న్యూఢిల్లీ: ఈ ఏడాది చలికాలం ప్రారంభానికి ముందే రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగింది. రాజధానిలో గాలి నాణ్యత వరుసగా రెండో రోజు ‘పూర్’ కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీపీబీ) తెలిపిన వివరాల ప్రకారం దసరా తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224 కు చేరుకుంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఈ ఏడాది కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రాప్-1ని నేటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవి నేటి నుంచి(మంగళవారం) నుంచి అమలు కానున్నాయి. గ్రాప్-1 దశలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని పరిమితం చేయడం, రెస్టారెంట్లలో బొగ్గు లేదా కట్టెల వినియోగాన్ని నిషేధించడం వంటివి ఉంటాయి. నగరంలో ఏక్యూఐ 200 దాటినప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు.
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే గాలి నాణ్యత క్షీణతను నిరోధించడానికి అమలు చేసే విధానం. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత ఆధారంగా గ్రాప్ విధానాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో ఢిల్లీకి 300 కి.మీ. పరిధిలో కాలుష్యం కలిగించే పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటారు. రెండవ దశలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో సీఎన్‌జీ/ఎలక్ట్రిక్ బస్సు మెట్రో సేవలను ప్రోత్సహిస్తారు.
మూడవ దశలో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్‌లలో పెట్రోల్‌తో నడిచే బీఎస్-3 ఫోర్-వీలర్లు, డీజిల్‌తో నడిచే బీఎస్-4 ఫోర్-వీలర్ల వినియోగాన్ని నిషేధించనున్నారు. నాల్గవ దశలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను నిషేధిస్తారు. పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బందికి ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
ఇది కూడా చదవండి: రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment