సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా మూడో రోజైన గురువారం కూడా అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులు, వడగండ్లతో విరుచుకుపడింది. భారీ గాలులు, వడగండ్లతో భారీగా పంట నష్టం వాటిల్లింది. చెట్లు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో జనం అవస్థలు పడ్డారు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈదరు గాలులు ప్రభావం, పిడుగు పాటుకు గురువారం ఆరుగురు మృత్యువాత పడ్డారు.
ఒక్క గుంటూరు జిల్లాలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన నల్లగొండ గోపాలరావు(25), అనంతవరం గ్రామానికి చెందిన తాటిపత్రి ఏసురెడ్డి(40) పిడుగుపాటుకు బలయ్యారు. తాళ్లూరు రాఘవరెడ్డికి గాయాలయ్యాయి. గుంటూరు లక్ష్మీపురంలో రోడ్డుపై వెళుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గుంట్ల సురేష్ (27)అనే వ్యక్తిపై హోర్డింగ్ కూలిపోవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పెనుగాలులకు చెట్టు కూలిన సంఘటనలో కర్నూలు నరసింహారెడ్డి నగర్ చెందిన నరసింహ (11) అనే బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతాండాలో పిడుగుపాటుతో పరమేష్ నాయక్(28)అనే యువకుడు మృతిచెందాడు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం చెన్నుపల్లిలో పిడుగుపాటుకు కుమ్మరి అంజమ్మ అనే మహిళ మృతి చెందింది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో నాలుగు ఇళ్లు కూలిపోగా ఒక మహిళ సహా ముగ్గురు గాయపడ్డారు.
జనజీవనం అస్తవ్యస్తం
వర్ష బీభత్సంతో పలు జిల్లాల్లో గురువారం జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి విశాఖపట్నం సిటీతో పాటు జిల్లావ్యాప్తంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బీచ్ రోడ్‌లో ఉదయం పూట రాకపోకలు స్తంభించిపోయాయి. జీవీఎంసీ కార్యాలయం ముంపునకు గురైంది. విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో కేజీహెచ్‌లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేజీహెచ్ చిన్న పిల్లల వార్డులోకి మోకాళ్ల లోతు వర్షం చేరడంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. విజయనగరం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. గుంటూరు నగరంలో దుమ్ముతో కూడిన గాలికి ప్రజలు చెల్లాచెదరు అయ్యారు. కర్నూలు జిల్లా పాణ్యంలో గాలుల తీవ్రతకు షెడ్డు కూలిపోవడంతో కోళ్లు మృతి చెందాయి. చిత్తూరు జిల్లా తిరుపతి, పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతి గోవిందరాజ సత్రం ప్రాంతమంతా జలమయమైంది. పెనుగాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
రైల్వే విద్యుత్ లైన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో తిరుపతి వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును గంటన్నర పాటు ఆపేశారు. విజయవాడ వెళ్లాల్సిన పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను కావలి రైల్వేస్టేషన్‌లో ఆపేశారు. రాత్రి 7.30 గంటల వరకు ఈ పరిస్థితి కొనసాగింది.
వరుస వర్షాలతో పంట నష్టం అపారం
వరుసగా మూడో రోజు అకాల వర్షాలు ముంచెత్తడంతో పలు జిల్లాల్లో పంట నష్టం భారీగా వాటిల్లింది. రాష్ట విపత్తు నిర్వహణ శాఖకు గురువారం సాయంత్రానికి అందిన ప్రాథమిక అంచనా ప్రకారం 14,458 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు గ్రామాల్లో పొలాలవారీగా నష్టాన్ని పరిశీలించి నివేదికలు పంపేసరికి నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనధికారిక సమాచారం ప్రకారం 35 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో మామిడి కాయలు నేలపాలవ్వగా, అరటి చెట్లు కూలిపోయాయి. విజయనగరం జిల్లాలో సుమారు 2వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది.
వేయి ఎకరాల్లో మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. కృష్ణా జిల్లాలో 1800 ఎకరాల్లో మొక్కజొన్న, 150 ఎకరాలు పసుపు, 1200 ఎకరాల్లో మామిడి, 250 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, పసుపు నీట మునగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పీలేరు, చంద్రగిరి ప్రాంతాల్లో సుమారు 200 హెక్టార్ల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో బొప్పాయి తోటల్లో కాయలు రాలిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, పొన్నూరు, కొల్లూరు మండలాల్లో వందల ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. రొంపిచర్ల మండలంలో కోసిన వరి పంట వందల ఎకరాల్లో నీట మునిగింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని కొనుగోలు కేంద్రాల్లో శనగలు, మినుమలు తడిసి పోయాయి. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మామిడి, అరటి, బొప్పాయి పంటలు నేలలి రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.
నేడు ఉరుములతో కూడిన వర్షం!
– బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు
సాక్షి, అమరావతి: రాబోయే 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో విదర్భ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా వద్ద మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం గురువారం రాత్రి ప్రకటించింది. ఉపరితల ఆవర్తనాలకు క్యుములోనింబస్ మేఘాలు తోడు కావడంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుల వర్షం కురుస్తోంది. ఇదే పరిస్థితి మరో 24 గంటలు కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, కొన్ని చోట్ల వడగండ్లుతోపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల వడగండ్లు, పిడుగులు పడతాయి’ అని ఐఎండీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment