged due to thunderstorms and lightning. Purna Chandra Shahu, Station Manager, Bhadrak said, "Front glass and side windows of the driver cabin were damaged… pic.twitter.com/bhuAIGQFiI — ANI (@ANI) May 21, 2023 -
తిరుమలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం
-
మెరుపులనే దారి మళ్లించారు!
పారిస్: మెరుపంటేనే వేగానికి పెట్టింది పేరు. వేగానికి అత్యుత్తమ ఉపమానం కూడా. మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు!! అతి శక్తిమంతమైన లేజర్ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు. పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్స్ లేబొరేటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు. ఇందుకోసం ఏకంగా మూడు టన్నుల బరువు, కారు పరిమాణమున్న లేజర్ పరికరాన్ని ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్ పర్వత శిఖరంపై 2,500 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. దానిద్వారా సెకనుకు ఏకంగా 1,000కి పైగా అతి శక్తిమంతమైన కిరణాలను ఆకాశంలో మెరుపులకేసి పంపించారు. తొలి ప్రయత్నంలోనే వాటి దారిని 160 అడుగుల దాకా మళ్లించగలిగారు. రెండు హైస్పీడ్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించారు. ‘‘అతి శక్తిమంతమైన లేజర్ కిరణాలను ఆకాశంలోకి పంపినప్పుడు శక్తిమంతమైన కాంతితో కూడిన ఫిలమెంట్లు ఏర్పడతాయి. అవి గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులను అయానీకరిస్తాయి. ఈ చర్య ఫలితంగా స్వేచ్ఛగా కదలాగే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ప్లాస్మాగా పిలిచే ఈ అయానీకరణ చెందిన గాలి ఎలక్ట్రాన్ల వాహకంగా పని చేస్తుంది’’ అంటూ ఈ టెక్నాలజీ పని చేసే తీరును డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ పియరీ వూల్ఫ్ వివరించారు. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత 1970ల్లోనే ప్రతిపాదించినా ఇప్పటిదాకా ల్యాబుల్లోనే ప్రయోగించి చూశారు. బయటి వాతావరణంలో ప్రయోగం జరపడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్ ఫోటానిక్స్‌లో పబ్లిషయ్యాయి. వీటి సాయంతో పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తేగల హై పవర్ లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు! -
వామ్మో.. ఇదేం పిడుగుల వాన!
సాక్షి, హైదరాబాద్: సిటీని జడివాన కష్టాలు వీడడం లేదు. బుధవారం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఏకధాటి వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, అమీర్‌పేట, మాసాబ్‌ట్యాంక్, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ, షేక్‌పేట్, ఆర్.సి పురం, కూకట్పల్లి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రాత్రి 11 గంటల వరకు బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత కురిసింది. మునుపెన్నడూ లేనంత పిడుగుల మోతతో నగరం హోరెత్తి పోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, గండిపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రసూల్‌పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చేరింది. బోరబండ సహా అనేకచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రో కింద భారీగా నీరు చేరింది. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బుధవారం రాత్రి 11 గంటల సమయానికి.. బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్లు, ఫిరోజ్‌గూడలో 9, కుత్బుల్లాపూర్‌లో 8.7, భగత్‌సింగ్‌నగర్‌లో 8.5, ఆర్సీపురంలో 8.3, తిరుమలగిరిలో 7.9, నేరెడ్‌మెట్‌లో 7.7, కూకట్‌పల్లిలో 7.4, సికింద్రాబాద్‌లో 6.6, బొల్లారంలో 5.7, బేగంపేటలో 5.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలమూరు అతలాకుతలం మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్‌ను భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టుప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. కొన్ని కాలనీల్లో మోకాళ్లలోతు వరకు నీరు రావడంతో జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మహేశ్వరకాలనీ, శివశక్తినగర్, కుర్విహిణిశెట్టి కాలనీ, మధురానగర్, ప్రేమ్‌నగర్, బాయమ్మతోట, అరబ్‌గల్లీ, భవిత కళాశాల ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. న్యూటౌన్, తెలంగాణచౌరస్తా, రాయచూర్ రోడ్లపై నీరు పారడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. భూత్పూర్ రోడ్డులో విద్యుత్ తీగలు తెగిపడడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు గంటసేపు వర్షం కురవగా.. 7.9సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
మొన్నటి సోమవారం.. వేకువజాము నుంచే ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులతో భారీ వర్షం. మధ్యలో భారీ శబ్దాలు.. అకస్మాత్తుగా ఇళ్ల మధ్యలో ఉన్న ఓ చెట్టు నుంచి మంటలు.. ఆ రోజు మనమంతా చాలా భయాందోళనకు గురయ్యాం కదా.. వర్షాకాలంలో పిడుగు పాటుకు గురై మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. చెట్లు కాలిపోతుంటాయి. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు.? అసలు.. ఈ పిడుగులేమిటి? వాటి కథేంటి? ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): పిడుగును అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉరుము.. మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి.. మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతుంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తుంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతుంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు(ఎలక్ట్రాన్లు) దగ్గరలో ఉన్న వస్తువు వైపు ప్రయాణిస్తాయి. మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణాల (విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి) నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతుంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటి వరకు మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగు పాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. అంతలోనే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. మేఘాల నుంచి పడే పిడుగుల్లో కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇవి చెట్లను, జీవులను కాల్చిబూడిద చేసేటంత శక్తిని కలిగి ఉంటాయి. సముద్రం కంటే నేలపైనే అధికంగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు మూడు రకాలుగా ఉంటాయి. మెదటిది హీట్ లైట్నింగ్, రెండోది డ్రై లైట్నింగ్. వీటి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మూడోది బాల్ లైట్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఫొటోగ్రఫీతో పిడుగు ఏ రకానికి చెందినది అనేది గుర్తించడం సాధ్యపడుతుంది. తొలిసారిగా 1847లో థామస్ మోరిస్ ఈస్టర్లీ అనే వ్యక్తి వీటిని గుర్తించాడు. (క్లిక్: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..) జాగ్రత్తలు తప్పనిసరి ► ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో భవనాలు, ఇంట్లో ఉండటం ఎంతో మంచిది. మూడు.. అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండిపోవాలి. ► పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ► నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పాందాలి. ► చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు. చెట్లు పిడుగును ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. ► ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ వంటివి ఆపేయాలి. లేని పక్షంలో పిడుగు పడినప్పుడు అధిక విద్యుత్ ప్రసరించి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. ► ఉరుములతో కూడిన వర్షం పడుతుందనే సమాచారం ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లొద్దు. ► గుంపులుగా ఉండటం కంటే..విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► పిడుగులు పడుతున్న సందర్భంలో నీటి కుళాయిల వినియోగం, స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి నిలిపివేయాలి. పైపులు, పాత్రల నుంచి అధిక విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. ► పిడుగు బారిన పడిన వారిని ముట్టుకోవడం వలన ఎటువంటి నష్టం జరగదు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. క్యుములోనింబస్ మేఘాలు ప్రమాదం క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడిన ప్రదేశంలో పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణ మేఘాలకు వర్టికల్ వేగం సెకనుకు సెంటీమీటరుగా ఉంటే, క్యుములోనింబస్ మేఘాలకు వర్టికల్ స్పీడ్ సెకను మీటర్లుగా ఉంటుంది. (క్లిక్: మామిడి తాండ్ర.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) ఉష్ణమండల ప్రాంతాల్లో అధికం ఉష్ణ మండల ప్రాంతాల్లో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది. డాప్లర్ రాడార్ సహాయంతో పిడుగులను ముందస్తుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయడం సాధ్యపడుతుంది. ప్రాణనష్టాన్ని నివారించే సాంకేతికత నేడు అందుబాటులో ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. – ఆచార్య ఓ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణశాస్త్ర విభాగం, ఏయూ -
తుఫాను దాటికి ఈడెన్ గార్డెన్స్ కుదేలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లేమో అక్కడే!
కోల్‌కతా నగరాన్ని తుఫాన్ ముంచెత్తింది. శనివారం రాత్రి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కుదేలైంది. 90 కిమీ వేగంతో వీసిన ఈదురుగాలుల దాటికి స్టేడియంలోకి ప్రెస్‌బాక్స్ అద్దాలు, పలు హోర్డింగ్స్, మైదానంలో కప్పి ఉంచిన టార్ఫులిన్ కవర్ ధ్వంసమయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షించిన స్టేడియం అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా కోల్‌కతా వేదికగానే ఐపీఎలో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 24న) గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తొలి క్వాలిఫయర్.. మే 25న(బుధవారం) ఆర్సీబీ, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్నాయి. కాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధికారులతో కలిసి ఈడెన్ గార్డెన్‌ను పరిశీలించారు. ''మ్యాచ్‌లకు మరో రెండురోజులు సమయం ఉంది. అప్పటివరకు స్టేడియాన్ని రెడీ చేస్తాం. ప్రెస్ బాక్స్‌లో పగిలిన అద్దాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వర్షం లేదు.. మాములుగానే ఉంది. మైదానంలోని టార్ఫులిన్ కవర్‌ను తొలగించి డ్రెయిన్ సిస్టం ఆన్‌చేశాం. పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో ఉంది'' అని క్యాబ్ అధికారులు తెలిపారు. కాగా వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్ విమానం కాస్త ఆలస్యంగా కోల్‌కతాకు చేరుకుంది. వాస్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో కోల్‌కతాకు రావాల్సిన విమానం.. భారీ వర్షం కారణంగా ఆటగాళ్లు ప్రయాణించిన విమానం బంగ్లాదేశ్ ఎయిర్‌స్పేస్‌లో ల్యాండ్ అయింది. వర్షం ఆగిపోయాకా రెండు గంటల ఆలస్యంగా.. అంటే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చచేరుకుంది. ఆటగాళ్లను బస్‌లో సురక్షితంగా హోటల్ రూంకు తరలించారు. ఇక క్వాలిఫయర్ -2 సహా ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. చదవండి: Jasprit Bumrah: ఐపీఎల్లో తొలి భారత బౌలర్‌గా బుమ్రా అరుదైన ఫీట్ Eden Gardens damaged after a thunderstorm #Kolkata #Edengardens pic.twitter.com/I2cXOXsCbS — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
గుడ్‌న్యూస్: నైరుతి ఆగమనం
సాక్షి,అమరావతి/చిత్తూరు అగ్రికల్చర్: అనుకున్నట్లుగానే నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగాలు, అండమాన్ సముద్ర ప్రాంతాన్ని సోమవారం రుతుపవనాలు తాకాయి. సాధారణంగా ఈ నెల 22న రుతుపవనాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారం ముందే ప్రవేశించాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపాయి. వీటి ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి. భూవాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోనూ 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకపోతే ఉక్కపోత ఉండడంతో కోస్తా ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంది. రాయలసీమలో భారీ వర్షాలు మరోవైపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి మరింతగా విస్తరించి ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, రేణిగుంట, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, తిరుమల, చంద్రగిరి, కుప్పం, ఐరాల, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కురబలకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, సుండుపల్లి, వీరబల్లి, ఆదోని, పత్తికొండ, బద్వేలు, దువ్వూరు, పోరుమామిళ్ల, సిద్ధవఠం, మైదుకూరు, రాయచోటి, సంబేపల్లె తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు నేలకూలాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అరుదూరులోని శివాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. ఇద్దరు గొర్రెల కాపర్లు మృత్యువాత వైఎస్సార్ జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. దువ్వూరు మండలంలో పిడుగుపాటుకు గొర్రెల కాపర్లు.. నల్లబోతుల హనుమంతు (56), శెట్టిపల్లె మునిరావు (32) మృతి చెందారు. గొర్రెలు మేపుకునేందుకు గుట్టకు వెళ్లిన వీరు వాన ప్రారంభం కావడంతో సమీపంలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లారు. అంతలోనే పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బద్వేలులోని సురేంద్రనగర్‌లో ఓ ఇంటిపై పిడుగు పడటంతో గృహోపకరణాలు కాలిపోయాయి. వల్లూరు మండలం తప్పెట్ల బస్టాప్ వద్ద భారీ చెట్టు వర్షానికి కూలిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అనిబిసెంట్ వీధిలో ఓ మొబైల్ దుకాణంలోకి వర్షపునీరు చేరడంతో రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ పరికరాలు నీటమునిగాయి. కోస్తాలో మోస్తరు వానలకు ఆస్కారం కాగా, వచ్చే రెండు రోజులు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల పిడుగులు పడతాయని పేర్కొంది. కోస్తా ప్రాంతంలోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
అదిగో.. పిడుగు!
