గుండెల్లో పిడుగులు! | 2.15 lakh Thunderbolt killed 62 people within two and a half months in the state | Sakshi
Sakshi News home page

గుండెల్లో పిడుగులు!

Published Tue, May 15 2018 2:36 AM | Last Updated on Tue, May 15 2018 9:02 AM

2.15 lakh Thunderbolt killed 62 people within two and a half months in the state - Sakshi

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో పిడుగుల వర్షం మృత్యు గంటికలు మోగిస్తోంది. పిడుగుపాటు శబ్దం వినబడితేనే జనం కలవరపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేననిన్న పిడుగులు ఈ ఏడాది రెండున్నర నెలల్లో పడటం.. 62 మందిని పొట్టన పెట్టుకోవడంతో జనం భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఒకేరోజు (ఈనెల ఒకటో తేదీన) 41,025 పిడుగులు పడ్డాయి. కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు, చెవులు చిల్లులు పడేలా పెళపెళమంటూ పడ్డ పిడుగులతో ఈనెల ఒకటో తేదీ ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పక్షం రోజులు కూడా గడవక ముందే ఈనెల 13న పిడుగుపాట్లు మళ్లీ 13 మందిని బలితీసుకున్నాయి. ఇవి అధికారిక గణాంకాలే. అధికారుల దృష్టికి రాని మరణాలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయని అంచనా. ఈనెల మూడో తేదీన 33,700 పిడుగులు పడ్డాయని.. మళ్లీ 13న 41,100 పడ్డాయని అనధికారిక సమాచారం. అలాగే, సోమవారం నాడు మరో ముగ్గురు మరణించారు.

పిడుగు పడటం అంటే..
ఒక మేఘం మరో మేఘంగానీ, ఒక మేఘంలోని అణువులుగానీ రాసుకుంటే విద్యుదాఘాతం ఏర్పడుతుంది. ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి విద్యుత్‌ వెళ్తే భారీ వెలుతురు కనిపిస్తుంది. దానినే మెరుపు అంటారు. విద్యుదాఘాతం ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి కాకుండా భూమివైపు రావడాన్ని పిడుగు అంటారు. ఈ సమయంలో మిలియన్‌ వోల్టుల విద్యుత్‌ ఉత్పత్తవుతుంది. ఇది కిరణంలా నేలవైపు వస్తున్న క్రమంలో ఆ మార్గం తీవ్రంగా వేడెక్కుతుంది. దీంతో గాలి పక్కకు వ్యాకోశం చెందుతుంది. అందువల్లే పిడుగు పడే సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. ఒకవేళ చెట్లపై కానీ, మనుషులపై కానీ అవి పడితే పడితే కాలిబొగ్గయినట్లు మాడిపోతారు. దీనిని బట్టే దానిలో ఎంత అధిక విద్యుత్‌ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఆకాశం నుంచి భూమిపైకి వచ్చే సమయంలో పిడుగు అనువైన మార్గాన్ని వెతుక్కుంటుంది. అందువల్లే పిడుగు పడే దగ్గర ఎత్తయిన చెట్లు ఉంటే వాటి మీదే ఎక్కువగా పడుతుంటాయి. 

భూతాపం పెరగడమే కారణం
పిడుగుపాట్లు పెరగడానికి భూతాపం ప్రధాన కారణమని నిపుణులు తేల్చారు. వేసవి కాలంలోనే ఇవి ఎక్కువగా పడుతుండటం ఇందుకు నిదర్శనం. ‘గాలిలో కార్బన్‌ డైయాక్సైడ్‌ 70 ఏళ్ల క్రితం 0.03 శాతం ఉండేది. ఇప్పుడిది 0.041 శాతానికి పెరిగిందని ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ నిపుణులు తేల్చారు. చెట్లు ఎక్కువగా ఉంటే కార్బన్‌ డైయాక్సైడ్‌ను ఇవి పీల్చుకుంటాయి. కానీ, పచ్చదనం తగ్గడంలో వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయి’.. అని రిటైర్డ్‌ ప్రొఫెసర్, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ పురుషోత్తమ్‌రెడ్డి తెలిపారు. ఇసుక తుపాన్లకు కూడా ఇదే కారణమని ఆయన వివరించారు. ‘రకరకాల అవసరాల కోసం చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నారు. తర్వాత ఆ స్థాయిలో మొక్కలు నాటడంలేదు. అలాగే, ఎక్కువ లోతు వరకూ ఇనుము, సున్నపురాయి, గ్రానైట్‌ తదితర ఖనిజాలు తవ్వడంవల్ల భూగర్భ జలమట్టం కిందకు పోతుంది. ఇది కూడా భూతాపం పెరగడానికి కొంత కారణమవుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో పిడుగుపాట్లను ముందుగా పసిగట్టే పరిజ్ఞానం లేదు. కానీ, ప్రస్తుతం ఏ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందనే విషయం అరగంట ముందే తెలుసుకునే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. 

పిడుగుల వర్షం ఆశ్చర్యకరమే
రుతుపవనాలకు ముందు వేల పిడుగులు పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది అసాధారణ వాతావరణంగా అనిపిస్తోంది. కొన్నాళ్ల నుంచి అల్పపీడన ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు సముద్రం నుంచి ఎక్కువగా తేమగాలులు వీస్తున్నాయి. వాతావరణంలో అనిశ్చితి ఏర్పడుతోంది. వీటికి భూతాపం కూడా తోడవుతోంది. ఫలితంగా ఆకాశంలో అప్పటికప్పుడు క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ పిడుగులు పడడానికి దోహదం చేస్తున్నాయి. ఉత్తరాదిలో ఇసుక తుపానుకు కారణమవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజనుకు ముందు విస్తారంగా వర్షాలు కురుస్తాయి తప్ప ఇంతటి బీభత్సకరమైన పిడుగులు పడడం అరుదు.    
– రాళ్లపల్లి మురళీకృష్ణ, వాతావరణ శాఖ రిటైర్డ్‌ శాస్త్రవేత్త

జాగ్రత్తలివీ..
- పిడుగుపాట్ల సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. విద్యుత్‌ నిలిపివేయాలి. 
బహిరంగ ప్రదేశాల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్యకు తలను వంచి రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలి. 
​​​​​​​- వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులోనే ఉండాలి. పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 
​​​​​​​- పిడుగులు పడే సమయంలో నీటిలో ఉండకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చే నీటికి తాకవద్దు. సెల్‌ఫోన్లు, టీవీలు ఉపయోగించవద్దు. 
​​​​​​​- ఉరుములు, మెరుపుల తర్వాత కనీసం 30 నిమిషాల వరకు బయటకు వెళ్లొద్దు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement