తడిసి ముద్దయిన రాజధాని న'గరం'!
న్యూఢిల్లీః నిన్నమొన్నటిదాకా నిప్పులు కురిపించిన దేశ రాజధాని నగరం ఢిల్లీ.. తడిసి ముద్దయింది. నల్లని మబ్బులతో చల్లని గాలులతో వచ్చిన వానజల్లులకు వాయువ్య, నైరుతి ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ప్రజలు పులకించిపోయారు. వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరునుంచి సాధారణ వర్షాలు అనేక ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
వానజల్లులతో రాజధాని నగరం తడిసిముద్దయింది. వచ్చే 24 గంటల్లో వాయువ్య , నైరుతి ఢీల్లీ ప్రాంతాల్లోని జింద్, పానిపట్, గానౌర్, కర్నాల్, రోహ్తక్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం, తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అలాగే బాగాదుర్గర్, ఝజ్జర్, ఐజిఐ విమానాశ్రయం, కోస్లీ, హసన్ పూర్ ప్రాంతాల్లో కూడ వచ్చే రెండు మూడ గంటల్లో వర్ష సూచన ఉన్నట్లు భావిస్తున్నారు.
మంగళవారం ఉదయం ఢిల్లీలోని వాతావరణం సుమారు 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో సాధారణ మబ్బులతో కూడి ఉందని, ఈ కాలంలో ఉండాల్సిన కంటే సగటున రెండు డిగ్రీలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. గరిష్ణ ఉష్ణోగ్రత సుమారు 39 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఉదయం 8.30 గంటల సమయంలో వాతావరణంలో తేమ 60 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.