సాక్షి, అమరావతి: నడి వేసవిలో పిడుగులు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పిడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి, దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు, పిడుగులు పడుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గత మూడు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడగా మంగళవారం ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు పది మంది పిడుగుపాటుతో మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ నిర్థారించింది. అన్నమయ్య, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి. ఈ మూడు నెలల్లోనే.. ఏప్రిల్, మే, జూన్ నెలలు పిడుగుల సీజన్. సంవత్సరం మొత్తం మీద 10 నుంచి 15 లక్షల పిడుగులు పడితే ఈ మూడు నెలల్లోనే 5 నుంచి 7 లక్షల పిడుగులు పడతాయి. శాటిలైట్ సమాచారం, ఇతర మార్గాల ద్వారా క్యుములోనింబస్ మేఘాలను బట్టి పిడుగుల సంఖ్యను లెక్కిస్తారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2018లో అత్యధికంగా 137 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎలా ఏర్పడతాయి? ఉత్తర భారత దేశం నుంచి వీచే పొడి గాలులు, సముద్రం నుంచి వచ్చే తడి గాలులు కలసి మేఘాలుగా ఏర్పడతాయి. నిటారుగా ఉండే వీటిని క్యుములోనింబస్ మేఘాలుగా పిలుస్తారు. అవి ఏర్పడినప్పుడు కచ్చితంగా పిడుగులు పడతాయి. ఈ మేఘాల కిందభాగంలో తడి, పైభాగంలో పొడి గాలులు ఉంటాయి. ఒక మేఘంపైన మరో మేఘం ఆవరించి ఢీ కొన్నప్పుడు తడి, పొడి గాలుల ప్రతిస్పందనకు పిడుగులు పడతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువులకు దూరంగా వెళ్లాలి. రేకు, లోహంతో చేసిన నిర్మాణాల వద్ద ఉండకూడదు. ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. కారు, బస్సులో ఉంటే అన్ని డోర్లు మూసివేయాలి. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పుడు మెడ వెనుక జుత్తు నిక్కబొడవడం లేదా చర్మం జలదరింపు ఉంటే పిడుగుపాటుకు సంకేతంగా భావించి అప్రమత్తం కావాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తల నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసివేయాలి. పిడుగుపాటు సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. స్నానం, చేతులు కడగడం, నీటిలో గడపడం చేయకూడదు. మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉంటే లోహపు భాగాలను తాకరాదు. పిడుగును గుర్తించే సెన్సార్లు ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందో హెచ్చరిస్తూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలను ముందే అప్రమత్తం చేస్తోంది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రంలో పిడుగుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 11 సెన్సార్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
వేసవిలో వర్షాలు ప్రమాదకరం.. ఈ పనులు మాత్రం చేయకండి
సాక్షి, పార్వతీపురం జిల్లా: గత నెల 17న కురుపాం మండలంలోని చాపరాయిగూడ గిరిజన గ్రామంలో పిడుగుపడి చెట్టు ఓ కొబ్బరిచెట్టు కాలిపోయింది. తాజాగా ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో ఆకాశం గర్జించింది. ఎక్కడ పిడుగులు పడుతున్నాయోనని జనం తీవ్రభయాందోళనకు గురయ్యారు. వేసవి కాలంలో కురిసే వర్షాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ కాలంలో వర్షం వచ్చే సమయంలో ఎక్కువగా ఉరుములతో పాటు పిడుగులు పడుతుంటాయి. పిడుగుపాటు బారిన పడి గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో తిరుగాడే పశువుల కాపర్లు, రైతులు, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కోసారి చెట్లు, మూగజీవాలు పిడుగుపాటుకు గురై చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని వాతావరణశాఖ ముందస్తుగానే తెలియజేస్తోంది. ఆకాశం గర్జించే సమయంలో ఆపద నుంచి గట్టెక్కాలంటే అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అని, పిడుగు ఎలా పడుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను నిపుణులు సాక్షికి వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఏం చేయకూడదంటే.. ►ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేట ప్పుడు చెట్ల కింద నిలబడడం, రైతులు పొలాల్లో ఉండడం చేయకూడదు. ►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంత కన్నా తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరం లోపు పిడుగు పడే అవకాశం ఉంది. ►మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు. ►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్ఆఫ్ చేయాలి. ►వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం కలిగిన మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2లక్షల ఓల్టులతో సమానం. పిడుగు పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. పొట్నూరు రాజీవ్, ఇస్త్రో శాస్త్రవేత ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టి తడి బట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పి రెండు కాళ్లు ఒక అడుగు పైకి ఎత్తి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి, అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమ చికిత్స చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందజేయాలి. జె.రవీంద్రకుమార్, సూపరింటెండెంట్,ఏరియా ఆస్పత్రి, పాలకొండ -
పిడుగులు పడితే రక్షించుకోవడం ఎలా? ఏం చేయాలి?
వానాకాలంలో అప్పుడప్పుడూ పలుకరించే పిడుగులతో... ఒకటి అర ప్రాణాలు పోవడం అసహజమేమీ కాదుకానీ.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో పిడుగుల బారిన పడి పదుల సంఖ్యలో మృతి వేర్వేరు ఘటనల్లోనైనా.. ఒకేరోజు ఇంత మంది చనిపోవడం అసాధారణమే. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? చేయకూడనివి ఏమిటి? అసలు... ఈ పిడుగులేమిటి? వాటి కథేమిటి? పిడుగేమిటన్నది అర్థం చేసుకోవాలంటే ముందుగా మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతూంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తూంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతూంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు (ఎలక్ట్రాన్లు) భూమివైపు ప్రయాణిస్తాయి. (ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే విద్యుత్తు అంటాం) మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణా (విద్యుత్తు స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి)ల నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతూంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటివరకూ మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగుపాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. ఇంతలోపే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. నేలపైకి దూసుకొచ్చేవే ఎక్కువ నేలపై, నదులు, సముద్రాలపై కూడా పిడుగులు పడవచ్చు కానీ.. సాధారణంగా భూమ్మీదకు చేరేవే ఎక్కువ. సముద్రతీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటీ అరవై లక్షల పిడుగుపాట్లు నమోదవుతూంటాయని అంచనా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక్క 2019లోనే దాదాపు 2,900 మంది పిడుగుపాటుకు మరణించారు. ముందుగా గుర్తించలేమా? పిడుగులను ముందుగా గుర్తించేందుకు ఇప్పటికే ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. వజ్రపథ్ పేరుతో రూపొందించిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను వాడితే మన పరిసరాల్లో పిడుగులు పడే అవకాశాన్ని ముందుగానే తెలిపి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సెన్సర్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో కనీసం నలభై నిమిషాల ముందే తెలుసుకోవచ్చు. జాగ్రత్తలు ► బహిరంగ ప్రదేశంలో ఉంటే నిటారుగా నిలుచొని ఉండటం కూడదు ► చెట్లు, చెమ్మ, నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ► గుంపులుగా ఉండటం కంటే.. విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లకండి. ► పొడవాటి చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గరలో నుంచోరాదు. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. మీకు తెలుసా? ► ఒక్కో మెరుపులో ఉండే విద్యుత్తు.. దాదాపు పది కోట్ల వోల్టులు! ► లేక్ మారాసియాబో: ప్రపంచం మొత్తమ్మీద అత్యధిక సంఖ్యలో మెరుపులు మెరిసే ప్రాంతం. వెనిజులాలో ఉంది ఇది. ఇక్కడ ఏటా 160 రోజులపాటు తుపాను గాలులు వీస్తూంటాయి. ఆయా రోజుల్లో సగటున నిమిషానికి 28 మెరుపులు.. వరుసగా 10 గంటలపాటు కనిపిస్తాయి. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకే రాత్రి దాదాపు 36 వేల మెరుపులు, వాటితో పిడుగులూ పడినట్లు వార్తలు ఉన్నాయి. ► మెరుపును కృత్రిమ పద్ధతుల్లో తొలిసారి సృష్టించింది.. నికోలా టెస్లా. ఈ కృత్రిమ మెరుపు తరువాత పుట్టిన ఉరుము శబ్ధం 15 మైళ్ల దూరం వరకూ వినిపించిందట. ► మెరుపు లేదా పిడుగు కారణంగా గాల్లో ని నైట్రోజన్.. మొక్కలు శోషించేందుకు అనువైన రూపంలోకి మారిపోతుంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
బెంగాల్లో పిడుగులు పడి 20 మంది మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సోమవారం పిడుగులు పడటంతో మూడు జిల్లాల్లో 20 మంది మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. ముర్షిదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించగా, పూర్వ మేడినిపూర్ జిల్లాలో ఇద్దరు మరణించారు. ముర్షిదాబాద్ జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారని, జంగిపూర్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో రుతుపవనాలు బెంగాల్‌ను తాకనున్న నేపథ్యంలో ఈ మెరుపులు రావడం గమనార్హం. -
Thunderstorm: పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!
