
సాక్షి, విజయవాడ : రాగల 48 గంటలలో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళఖాతంతో పాటి మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో మే 31వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కూడా ఉందని తెలిపింది. (ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం)
పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది మరింత బలపడిందని వెల్లడించింది. దీంతో రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు ఒమన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:
ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41వినుండి 44వి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41° నుండి 44° నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.