సాక్షి, అమరావతి: వచ్చే వారం రోజులు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పదిరోజులుగా పిడుగుల ప్రభావం చాలాచోట్ల కనిపిస్తోంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. నిట్టనిలువుగా ఉండే ఈ మేఘాల వల్ల పిడుగులు పడుతున్నాయి. ప్రధానంగా విశాఖ మన్యం, నల్లమల అటవీ ప్రాంతాలు, ఈ సమీప గ్రామాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. సాధారణంగా ఏటా ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఈ వాతావరణం ఉండి ఇలా జరుగుతోంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఒకచోట వేడిగాలులు, మరోచోట చల్లటి గాలులు వీచి వర్షాలతో పిడుగులు పడుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఇప్పటివరకు 10 మందికిపైగా పిడుగుపాటుకు గురయ్యారు. చెట్ల కిందకు వెళ్లొద్దు పిడుగుల ప్రభావం 90 శాతం రైతులు, కూలీలు, పశువుల కాపరులపై ఉంటోంది. పొలాలు, ఆరుబయట పచ్చిక బయళ్లలో ఉండే వీళ్లు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళుతున్నారు. అలా వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లపై పిడుగులు పడి వాటి కింద ఉన్న వారు మృత్యువాతపడుతున్నారు. మూడురోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు చనిపోయిన ముగ్గురు వ్యక్తులు చెట్లకింద ఉన్నవారేనని గుర్తించారు. పిడుగు ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే చెట్ల కిందకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. ఉన్నచోటే కింద కూర్చుని చెవులు మూసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే దగ్గర్లో ఉన్న భవనాలు, రేకుల షెడ్లు వంటి వాటిల్లోకి వెళితే పిడుగుల ప్రభావం ఉండదని చెబుతోంది. విపత్తుల నిర్వహణశాఖ పిడుగుల సమాచారాన్ని నాలుగు నిమిషాల ముందే ఆయా ప్రాంతాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు, తహశీల్దార్లు, వీఆర్వోలకు పంపుతోంది. ఇందుకోసం అమెరికాలోని ఎర్త్‌నెట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అక్కడినుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి పిడుగుల హెచ్చరికలు జారీచేస్తోంది. అయినా దీనిపై రైతులు, కూలీలు, గొర్రెల కాపరులకు అవగాహన లేకపోవడం వల్ల మృత్యువాతపడుతున్నారు. వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ సూచిస్తోంది. -
ఈదురుగాలులు, వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడి ఐదుగురు మృతిచెందారు. ఈ గాలులు, వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పిడుగులు పడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. కర్నూలు జిల్లాలో మృతిచెందిన వ్యక్తి వైఎస్సార్ జిల్లాకు చెందినవారు. గాలులు, వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. గుంటూరు జిల్లాలో కళ్లాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. నెల్లూరు జిల్లాలో పసుపు పంట దెబ్బతింది. గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. చింతలచెర్వు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ధ్వజస్తంభం పీఠ భాగం పిడుగుపాటుకు దెబ్బతింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండుగంటల పాటు వర్షం కురిసింది. పిడుగుల శబ్దాలతో కొండలు ప్రతిధ్వనించాయి. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం కారణంగా గదులకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. శ్రీవారి ఆలయం ఎదుట, మాడ వీధులు, బయట రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రెండురోజుల పాటు వర్షాలు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం, అమరావతిల్లోని వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రానున్న 48 గంటల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా తనకల్లులో 5 సెంటీమీటర్లు, ఉరవకొండలో 4, కదిరిలో 2, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 3, గుంటూరు జిల్లా జంగమేశ్వరపురం, ప్రకాశం జిల్లా దర్శి, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తాడేపల్లిగూడెంలలో ఒక సెంటిమీటరు వంతున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
అకాల వర్షాలతో రైతులు లబోదిబో
(విశాఖ దక్షిణ)/పీలేరు /గంగవరం(చిత్తూరు జిల్లా)/పెదదోర్నాల/హిందూపురం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో గాలివాన హోరెత్తింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లేపాక్షి మండలంలోని కల్లూరు ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు పి.వెంకటరమణ (50) పిడుగుపాటుకు గురై మరణించగా.. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన నాగరాజ, హరిబాబు, చంద్రకళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన త్యాగరాజులు పొలం వద్ద నుంచి పాడి పశువును ఇంటికి తోలుకొస్తుండగా పిడుగు పడింది. ఈ క్రమంలో ఆవును వదిలేసి త్యాగరాజులు పరుగులు తీశాడు. అయితే ఆవు మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు కొమరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30–40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. చిత్తూరు జిల్లా ముడివేడులో 58 మి.మీ, శ్రీకాకుళం జిల్లా భామనిలో 52, అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీవో ఆఫీసు ప్రాంతంలో 50, ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 45, మార్కాపురం ప్రాంతంలో 44, అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతంలో 44, విజయనగరంలో 41 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. పాడేరులో రెండు సెంటీ మీటర్లు, చింతపల్లిలో సెంటీ మీటర్ వర్షపాతం నమోదైంది. -
గోదావరి, కృష్ణా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ⇔కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 15, 16 తేదీల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. ⇔ ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. ⇔ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలుం డటంతో.. రానున్న 24 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. విస్తరంగా వర్షాలు ⇔ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గురువారం దారాలమ్మ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ⇔ చింతూరు మండలంలో కుయి గూరు వాగు పొంగి జాతీయ రహదారి పైనుంచి ప్రవహిస్తుండటంతో 16 గ్రామాలతో పాటు ఆంధ్రా, ఒడిశా నడుమ రాకపోకలు స్తంభించాయి. ⇔ గోదావరి వరదనీరు తొయ్యేరు వద్ద రహదారి పైకి చేరడంతో దేవీపట్నంతో సహా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు భయంతో నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ⇔ కృష్ణా జిల్లాలోని మున్నేరు నది లింగాల వద్ద కాజ్‌వేకు ఆనుకుని 10 అడుగుల మేర వరదనీరు వస్తోంది. దీంతో కాజ్‌వేకు ఇరువైపులా కాపలా ఏర్పాటు చేశారు. చందమామపేటకు చెందిన పశువుల కాపరి శ్రీను మున్నేటి లంకలో ఇరుక్కున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో కాపాడారు. -
పిడుగుపాటుకు గురై 22 మంది మృతి
పాట్నా : బిహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు గత 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కె జెనమని అన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. (పెరిగిన అసోం వరదల మృతులు ) Over the next 3 days, heavy to very heavy rainfall warning has been given to Assam, Meghalaya, Arunachal Pradesh, Bihar, Sub-Himalayan West Bengal and Sikkim. There are also chances of flooding so we have informed State and the central govt: RK Jenamani, Senior Scientist, IMD pic.twitter.com/dP2BGAzUbI — ANI (@ANI) June 25, 2020 -
పాక్షికంగా దెబ్బతిన్న తాజ్ మహల్
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో విజృంభించిన వర్షం ధాటికి ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ పాక్షికంగా దెబ్బతింది. సమాధి, రెడ్ సాండ్ స్టోన్ దగ్గరి పాలరాతి రెయిలింగ్ ధ్వంసం అయిందని శనివారం ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ బసంత్ కుమార్ స్వరంకర్ తెలిపారు. సమాధి పైకప్పు కూడా చెల్లాచెదురైందని ఆయన వెల్లడించారు. ద్వారం కూడా విరిగిపోయిందని, తాజ్ మహల్ ప్రాంగణంలోని కొన్ని చెట్లు కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయి నేలకొరిగాయన్నారు. (తాజ్ మహల్ మూసివేత) కాగా గతంలోనూ తాజ్ మహల్ దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వాన వల్ల తాజ్ మహల్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పిల్లర్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీలో రానున్న రోజుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. (ప్రియురాలితో తాజ్‌మహల్ చూడాలనుకుని..) -
తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విజయవాడ : రాగల 48 గంటలలో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళఖాతంతో పాటి మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో మే 31వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కూడా ఉందని తెలిపింది. (ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం) పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది మరింత బలపడిందని వెల్లడించింది. దీంతో రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు ఒమన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41వినుండి 44వి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41° నుండి 44° నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
‘ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజ’
సాక్షి, విజయవాడ: పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూ డిపార్టుమెంట్ సెక్రటరీ ఉషారాణి తెలిపారు. నగరంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, యూనిసెఫ్ ఆధ్వరంలో ‘పిడుగు పాటు ముందస్తు సూచనలు, అవగాహన విధానాలు’పై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు ప్రకృతి విపత్తులను ఏవిధంగా ఎదుర్కొంటున్నాయని.. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లపై అనుసరిస్తున్న విధానాలపై చర్చించామని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో పిడుగుపాటుకు 25 వేల మంది చనిపోయారని ఆమె వెల్లడించారు. సాంకేతికతను వినియోగించుకుని పిడుగుపాట్లపై మండలస్థాయిలో ప్రజలను చైతన్య పరుస్తున్నామని ఉషారాణి పేర్కొన్నారు. అదేవిధంగా మోబైల్‌ఫోన్లకు సందేశాలు సైతం పంపుతున్నామని ఆమె చెప్పారు. పిడుగుపాట్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. ప్రజలు సైతం అవగాహన కలిగి ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని.. ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు యర్త్ఇన్ చేసుకోవాలని ఉషారాణి సూచించారు. గ్లోబుల్ వార్మింగ్ సైతం తగ్గించేలా చెట్లను పెంచాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని సెక్రటరీ ఉషారాణి పేర్కొన్నారు. -
పిడుగు నుంచి తప్పించుకోవచ్చు..
కారుమబ్బులు కమ్ముకుని.. భారీ శబ్దాలతో ఉరుములు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయి. ఈ పిడుగుపాటుకు ఎన్నో పశువులు, ఎందరో మనుషులు బలైపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో, చిట్లకింద ఉన్నవారే ఈ పిడుగుపాటుకు గురవుతున్నట్లు పలు ఘటనలు తెలుపుతున్నాయి. అసలు ఈ పిడుగుపాటు నుంచి రక్షించుకోవడం ఎలా? ఎక్కడ ఉంటే పిడుగు మనమీద పడకుండా ఉంటుంది? అనే విషయాలు పాఠకుల కోసం.. సాక్షి, అశ్వాపురం(ఖమ్మం) : ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుండి పగలు ఎండ, సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పిడుగులు పడుతున్నా యి. పగలు విపరీతంగా ఎండ ఉండి సాయంత్రం గాలి భీభత్సం స్పష్టిస్తోంది. ఈ నెల 18న ఒక్కరోజే పిడుగుపాటుకు జిల్లాలో టేకులపల్లి మండలంలో ఇద్దరు, బూర్గంపాడు మండలంలో ఒక రైతు, రెండు కాడెడ్లు, 13 మేకలు మృతి చెందాయి. ఇలా ఏటా పిడుగుపాటుకు ఎందరో ప్రజలతోపాటు పశువులు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. ఉరుములు, మెరుపుల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆరుబయట ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... మేఘాల్లోని రుణ, ధనావేశాల చర్యల వల్ల విద్యుత్ తరంగాలు (మెరుపులు) ఏర్పడి భూమి మీదికి ప్రసరించడాన్నే పిడుగు అంటారని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే వచ్చే ఆ మెరుపులో ఎంతో శక్తి దాగి ఉంటుందని, దానిని తాకిన అనంతరం ప్రాణాలు రెప్పపాటులో పోతాయని వారంటున్నారు. ముఖ్యంగా మెరుపులు విడుదలైనప్పుడు అవి భూమిపై ఎత్తుగా ఉండే పచ్చటి చెట్లపైనే పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో చెట్ల కింద ఉన్నవారు కూడా పిడుగుపాటుకు గురై మరణిస్తారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద ఉండొద్దు. పొలాల్లో కూడా ఉండొద్దు. పొలాల్లో ఉంటే అక్కడ ఉండే మొక్కలకన్నా మనిషే ఎత్తుగా ఉంటాడు కాబట్టి అతడిపైనే పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అరచేతులతో చెవులు మూసుకొని నేలపై మోకాళ్ల మీద కూర్చొని తల కిందకు వంచి ఉండాలి. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు దూరంగా ఉండాలి. ఎత్తైన ప్రదేశంలో ఉండకూడదు. ఉరుములు, మెరుపుల సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదు. ఈదురుగాలి, వర్షం సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగల కింద, సమీపంలో ఉండకూడదు.గుండె సంబంధిత వ్యాధి ఉన్న వారు వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు. ► ఆ సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► చేతులు కడగటం, స్నానం చేయడం, వంట సామాన్లు కడగటం, బట్టలు ఉతకడం చేయరాదు. ► కాంక్రీట్ నేలపై పడుకోవడం, గోడకు ఆనుకోవడం చేయకూడదు. ► విద్యుత్ వాహకాలు (ఇనుప తలుపులు, నీటి పైపులు) తాకకూడదు. ► కిటికీల తలుపులు మూసివేయాలి. ► చివరి ఉరుము శబ్దం విన్న తరువాత 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండాలి. ► పిడుగుపాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► పిడుగుపాటుకు గురికాగానే అంబులెన్స్‌కు, వైద్యులకు సమాచారం అందించాలి. ► పిడుగుపాటు బాధితుడిని తాకడం సురక్షితమే కాబట్టి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. ► పిడుగు తాకిన ప్రాంతం తడిగా, చలిగా ఉంటే బాధితుడి శరీరానికి నేలకు మధ్య దుప్పటి ఉంచాలి. ► ఊపిరి ఆగిపోతే నోట్లో నోరు పెట్టి ఊదాలి. ► గుండె చప్పుడు ఆగిపోతే వైద్యులు వచ్చే లోపు రెండు చేతులతో చాతి భాగాన్ని గట్టిగా ఒత్తుతూ ఉండాలి. ► బాధితుడి నాడి, శ్వాస పని చేస్తుంటే మిగిలిన అవయవాల పనితీరును పరిశీలించాలి. వచ్చేసింది వజ్రపాత్.. పిడుగు ఎక్కడ, ఎప్పుడు పడుతుందో తెలియక ప్రాణనష్టాలు జరుగుతున్నాయి. పిడుగు ఎక్కడ పడుతుందో తెలసుకునే మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. వజ్రపాత్ యాప్ ద్వారా పిడుగు ఎక్కడ పడుతుందో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌లో వజ్రపాత్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు ఏ భాష కావాలో ఎంచుకోవాలి. అనంతరం యాప్‌కు సంబంధించిన ముఖచిత్రం వస్తుంది. వజ్రపాత్ యాప్ ముఖచిత్రంపై రెండు రకాల సమాచారం వస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో పాటు పిడుగు సమాచారం వస్తుంది. ఇక్కడ నొక్కితే మనం ఉన్న ప్రాంతం మ్యాప్‌లో వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు వస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం కొద్ది సేపట్లో ఎంత దూరంలో పిడుగుపడే అవకాశం ఉందో చూపిస్తుంది. పిడుగుపడే అవకా శం ఉంటే ఎంత దూరంలో పడుతుందో పిన్ గుర్తు కనిపిస్తుంది. యాప్‌లో కుడిభాగంలో పిడుగుపాటు హెచ్చరికలు ఉంటాయి. ఇక్కడ నొక్కితే పిడుగు పడే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే సమాచారం వస్తుంది. -
యూపీలో భారీ వర్షాలు; కూలిన 133 భవనాలు
లక్నో: గత మూడు రోజులుగా భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడి కుండపోతగా కురిసిన వర్షాలకు 15 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అదే విధంగా 133 భవనాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. వాన బీభత్సంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు. కాగా లక్నోలో శనివారం నుంచి మరో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, , జార్ఖండ్, నుంచి మధ్య మహారాష్ట్ర, గోవా ప్రాంతాలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాలైన అరణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజొరాంలలో అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు అసోంను వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. -
గాలివానతో కకావికలం
సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షానికి జనం అతలాకుతలమయ్యారు. బలమైన ఈదురుగాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా అనేక గ్రామాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి, వరి, కూరగాయల పంటలు నేలపాలయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో రాళ్లవాన బీభత్సం అధికంగా ఉంది. ఈ రెండు మండలాల పరిధిలోనే 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా. ఈదురు గాలులకు తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. మామిడి తోటలూ దెబ్బతిన్నాయి. అలాగే.. జగిత్యాల, రాయికల్, కొడిమ్యాల, మేడిపెల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. పొలాల్లో ఉన్న వరి గింజలు రాలిపోయి తాలు మిగిలింది. మల్యాలలోని కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన వరదతో ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, కౌటాల మండలం సాండ్‌గాం, కుంబారి గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వడగండ్లు భారీగా పడ్డాయి. కొత్తపల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.కందుకూరు మండలంలో పౌల్ట్రీఫాం రేకులు లేచిపోయాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి, చౌటుప్పల్, మోటకొండూరు మండలాల్లో గాలివానతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ సమీపంలో పౌల్ట్రీషెడ్డు కుప్పకూలడంతో కోళ్లు మృతి చెందాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మందవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోకేశ్వరం చెరువులో రెండేళ్ల తర్వాత నీళ్లు వచ్చాయి.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాగారం కొనుగోలు కేంద్రంలోని 300 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. 500 ఎకరాల్లో వరిపంట నేల కొరగగా మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. ములుగు జిల్లా గోవిందరావుపేటలో రెండు గంటలకు పైగా గాలిదుమారం రావడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
సీమలో రేపు, ఎల్లుండి పిడుగులు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా కురవవచ్చని తెలిపింది. అలాగే రానున్న రెండు రోజులు రాయలసీమలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మరోవైపు ఈ నెల 18 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు. -
మెక్సికోకు హరికేన్ ‘విల్లా’ ముప్పు
మెక్సికో సిటీ: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన విల్లా హరికేన్ మెక్సికో వైపుగా ప్రయాణిస్తోంది. క్రమంగా శక్తిని పుంజుకుంటున్న విల్లా.. సోమవారం నాటికి(స్థానిక కాలమానం ప్రకారం) కేటగిరి–5 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది. విల్లా హరికేన్ ప్రభావంతో మెక్సికో తీరంలో ఇప్పటికే గంటకు 249 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. మెక్సికోలొని కబోకోరియంటెస్ నగరానికి నైరుతి దిశలో 315 కి.మీ దూరంలో విల్లా హరికేన్ కేంద్రీకృతమై ఉందంది. ఈ హరికేన్ మెక్సికో పశ్చిమ తీరంపై పెను ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో మెక్సికోలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 46 సెం.మీ మేర వర్షం కురవనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రవేశంతో దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బిహార్ నుంచి తెలంగాణ వరకు.. జార్ఖండ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారుగా 40 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు(ఆదివారం) కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని, సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో కూడా రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. -
రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంతో పాటు, పలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాప్రాలో అధికంగా 9 సెంటిమీటర్లు, మల్కాజ్‌గిరిలో 8సెంమీ, అంబర్‌పేటలో 2.5 సెంమీ వర్షపాతం నమోదైంది. అంతేకాక నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి, జక్రాన్ పల్లి, భీంగల్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఊరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. రాత్రి సమయంలో కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
గుంటూరు జిల్లాలో పిడుగుల వర్షం
-
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు
రాంచీ: ఉత్తర దేశాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పలు చోట్ల పిడుగులు పడి 33 మంది మృతి చెందారు. జార్ఖండ్ రాష్ట్రంలో 17 మంది మృతిచెందారు. మరో 28 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో గత రాత్రి పిడుగులు పడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. కాన్పూర్‌లో ఇద్దరు, రాయ్‌బరేలీలో మరో ఇద్దరు కూడా పిడుగుపాటుకు మృతిచెందారు. నేడు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా సోమవారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ తెలిపింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని స్కైమెట్ పేర్కొనగా మే 29న రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. అయితే నేడు నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. -
నేడు కోస్తాలో పిడుగులు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఒకపక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండగా మరోవైపు అకాల వర్షాలకు దారితీసే పరిస్థితులేర్పడ్డాయి. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అలాగే రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా రెంటచింతలలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతి, నందిగామల్లో 41, విజయవాడ, కర్నూలు, అనంతపురం, నెల్లూరుల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
తెలుగు రాష్ట్రాలకు మరోసారి పిడుగు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాలతో సతమతమౌతున్న తెలుగు రాష్ట్రాలకు వాతారణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో శనివారం భారీ వర్షాలు కురిసే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఈడెన్ వద్ద తుపాను కేంద్రం ఏర్పడిందని, నైరుతి దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని అధికారులు సూచించారు. తుఫాన్ కారణంగా సమీప ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని అన్నారు. దీని ప్రభావంతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చిరించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
గుండెల్లో పిడుగులు!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో పిడుగుల వర్షం మృత్యు గంటికలు మోగిస్తోంది. పిడుగుపాటు శబ్దం వినబడితేనే జనం కలవరపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేననిన్న పిడుగులు ఈ ఏడాది రెండున్నర నెలల్లో పడటం.. 62 మందిని పొట్టన పెట్టుకోవడంతో జనం భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఒకేరోజు (ఈనెల ఒకటో తేదీన) 41,025 పిడుగులు పడ్డాయి. కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు, చెవులు చిల్లులు పడేలా పెళపెళమంటూ పడ్డ పిడుగులతో ఈనెల ఒకటో తేదీ ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పక్షం రోజులు కూడా గడవక ముందే ఈనెల 13న పిడుగుపాట్లు మళ్లీ 13 మందిని బలితీసుకున్నాయి. ఇవి అధికారిక గణాంకాలే. అధికారుల దృష్టికి రాని మరణాలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయని అంచనా. ఈనెల మూడో తేదీన 33,700 పిడుగులు పడ్డాయని.. మళ్లీ 13న 41,100 పడ్డాయని అనధికారిక సమాచారం. అలాగే, సోమవారం నాడు మరో ముగ్గురు మరణించారు. పిడుగు పడటం అంటే.. ఒక మేఘం మరో మేఘంగానీ, ఒక మేఘంలోని అణువులుగానీ రాసుకుంటే విద్యుదాఘాతం ఏర్పడుతుంది. ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి విద్యుత్ వెళ్తే భారీ వెలుతురు కనిపిస్తుంది. దానినే మెరుపు అంటారు. విద్యుదాఘాతం ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి కాకుండా భూమివైపు రావడాన్ని పిడుగు అంటారు. ఈ సమయంలో మిలియన్ వోల్టుల విద్యుత్ ఉత్పత్తవుతుంది. ఇది కిరణంలా నేలవైపు వస్తున్న క్రమంలో ఆ మార్గం తీవ్రంగా వేడెక్కుతుంది. దీంతో గాలి పక్కకు వ్యాకోశం చెందుతుంది. అందువల్లే పిడుగు పడే సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. ఒకవేళ చెట్లపై కానీ, మనుషులపై కానీ అవి పడితే పడితే కాలిబొగ్గయినట్లు మాడిపోతారు. దీనిని బట్టే దానిలో ఎంత అధిక విద్యుత్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఆకాశం నుంచి భూమిపైకి వచ్చే సమయంలో పిడుగు అనువైన మార్గాన్ని వెతుక్కుంటుంది. అందువల్లే పిడుగు పడే దగ్గర ఎత్తయిన చెట్లు ఉంటే వాటి మీదే ఎక్కువగా పడుతుంటాయి. భూతాపం పెరగడమే కారణం పిడుగుపాట్లు పెరగడానికి భూతాపం ప్రధాన కారణమని నిపుణులు తేల్చారు. వేసవి కాలంలోనే ఇవి ఎక్కువగా పడుతుండటం ఇందుకు నిదర్శనం. ‘గాలిలో కార్బన్ డైయాక్సైడ్ 70 ఏళ్ల క్రితం 0.03 శాతం ఉండేది. ఇప్పుడిది 0.041 శాతానికి పెరిగిందని ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ నిపుణులు తేల్చారు. చెట్లు ఎక్కువగా ఉంటే కార్బన్ డైయాక్సైడ్‌ను ఇవి పీల్చుకుంటాయి. కానీ, పచ్చదనం తగ్గడంలో వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయి’.. అని రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ పురుషోత్తమ్‌రెడ్డి తెలిపారు. ఇసుక తుపాన్లకు కూడా ఇదే కారణమని ఆయన వివరించారు. ‘రకరకాల అవసరాల కోసం చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నారు. తర్వాత ఆ స్థాయిలో మొక్కలు నాటడంలేదు. అలాగే, ఎక్కువ లోతు వరకూ ఇనుము, సున్నపురాయి, గ్రానైట్ తదితర ఖనిజాలు తవ్వడంవల్ల భూగర్భ జలమట్టం కిందకు పోతుంది. ఇది కూడా భూతాపం పెరగడానికి కొంత కారణమవుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో పిడుగుపాట్లను ముందుగా పసిగట్టే పరిజ్ఞానం లేదు. కానీ, ప్రస్తుతం ఏ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందనే విషయం అరగంట ముందే తెలుసుకునే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పిడుగుల వర్షం ఆశ్చర్యకరమే రుతుపవనాలకు ముందు వేల పిడుగులు పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది అసాధారణ వాతావరణంగా అనిపిస్తోంది. కొన్నాళ్ల నుంచి అల్పపీడన ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు సముద్రం నుంచి ఎక్కువగా తేమగాలులు వీస్తున్నాయి. వాతావరణంలో అనిశ్చితి ఏర్పడుతోంది. వీటికి భూతాపం కూడా తోడవుతోంది. ఫలితంగా ఆకాశంలో అప్పటికప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ పిడుగులు పడడానికి దోహదం చేస్తున్నాయి. ఉత్తరాదిలో ఇసుక తుపానుకు కారణమవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజనుకు ముందు విస్తారంగా వర్షాలు కురుస్తాయి తప్ప ఇంతటి బీభత్సకరమైన పిడుగులు పడడం అరుదు. – రాళ్లపల్లి మురళీకృష్ణ, వాతావరణ శాఖ రిటైర్డ్ శాస్త్రవేత్త జాగ్రత్తలివీ.. - పిడుగుపాట్ల సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. విద్యుత్ నిలిపివేయాలి. - బహిరంగ ప్రదేశాల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్యకు తలను వంచి రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలి. - వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులోనే ఉండాలి. పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. - పిడుగులు పడే సమయంలో నీటిలో ఉండకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చే నీటికి తాకవద్దు. సెల్ఫోన్లు, టీవీలు ఉపయోగించవద్దు. - ఉరుములు, మెరుపుల తర్వాత కనీసం 30 నిమిషాల వరకు బయటకు వెళ్లొద్దు. -
వణికిస్తున్న ఐఎండీ తాజా హెచ్చరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలు, పిడుగులు, ఇసుక తుపానులతో వణికిపోతుండగా, వాతావరణ విభాగం తాజా హెచ్చరికలను జారీ చేసింది రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు, పిడుగులు, ఉరుములతో కూడిన గాలివానలు, దుమ్ము ముంచెత్తనుందని ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండి) తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలులు, దుమ్ముతుఫాను సంభవించవచ్చని అంచనా వేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కోస్తా, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఉరుములతో కూడిన తుఫానులు, భారీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. భారత వాతావరణ విభాగం(ఐఎండి) తాజా హెచ్చరికల ప్రకారం, మే 10 (నేడు) ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, సిక్కింలను తీవ్రమైన వడగాలులు వణికించనున్నాయి. ఉరుములతో కూడిన తుఫాను రావచ్చు. 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తర కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వీటితోపాటు విదర్భ, ఒడిశాలో కూడా అక్కడక్కడ అధిగ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి , కేరళ దక్షిణ ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయి. మే 11, 12 తేదీల్లో ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తీరప్రాంత కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్నాటక, కేరళ రాష్ట్రాలలో వేడి గాలులతో పాటు ఉరుములతో కూడిన గాలి తుఫాను సంభవించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 13న జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వేడిగాలులు, మే 14, సోమవారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రదేశాల్లో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని ఐఎండీ నివేదిక తెలిపింది. ఇటీవల కాలంలో, తుఫానులు, భారీ వర్షాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించాయి. వంద మందికి పైగా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. అలాగే జైపూర్, అజ్మీర్, జోధ్‌పూర్, బికనీర్‌లో దుమ్ము తుఫానులు సంభవించిన సంగతి తెలిసిందే. వాతావరణ విభాగం తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. దుమ్ము, తుఫాను ప్రభావాన్ని తగ్గించే అనేక జాగ్రత్తలపై దృష్టిట్టారు. -
పిడుగులు పడతాయి జాగ్రత్త..!
సాక్షి న్యూఢిల్లీ : దేశంలోని 13 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. నేడు, రేపు పలు రాష్ట్రాల్లో వందలాది పిడుగులపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తారాఖండ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరోవైపు భారీ పిడుగుల పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేడు, రేపు, ప్రభుత్వ-ప్రవేటు పాఠశాలు, కళాశాలలు మూసివేయాలని హరియాణ విద్యాశాఖా మంత్రి ఆదేశించారు. -
పొంచివున్న పిడుగుల గండం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎక్కడా వేసవి తీవ్రత కనిపించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడిచిన 24 గంటల్లో కోడూరులో 15, తిరుమలలో 10, కదిరి, ఓబులదేవరచెరువు, నూజివీడు, నల్లమడ, పాకాలల్లో 7, అవనిగడ్డ, ముండ్లమూరు, వింజమూరు, ఆళ్లగడ్డ, తిరుపతిల్లో 6, పెనగలూరు, చిత్తూరు, ముద్దనూరు, చిత్తూరుల్లో 5, బెస్తవారిపేట, చింతపల్లి, తెనాలి, పులివెందల, ధోన్, నందికొట్కూరుల్లో 4 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
ఆగని పిడుగులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా మూడో రోజైన గురువారం కూడా అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులు, వడగండ్లతో విరుచుకుపడింది. భారీ గాలులు, వడగండ్లతో భారీగా పంట నష్టం వాటిల్లింది. చెట్లు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో జనం అవస్థలు పడ్డారు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈదరు గాలులు ప్రభావం, పిడుగు పాటుకు గురువారం ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన నల్లగొండ గోపాలరావు(25), అనంతవరం గ్రామానికి చెందిన తాటిపత్రి ఏసురెడ్డి(40) పిడుగుపాటుకు బలయ్యారు. తాళ్లూరు రాఘవరెడ్డికి గాయాలయ్యాయి. గుంటూరు లక్ష్మీపురంలో రోడ్డుపై వెళుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గుంట్ల సురేష్ (27)అనే వ్యక్తిపై హోర్డింగ్ కూలిపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పెనుగాలులకు చెట్టు కూలిన సంఘటనలో కర్నూలు నరసింహారెడ్డి నగర్ చెందిన నరసింహ (11) అనే బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతాండాలో పిడుగుపాటుతో పరమేష్ నాయక్(28)అనే యువకుడు మృతిచెందాడు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం చెన్నుపల్లిలో పిడుగుపాటుకు కుమ్మరి అంజమ్మ అనే మహిళ మృతి చెందింది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో నాలుగు ఇళ్లు కూలిపోగా ఒక మహిళ సహా ముగ్గురు గాయపడ్డారు. జనజీవనం అస్తవ్యస్తం వర్ష బీభత్సంతో పలు జిల్లాల్లో గురువారం జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి విశాఖపట్నం సిటీతో పాటు జిల్లావ్యాప్తంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బీచ్ రోడ్లో ఉదయం పూట రాకపోకలు స్తంభించిపోయాయి. జీవీఎంసీ కార్యాలయం ముంపునకు గురైంది. విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో కేజీహెచ్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేజీహెచ్ చిన్న పిల్లల వార్డులోకి మోకాళ్ల లోతు వర్షం చేరడంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. విజయనగరం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. గుంటూరు నగరంలో దుమ్ముతో కూడిన గాలికి ప్రజలు చెల్లాచెదరు అయ్యారు. కర్నూలు జిల్లా పాణ్యంలో గాలుల తీవ్రతకు షెడ్డు కూలిపోవడంతో కోళ్లు మృతి చెందాయి. చిత్తూరు జిల్లా తిరుపతి, పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతి గోవిందరాజ సత్రం ప్రాంతమంతా జలమయమైంది. పెనుగాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం రైల్వే విద్యుత్ లైన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సింగరాయకొండ రైల్వేస్టేషన్లో తిరుపతి వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును గంటన్నర పాటు ఆపేశారు. విజయవాడ వెళ్లాల్సిన పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను కావలి రైల్వేస్టేషన్లో ఆపేశారు. రాత్రి 7.30 గంటల వరకు ఈ పరిస్థితి కొనసాగింది. వరుస వర్షాలతో పంట నష్టం అపారం వరుసగా మూడో రోజు అకాల వర్షాలు ముంచెత్తడంతో పలు జిల్లాల్లో పంట నష్టం భారీగా వాటిల్లింది. రాష్ట విపత్తు నిర్వహణ శాఖకు గురువారం సాయంత్రానికి అందిన ప్రాథమిక అంచనా ప్రకారం 14,458 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు గ్రామాల్లో పొలాలవారీగా నష్టాన్ని పరిశీలించి నివేదికలు పంపేసరికి నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనధికారిక సమాచారం ప్రకారం 35 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో మామిడి కాయలు నేలపాలవ్వగా, అరటి చెట్లు కూలిపోయాయి. విజయనగరం జిల్లాలో సుమారు 2వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. వేయి ఎకరాల్లో మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. కృష్ణా జిల్లాలో 1800 ఎకరాల్లో మొక్కజొన్న, 150 ఎకరాలు పసుపు, 1200 ఎకరాల్లో మామిడి, 250 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, పసుపు నీట మునగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పీలేరు, చంద్రగిరి ప్రాంతాల్లో సుమారు 200 హెక్టార్ల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో బొప్పాయి తోటల్లో కాయలు రాలిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, పొన్నూరు, కొల్లూరు మండలాల్లో వందల ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. రొంపిచర్ల మండలంలో కోసిన వరి పంట వందల ఎకరాల్లో నీట మునిగింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని కొనుగోలు కేంద్రాల్లో శనగలు, మినుమలు తడిసి పోయాయి. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మామిడి, అరటి, బొప్పాయి పంటలు నేలలి రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. నేడు ఉరుములతో కూడిన వర్షం! – బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు సాక్షి, అమరావతి: రాబోయే 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో విదర్భ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా వద్ద మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం గురువారం రాత్రి ప్రకటించింది. ఉపరితల ఆవర్తనాలకు క్యుములోనింబస్ మేఘాలు తోడు కావడంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుల వర్షం కురుస్తోంది. ఇదే పరిస్థితి మరో 24 గంటలు కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, కొన్ని చోట్ల వడగండ్లుతోపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల వడగండ్లు, పిడుగులు పడతాయి’ అని ఐఎండీ వివరించింది. -
2 గంటలు ఆగమాగం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంపై గురువారం క్యుములోనింబస్ మేఘాలు విరుచుకుపడ్డాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో రెండు గంటల పాటు బీభత్సం సృష్టించాయి. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఆవహించడంతో మధ్యాహ్నమే కారుచీకట్లు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య నగరంలోని చాలా ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగులు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతోపాటు కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో స్వల్ప పరిమాణంలో ఉన్న వడగళ్లు కురిశాయి. సుమారు 200 వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద మోకాళ్లలోతున వరదనీరు నిలిచింది. రెండు గంటల్లో సగటున 2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మొత్తం గా 3 సెం.మీ. వాన పడిందని అంచనా. స్తంభించిన ట్రాఫిక్ ప్రధాన రహదారులపై హోర్డింగ్‌లు, చెట్లు కూలిపడటం, రహదారులపై వర్షపు నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉద్యోగులు, మహిళలు, ప్రయాణికులు, వాహన చోదకులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఖైరతాబాద్‌లో రైల్వే విద్యుత్ లైన్‌పై హోర్డింగ్ ఫ్లెక్సీ చిరిగి పడింది. దానిని గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. గాలివానకు కారణాలివే.. విదర్భ–ఛత్తీస్‌గఢ్–తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవహించి.. ఉపరితల ద్రోణి ఏర్పడటంతోపాటు బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఉధృతంగా ఏర్పడి గాలివాన కురిసిందని బేగంపేటలోని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు వెల్లడించారు. దాదాపు రెండు గంటల వ్యవధిలోనే నగరంలో గాలివాన బీభత్సం సృష్టించిందన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటం, గాలిలో తేమ అధికంగా ఉండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని తెలిపారు. వచ్చే 24 గంటల్లోనూ హైదరాబాద్‌లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. గాలివాన బీభత్సం సృష్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గాలివాన బీభత్సం ఇలా.. అబిడ్స్ పరిధిలోని జియాగూడ, పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, పాన్‌మండీ, గోషామహాల్ రహదారి, బారాదరి, హిందీ నగర్, గోషామహాల్ చౌరస్తా, మాలకుంట, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకూలడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పాన్‌మండీ నుంచి గోషామహాల్ చౌరస్తా వరకు పోలీస్ క్వార్టర్స్ దారిలో ఉన్న చెట్లు విరిగిపడడంతో హిందీ నగర్ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. అలాగే ఇదే ప్రాంతంలోని భారీ చెట్టు కూలిపడటంతో ఓ ఇంటి ప్రహరీగోడ ధ్వంసమైంది. హిందీ నగర్ రహదారిలో పెద్ద చెట్టు విరిగిపడడంతో ఒక ఆటో ట్రాలీ ధ్వంసమైంది. కార్ఖానాలో పరిధిలోని వాసవినగర్ సమీపంలోని పద్మజకాలనీ నీట మునిగింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. గృహలక్ష్మి కాలనీలో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నాలుగో వార్డు బుసారెడ్డిగూడ, పికెట్‌లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మారేడుపల్లి పరిధిలో ప్రధాన రహదారులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. కాలనీ వాసులే మ్యాన్ హోల్స్ మూతలను తెరిచి నీటిని పంపించారు. పాత బస్తీలోని ఇంజన్‌బౌలి, ఫలక్‌నుమా, భవానీనగర్, జంగంమెట్ తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జంగంమెట్ వార్డు కార్యాలయానికి ఎదురుగా పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇంజన్‌బౌలిలో చెట్టు కూలిపడటంతో ఒక ఆటో, చెరుకు రసం బండి ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆస్పత్రి, మెడికల్ కాలేజీల ప్రాంగణాల్లోని చెట్లు నేలకూలాయి. అత్యవసర విభాగం వద్ద భారీ వృక్షం విరిగి పక్కనే ఉన్న పోలీసు ఔట్‌పోస్ట్‌పై పడింది. ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. ఈసీఐఎల్ చౌరస్తా, హెచ్‌బీకాలనీ రాజీవ్ పార్కు సమీపంలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. బండ్లగూడలో 4.3 సెంటీమీటర్లు క్యుములోనింబస్ మేఘాల కారణంగా గురువారం నగరంలోని బండ్లగూడ ప్రాంతంలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్‌లో 3.5, నారాయణగూడలో 3.4, రాజేంద్రనగర్‌లో 3.1 సెంటీమీటర్ల వర్షం పడింది. గాలివానకు ఇద్దరు బలి.. గురువారం ఉరుములు మెరుపులతో కురిసిన గాలివాన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురిని బలితీసుకుంది. ఇక్కడి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని అంజిరెడ్డినగర్కాలనీకి చెందిన ఇంద్రావత్ అఖిల్ (7) గురువారం మధ్యాహ్నం సమీపంలోని చింతచెట్టుకు ఉయ్యాల కట్టుకుని ఊగుతున్నాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో మృతి చెందాడు. ఇక ఆరాంఘర్ ప్రాంతంలో ఈదురు గాలుల తీవ్రతకు ఓ పాత ఇనుప సామాను గోదాం గోడ కూలడంతో పరశురాం అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గా>యపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గం గా«ంధీనగర్ డివిజన్లోని వి.వి.గిరి నగర్లో గాలివాన బీభత్సానికి రేకుల షెడ్డు కూలిపడి.. పి.డానియేల్ (50), ఆయన ఇద్దరు కుమారులు దీపక్ (13), చరణ్ (9)లు గాయపడ్డారు. పక్కనే మరో ఇంటిపై ఉన్న రేకుల షెడ్డు కూలడంతో మురుగన్రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు వర్షాలు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, విదర్భ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని.. అటు విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి నెలకొని ఉందని పేర్కొంది. వీటి కారణంగా తెలంగాణలో శుక్రవారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వడగళ్ల వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. శని, ఆది వారాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. -
గుంటూరు జిల్లాలో వర్షబీభత్సం, ఏడుగురి మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు జిల్లాల్లో ఆరుగురు వ్యక్తులు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు. కోట్లాది రూపాయాల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం, పుసులూరు గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. సీతారపు మాధవి(35), కొండేపాటి వెంకట్రావు(50) పొలంలోని మిర్చి కల్లంలో పట్టలు కప్పుతుండగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఉరుముల శబ్దానికి తాడికొండ మండలంలో కశమ్ కుమారి(55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో పొలం నుంచి తిరిగి వస్తుండగా పిడుగుపడి వేజెండ్ల రత్నకుమారి(40) చనిపోయారు. సత్తెనపల్లి మండలం, పెదమక్కెనలో గుంటుపల్లి గోపి(26) పిడుగుపాటుకు మృతి. రాజుపాలెం గ్రామంలో గేదెల కాపరి జె.గోపి అనే పిల్లవాడిపై పిడుగు పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గంవ్యాప్తంగా ఈదురు గాలులకు 8 పూరిళ్లు, రేకుల షెడ్లు నేలకూలాయి. పెదకాకాని మండలం వెనిగండ్లలో పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు పసుపులేటి శ్రీనివాసరావు, తోట అంకమ్మరావులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళగిరి నియోజకవర్గంలో 450 ఎకరాల్లో అరటి పంట నేల కూలి 4.25 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. పొన్నూరు నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో నీట మునిగిన మొక్కజొన్న 2కోట్ల మేర ఆస్తి నష్టం. మిర్చి యార్డులో సుమారు 1.50 మిర్చి బస్తాలు నీట మునిగాయి. -
రాయలసీమ వాసులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం : తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడుల మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో దాని ప్రభావంవల్ల రానున్న రెండు రోజులపాటు రాయలసీమ, ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం నుంచి అకాల వర్షాల ప్రభావం తగ్గుతుందని తెలిపింది. గడచిన 24 గంటల్లో ఉదయగిరిలో 5, వెలిగండ్లలో 4, మార్కాపూర్, కడప, ప్రొద్దుటూరుల్లో 3, రాజంపేట, పుల్లంపేట, నంబూరి పులికుంట్ల, కుప్పం, కమలాపురంలలో 2 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
తెలంగాణలో పిడుగులు తీసిన ప్రాణాలు
-
కొత్తగూడెంలో గాలి,వాన బీభత్సం
కొత్తగూడెం : జిల్లాను శుక్రవారం భారీ గాలి, వాన కుదిపేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు వృక్షాలు కూలిపోయాయి. మున్సిపాలిటీ 29 వ వార్డులో గాలివాన బీభత్సానికి భారీ వృక్షం నేలకూలి విద్యుత్ తీగలపై పడటంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ లైన్ల కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రైటర్‌బస్తీలో గోడ కూలడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. లక్ష్మీదేవిపల్లిలో మరో భారీ మర్రి వృక్షం హోటల్‌పై కూలడంతో ఒకరికి గాయాలయ్యాయి. రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పంటపొలాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది. ఎర్రగుంట శాంతినగర్‌కు చెందిన మంద దుర్గమ్మ(50) అనే మహిళపై పిడుగు పడటంతో మృతిచెందింది. చిన్నలక్ష్మి అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. -
తడిసి ముద్దయిన రాజధాని న'గరం'!
న్యూఢిల్లీః నిన్నమొన్నటిదాకా నిప్పులు కురిపించిన దేశ రాజధాని నగరం ఢిల్లీ.. తడిసి ముద్దయింది. నల్లని మబ్బులతో చల్లని గాలులతో వచ్చిన వానజల్లులకు వాయువ్య, నైరుతి ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ప్రజలు పులకించిపోయారు. వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరునుంచి సాధారణ వర్షాలు అనేక ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వానజల్లులతో రాజధాని నగరం తడిసిముద్దయింది. వచ్చే 24 గంటల్లో వాయువ్య , నైరుతి ఢీల్లీ ప్రాంతాల్లోని జింద్, పానిపట్, గానౌర్, కర్నాల్, రోహ్తక్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం, తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అలాగే బాగాదుర్గర్, ఝజ్జర్, ఐజిఐ విమానాశ్రయం, కోస్లీ, హసన్ పూర్ ప్రాంతాల్లో కూడ వచ్చే రెండు మూడ గంటల్లో వర్ష సూచన ఉన్నట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని వాతావరణం సుమారు 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో సాధారణ మబ్బులతో కూడి ఉందని, ఈ కాలంలో ఉండాల్సిన కంటే సగటున రెండు డిగ్రీలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. గరిష్ణ ఉష్ణోగ్రత సుమారు 39 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఉదయం 8.30 గంటల సమయంలో వాతావరణంలో తేమ 60 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
సిటీ మొత్తం.. చీకటి మయం!
గురువారం అర్ధరాత్రి 3.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు విపరీతమైన గాలి.. జోరు వాన. దీంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. పెద్దపెద్ద చెట్లు కూడా కూకటివేళ్లతో లేచిపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి.. విద్యుత్ లైన్లపై పడటంతో ఎక్కడికక్కడ ఫీడర్లు ట్రిప్పైపోయాయి. ఫలితంగా శుక్రవారం రాత్రి 3.30 గంటల నుంచి తెల్లవారే వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తిగా చీకట్లు రాజ్యమేలాయి. ఉదయం 8.30 గంటల వరకు 60 శాతం ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్ధరించగా, మరో 40 శాతం ఫీడర్ల పరిధిలో సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా లేదు. రోజంతా కరెంటు లేక మంచినీటి సరఫరా నిలిచిపోయింది. చాలాచోట్ల హాస్టళ్లలో కూడా ఓవర్ హెడ్ ట్యాంకులలో నీళ్లు లేకపోవడంతో స్నానాలు, కాలకృత్యాలకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అపార్టుమెంట్లలో లిఫ్టులు పనిచేయకపోవడంతో.. ఫ్లాట్లలో, ముఖ్యంగా పై అంతస్తులలో ఉండేవాళ్లు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. స్నానం చేయడానికి నీరు కూడా లేక చాలామంది ఆఫీసులకు సెలవులు పెట్టి ఇంటికే పరిమితం అయ్యారు. ఛార్జింగ్ లేక సెల్ఫోన్లు మూగపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిన ట్రాన్స్‌కో డీఈ, ఏడీఈ, ఏఈ, లైన్మెన్లు సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. పడిపోయిన డిమాండ్ ఈదురుగాలి దెబ్బకు గచ్చిబౌలి, రామచంద్రాపురం, మాదాపూర్, ఆసిఫ్‌నగర్, శివరాంపల్లి, బాలానగర్, మియాపూర్‌లోని 220 కేవీ లైన్లు హ్యాంగై సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల భద్రత కోసం అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతటా సమన్వయ లోపం ట్రాన్స్‌కో, డిస్కం అధికారులకు మధ్య సమన్వయ లోపం వినియోగదారుల పాలిట శాపంగా మారింది. 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు, లైన్లను ట్రాన్స్‌కో చూస్తుండగా, 33 కేవీ, 11 కేవీ లైన్లను డిస్కం చూస్తుంది. అనుకోని విపత్తులు సంభవించినప్పుడు రెండు శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. కానీ వారి మధ్య సమన్వయ లోపం శుక్రవారం స్పష్టమైంది. -
ఏపీపై పిడుగుపాటు
- రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు - ఆదివారం ఒక్కరోజే 10 మంది దుర్మరణం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు రైతులకు ఆనందాన్నిస్తుండగా, మరో వైపు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం భారీ వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులుపడి 10 మంది మృతి దుర్మరణం చెందారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఐదుగురు పిడుగుపాటుకు బలయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి మత్స్యకారులుగా జీవిస్తున్న తండ్రికొడుకులు.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకుగురై మృత్యువాతపడ్డారు. చిల్లకూరు మండలం కోరువారిపాలెం వాసి ఉప్పుర వెదరయ్య, వరికుంటపాడు మండలం తొడుగుపాడుకు చెందిన నాగేశ్వరరావులు మరణించారు. ఇటు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆదివారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు. వేములకోట గ్రామంలో బోరు వేస్తుండగా పిడిగుపడి బీహార్‌కు చెందిన సతీష్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. తుర్లపాడు మండలం గానుగపెంట గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడులో పిడుగుపాటుకు వ్యక్తి మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి. తుళ్లూరు మండలం వడ్లమానులో పిడుగుపడి పొలంలో పనిచేస్తున్న శివరాంబాబు అనే వ్యక్తి మృతి చేందాడు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కోనపురాజుపరవలో గిరి, గుంజాల జంగులు అనే మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇవేకాకుండా వరదల ధాటికి గోడకూలడంతో నెల్లూరు నగరంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇటు తెలంగాణలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
‘పిడుగు’ విషాదం
యలమంచిలి / రాంబిల్లి / ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: యలమంచిలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పిడుగులు బీభత్సం సృష్టించాయి. యలమంచిలి, రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో పిడుగులుపడి ఆరుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు మహిళా కూలీలు, ఒకరు రైతు. వరినాట్లు వేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెద్దాడ రాజు (35) గ్రామంలోని ఇత్తంశెట్టి గంగరాజు అనే రైతు పొలంలో వరినాట్లు పనికి వెళ్లింది. చినుకులు పడుతున్నాయని ఐదుగురు కూలీలు పొలంలోనుంచి బయటకు వస్తుండగా పెద్దాడ రాజుపై పిడుగుపడింది. తలపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె వెనుక ఉన్న చీపురుపల్లి చెల్లయ్యమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ఈమెను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఎస్.రాయవరం మండలంలో... రెండు గ్రామాల్లో ఇద్దరు మృతి చెందడంతో ఎస్.రాయవరం మండలవాసులు కలవర పాటుకు గురయ్యారు. జేవిపాలెం గ్రామానికి చెందిన కట్టుమూరి పెదమల్లయ్య(60) పొలంలో పారపని చేస్తుండగా పిడుగుపడి అక్కడిక్కడే మృతి చెందాడు. కొత్త సోమిదేవపల్లికి చెందిన భీమరాజు సత్యవతి(38) వరినాట్లు వేసేపనికి పేటసూదిపురం వెళ్లింది. వర్షం పడుతున్నదని పొలంలో నుంచి ఒడ్డుకు పరుగెడుతుండగా తలపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా కూలీలు, రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు. సత్యవతి,పెదమల్లయ్య కుంటుంభ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దిమిలిలో విషాదం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళా కూలీల మృతితో రాంబిల్లి మండలం దిమిలిలో విషా దం అలుముకుంది. మండలంలోని కట్టుబోలు రెవెన్యూ పరిధిలో వరినాట్లు వేస్తుండగా పిడుగుపాటుకు సిగిరెడ్డి కళావతి (35), సిగిరెడ్డి అమ్మాజీ (40), నగిరెడ్డి దేవుడమ్మ (58) అక్కడికక్కడే మృతి చెందారు. మాదాటి వెంకటలక్ష్మి అపస్మారక స్థితికి చేరింది. ఆమెను యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరిది దిమిలి గ్రామం. మృతుల్లో కళావతి, అమ్మాజీ తోటి కోడళ్లు. మృతులు ముగ్గురూ నిరుపేద వ్యవసాయ కూలీలు. అమ్మాజీకి పదేళ్ల కుమారుడితో పాటు భర్త ఉన్నారు. దేవుడమ్మకు వివాహమైన కుమార్తె ఉంది. కళావతికి పిల్లలు లేరు. సంఘటన స్థలంలో మృతదేహాలు ఉన్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. యలమంచిలి సీఐ కె.రామారావు, రాంబిల్లి ఎస్.ఐ. వి.కృష్టారావు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ. తెలిపారు. -
పిడుగుల విధ్వంసం
కౌటాల/రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో మంగళవారం పిడుగులు విధ్వంసం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కౌటాల మండలంలో విద్యార్థి, మహిళ మృతి చెందగా, రామకృష్ణాపూర్లో సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. కౌటాల మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి హుల్కె వినోద్(18) తమ పంటచేనులో మంగళవారం ఉదయం అరక పట్టడానికి వెళ్లాడు. సాయంత్రం వర్షం కురియడంతో పంట చేనులో నుంచి పశువులతో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వినోద్ బాబాసాగర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కామాటి హుల్కె బాపు-కమల మూడో కుమారుడు. ఈయన మండల కేంద్రంలోని కళాశాలలో బీకాం చదువుతున్నాడు. కాగా విద్యార్థి మృతితో విషాదం అలుముకుంది. అలాగే కౌటాల మండలం బోదన్పల్లి గ్రామానికి చెందిన యశోధ(45) తమ చేనులో పనిచేస్తుండగా మంగళవారం పిడుగుపాటుకు గురై మృతిచెందింది. ఉదయం పనులకు వెళ్లగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగు వేయడంతో చేనులోనే మృతిచెందింది. యశోధకు భర్త బాపు, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురుడుపేట గ్రామంలో నగోసె చంద్రయ్య అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగుపాటుతో చనిపోయింది. అలాగే రామకృష్ణాపూర్‌లోని ఆర్కే-1ఏ గని సమీపంలోని పాలవాగు వంతెన వద్ద మంగళవారం పిడుగుపాటుకు గురై సట్టు సాంబయ్య(52) అనే సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో టింబర్‌మెన్‌గా పనిచేసే సాంబయ్య రెండో షిఫ్టు విధులకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో పాలవాగు వంతెన పక్కనే గల చెక్‌పోస్టు కిందకి వెళ్లాడు. చెక్పోస్ట్పైనే పిడుగు పడటంతో దానికిందే ఉన్న సాంబయ్య అక్కడే మృతిచెందాడు. పట్టణంలోని పోచమ్మబస్తీలో నివాసముండే సాంబయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగులు పడటంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు
జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడటంతో బుధవారం నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.. చేనులో పనులు చేస్తుండగానే జోరువాన, ఉరుములు, మెరుపులతో కూడిన శబ్దం రావడం, ఒక్కసారిగా పిడుగు పడటంతో చేనులోనే విగతజీవులుగా మారారు..! సారంగాపూర్ మండలం జామ్‌లో దంపతులు ఎనుగంటి బొర్రన్న(45)-ముత్తవ్వ(40), ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మ్యాకల కళ(38) ఆమె భర్త, కొడుకు చూస్తుండగానే కన్నుమూశారు.. జైనథ్ మండలం సావాపూర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి పాటిల్ గౌతమ్(22) తల్లి చూస్తుండగానే ప్రాణాలు వదిలారు.. సారంగాపూర్/ఆదిలాబాద్ రూరల్/జైనథ్ : సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన ఎనుగంటి బొర్రన్న(45), ఆయన భార్య ముత్తవ్వలు బుధవారం సాయంత్రం తమ చేనులో పిడుగు పాటుకు గురై మృతిచెందారు. వీరితోపాటు వారు అపురూపంగా పెంచుకుంటున్న గొర్రె కూడా మృతిచెందింది. జామ్ గ్రామానికి చెందిన ముత్తన్న-సాయమ్మ దంపతులకు ఏకైక కుమారుడైన బొర్రన్నకు ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. అయినా తల్లిదండ్రులను చూసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా రోజూ మాదిరిగానే దంపతులిద్దరూ తమకున్న ఎకరం పత్తి చేనులో క లుపు తీయడానికి వెళ్లారు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో వారితోపాటే గొర్రెను వెంట బెట్టుకుని చేను దగ్గరే ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లారు. వర్షం జోరందుకోవడం.. పిడుగు పడటంతో బొర్రన్న, ముత్తవ్వ అక్కడికక్కడే చనిపోయారు. గొర్రె కూడా మృతిచెందింది. స్థానికుల సమాచారం మేరకు తహశీల్దార్ గంగాధర్, ఆర్ఐ పాండు, వీఆర్వో సురేందర్ సంఘటనా సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం చేయించాలని ఏఎస్సై భూమన్నకు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుండెలవిసేలా రోదించిన వృద్ధ దంపతులు ముత్తన్న, సాయమ్మలకు ఒక్కడే కుమారుడు కావడం, వీరికి పిల్లలు లేకపోవడంతో ఇద్దరు వృద్ధ దంపతులు దిక్కులేని వారయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో గుండెలవిసేలా రోదించారు. తమకు తలకొరివి పెట్టేవారెవరని రోదించిన తీరు గ్రామస్తులను కంట తడి పెట్టించింది. వృద్ధాప్యంలో ఆదుకుంటాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోవడం తో ‘దేవుడా నీకేం పాపం చేశాం.. వారికి పిల్లల ను ఇవ్వలేదు. ఇప్పుడు మేమెందుకు బతకాలి’ అంటూ రోదించిన తీరు కలచివేసింది. భార్య మృతి.. భర్తకు గాయాలు.. ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మ్యాకల కళ, ఈమె భర్త స్వామి, వీరి కుమారుడు వినోద్, దూరపు బంధువు రాంసం సుశీల బుధవారం ఉదయం పత్తి చేను పనులకు వెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వీటిని మధ్యాహ్నం 2 గంటల వరకు ఏరివేశారు. అనంతరం అందరూ కలిసి మూడు గంటల వరకు భోజనం చేసి మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యారు. నాలుగు గంటలకు వర్షం మొదలైంది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ పిడుగు పడింది. దీంతో చేనులోనే కళ అక్కడికక్కడే మృతిచెందింది. స్వామి, సుశీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమయంలో వినోద్ గడ్డిమోపు కోసం వెళ్లడంతో ప్రమాదం తప్పింది. వినోద్ ఒక్కసారిగా బీతావాహ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడు అయ్యాడు. తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆయన రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కళ కూలీ పనిచూస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గాయపడ్డ వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. దీంతో లాండసాంగ్వి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేను పనులకు ఆసరాగా వెళ్లిన డిగ్రీ విద్యార్థి మృతి జైనథ్ మండలం సావాపూర్ గ్రామానికి చెందిన త్రయంబక్-రేవతిలకు ఇద్దరు కుమారుడు, ఒక కూతురు ఉంది. పెద్ద కుమారుడు రతన్ ఐకేపీ లో జైనథ్‌లో సీఏగా పనిచేస్తున్నాడు. కూతురు ప్రతిభ ఇంటర్ చదువుతోంది. చిన్నవాడైన గౌ తం ఆదిలాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయంగా ఉం టాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తల్లి, ముగ్గురు కూలీలతో కలిసి ఆకుర్ల గ్రామ శివార్లలోని తాము కౌలుకు తీసుకున్న చేనులో కలుపు మొక్కలు తీయడానికి వెళ్లాడు. సాయంత్రం నా లుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా జోరువాన కురిసింది. దీంతో మేఘాలు కమ్ముకోవడంతో వారంతా దగ్గరలో ఉన్న చెట్ల కిందికి పరుగెత్తారు. రేవతి, ముగ్గురు కులీలు ఒక చెట్టు కింద నిలబడగా, గౌతమ్ ఒక్కడే కొంత దూరం లో ఉన్న మోతుకు చెట్టు కింద తలదాచుకున్నా డు. నాలుగున్నరకు ఒక్కసారిగా పిడుగు పడి గౌతమ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అతని సెల్ ముక్కలవగా, బట్టలు, శరీరం కాలి పోయాయి. పక్కనే ఉన్న తల్లి, కూలీలు ఏమైం దని తేరుకునే లోపే గౌతమ్ తుదిశ్వాస విడిచాడు. కూలీలు బిగ్గరగా అరుస్తూ పరుగెత్తారు. తల్లి కొడుకు మృతదేహంపై రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. అంతలోనే స్పృహ కోల్పోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్సై గంగారాం సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తేలిపారు.